Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక న్యాయం కోసం తీసుకునే ప్రత్యేక చర్యలకు, ప్రతిభకు మధ్య పోటీ లేదని మరోసారి సర్వోన్నత న్యాయస్థానం నొక్కి వక్కాణించింది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యర్ధుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్లో ఒబిసిలకు 27శాతం కోటా అమలును సుప్రీం కోర్టు సమర్థించింది. ఆర్థికంగా వెకబడిన వారి (ఇడబ్ల్యుఎస్) కోటా సైతం సక్రమమేనంది. 2021-22 విద్యా సంవత్సర ప్రవేశాలకు గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం సవివరంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రిజర్వేషన్ల అంశం ముందుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రతిభతో ముడిపెట్టి కొందరు కుహనా వాదనలు చేసి విషయాన్ని పక్కదారి పట్టించడం చూస్తున్నదే. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇది ఎక్కువైంది. నీట్ అడ్మిషన్ల వ్యవహారంలోనూ అంతే. ఒబిసి కోటాను న్యాయస్థానంలో సవాల్ చేశారు. దాంతో మరోసారి రిజర్వేషన్లు చర్చనీయాంశంగా మారాయి. కోర్టు అలాంటి తప్పుడు చర్చకు ఫుల్స్టాప్ పెట్టింది. రిజర్వేషన్లు మెరిట్‌కు విరుద్ధం అన్న వాదనను నిర్ద్వందంగా తిరస్కరించడమే కాదు అలాంటి వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని తన తీర్పులో స్పష్టీకరించింది. అంతేకాదు, ఇలాంటి విషయాల్లో రిజర్వేషన్లు కల్పించే ముందు ఇకపై సుప్రీం కోర్టు నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఉన్నత న్యాయస్థానం తాజా తీర్పు రిజర్వేషన్లను ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా తెగనాడే వారికి చెంపపెట్టు వంటిది.
కోర్టు విచారణ సందర్భంగా ముందుకొచ్చిన వాదనలు అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఎంత అవసరమో, ఎంత న్యాయబద్ధమో తార్కికంగా చర్చించాయి. మెడికల్ వంటి రంగాల్లో ప్రతిభ లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు ఇక్కడా పాత పాటే పాడారు. అంతేనా, క్రీమిలేయర్ విధానాన్నీ ముందుకు తెచ్చి కోటాలో ఎంబిబిఎస్ చదివిన అభ్యర్థులకు పీజీలో, సూపల్ స్పెషాలిటీలో కోటా అమలు చేస్తే దేశం వెనక్కి పోతుందన్నారు. కాగా ప్రతిభకు రిజర్వేషన్లు ఎలా అడ్డు కాదో న్యాయస్థానం తాత్వికంగా నిరూపించింది. అత్యధిక మార్కులు సాధించిన వారు మంచి పనులు చేయకపోతే, అలాంటి వారిని ప్రతిభావంతులు అవవచ్చునా అన్న కోర్టు ధర్మ సందేహం ఎంతో ఆలోచనాత్మకమైనది. బహిరంగ పోటీ అనేది అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే, ఆ అవకాశాలు వెనకబడ్డ వర్గాలు పొందేందుకు రిజర్వేషన్లు అవకాశం కల్పిస్తాయి. ఈ క్రమంలో రిజర్వేషన్లు మెరిట్‌కు అడ్డంకి ఎంత మాత్రం కాదు. అవి ప్రభావశీల పంపిణీని ప్రోత్సహిస్తాయి. కొన్ని తరగతులు పొందే సామాజిక, ఆర్థిక ప్రయోజనం పోటీ కానేరదు. ఈ ఆచరణాత్మక వాస్తవ దృక్పథాన్ని న్యాయస్థానం మరోసారి ప్రస్తావించింది.
తరతరాలుగా మన వ్యవస్థలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థ సమాజిక, ఆర్థిక అంతరాలను ఘనీభవింపజేసింది. వ్యవస్థీకృత అడ్డంకుల వలన కొన్ని వర్గాలకు అవకాశాలు ఉండవు. హక్కులు, అవకాశాలకు దూరమైన వారికి సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లే మార్గం. రిజర్వేషన్ల వంటి ప్రత్యేక అవకాశాలు కల్పిండం ద్వారా అలాంటి వారు అడ్డంకులను అధిగమించి ఇతర వర్గాలతో పోటీ పడటానికి వీలవుతుంది. అభివృద్ధి చెందిన వారికి నాణ్యమైన పాఠశాల విద్య, కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. పోటీ పరీక్షలకు అన్ని విధాలా సిద్ధం అవుతారు. మెరిట్ అనేది కేవలం ఒకరి స్వయంకృషి అని చెప్పలేమని, కుంటుంబ నేపథ్యం, అవకాశాలను బట్టి అది ఉంటుందన్న న్యాయస్థానం వ్యాఖ్య సముచితోక్తి. మెడికల్‌లో 2021లోనే ఒబిసి కోటా వచ్చింది. అదీ ఆలిండియా ఇనిస్టిట్యూట్లలో మాత్రమే. అంతకుముందు అవీ లేవు. రాష్ట్రాల్లో అసలే లేవు. 2007 నుండి ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం అమలవుతున్నాయి. మెడికల్ వంటి సంస్థల ప్రవేశాలకు మెజార్టీ వర్గాలు దూరంగా ఉండటం సామాజిక అసమానతలను పెంచుతుంది. అన్ని చోట్లా అణగారిన, వెనకబడ్డ వర్గాలకు కోటా అవసరం ఎంతైనా ఉంది. మను సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న వేళ రిజర్వేషన్ల ఆవశ్యకతను సుప్రీం కోర్టు చాటి చెప్పడం మంచి పరిణామం.