Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టాక్‌మార్కెట్లలో నెలకొంటున్న అనిశ్చితి మదుపర్లను బెంబేలెత్తిస్తోంది. సోమవారం వరకు ఐదు రోజుల పాటు సాగిన ఈ మహా పతనంలో 19.50 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరై ఉంటుందని అంచనా! సోమవారం ఒక్కరోజే 9.13 లక్షల కోట్ల రూపాయలు మన మార్కెట్ల నుండి మాయమైనాయి. ఇది రెండు నెలల్లోనే అతి పెద్ద నష్టంగా చెబుతున్నారు. మంగళవారం మార్కెట్లు కొంత పుంజుకున్నప్పటికీ నామమాత్రమే! గణతంత్ర దినోత్సవం కావడంతో బుధవారం సెలవు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం సంక్షోభం ఇప్పుడప్పుడే తొలిగిపోయే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని, కనీవిని ఎరుగని పతనాలను చూడాల్సి వస్తుందని కూడా వీరు అంచనా వేస్తున్నారు. ఈ తరహా సంక్షోభాల్లో ఇప్పటివరకు నష్టపోయింది.. భవిష్యత్తులో నష్టపోయేది.. సామాన్య మదుపరులే అన్నది ఓ చేదు నిజం! సంపద ఆవిరి అవుతోందంటే అర్ధమేమిటి? గాలిలో కలిసి పోతుందని కాదు కదా! అంత విలువైన మొత్తాన్ని ఏ ఒక్కరో, కొద్దిమందో చేజిక్కించుకుని మరెక్కడకో తరలిస్తున్నారనే గదా! లేకపోతే, సంక్షోభం వచ్చిన ప్రతిసారీ కోట్లాదిమంది సామాన్య మదుపర్లు లబోదిబోమంటుంటే కొద్దిమంది సంపద మాత్రం అనూహ్యంగా ఎలా పెరుగుతుంది? భవిష్యత్తుపై గంపెడాశతో సామాన్యులు మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన కొద్దిపాటి మొత్తాన్ని ఎదో ఒక ధరకు తెగనమ్ముకునే పరిస్థితి ఎందుకు ఏర్పడు తోంది? పెట్టుబడీ దారి వ్యవస్థ అంటేనే సంక్షోభాల మయం అన్న సంగతి తెలిసిందే. ఒక సంక్షోభం నుండి మరో సంక్షోభానికి సాగే ఈ ప్రయాణంలో ప్రతిసారీ సామాన్యులే సమిధలుగా మారుతున్నారన్నది స్టాక్ మార్కెట్ల జూదర నేర్పే పాఠం.
అమెరికన్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్నది తాజా పతనానికి మొదటి కారణం. ఎక్కడో అమెరికన్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచితే మన దేశంలో స్టాక్ మార్కెటు కుప్పకూలడ మేమిటి? సరళీకరణ విధానాల్లో భాగంగా పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయంటూ మన పాలకవర్గాలు ప్రచారం చేసుకున్న విదేశీ పెట్టుబడులు ఈ పరిస్థితికి ఒక కారణం. ఉత్పత్తి రంగంలోకి కూడా వ్యవస్తీకృత పెట్టుబడులుగా మార్కెట్లోకి వచ్చి చేరే ఈ నిధులు నిజానికి వాపే కానీ బలుపు కాదు. ఎక్కడ లాభం వస్తుందనుకుంటే అక్కడికి తరలిపోయే లక్షణం ఈ తరహా పెట్టుబడికి ఎక్కువ. కరోనా కారణంగా అనేక దేశాలు పెద్ద ఎత్తున ఉద్దీపన పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫలితంగా ద్రవ్యోల్భణం ముంగిట ఆ దేశాలు నిలిచాయి. అమెరికా కూడా దీనికి అతీతం కాదు. ముంచుకొచ్చే ద్రవ్యోల్భణం నుండి బయటపడటానికి వడ్డీరేట్లను పెంచడం మార్గంగా అక్కడి ఫెడరల్ (రిజర్వు) బ్యాంకు భావిస్తోంది. షేర్ మార్కెట్లో వచ్చే ఆదాయం కన్నా డిపాజిట్ల మీద వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండటంతో విదేశీ పెట్టుబడి అక్కడికి తరలిపోతోంది. దానితో చెట్టపట్టాలేసుకున్న స్వదేశీ పెట్టుబడి కూడా రెక్కలను తొడుక్కుంటోంది. ఫలితంగా దేశీయ మార్కెట్లు కుప్పకూలు తున్నాయి. రిటైర్మెంటు డబ్బుతోనో, స్థిరాస్తులను విక్రయించో అధిక ధరలకు షేర్లు పొందిన సామాన్యులకు దిక్కుతోచని స్థితి ఏర్పడుతోంది. కండ్లముందే తమ పెట్టుబడులు కరిగిపోతుంటే, ఎంతోకొంతకు తెగనమ్మి చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. స్టాక్ మార్కెట్ పతనంతో పాటు విదేశీ మారకపు నిల్వలు కరిగిపోయే ప్రమాదం కూడా ఉండటంతో రూపాయి విలువ కూడా పడిపోతోంది. దీని ప్రభావం స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండే సామాన్యుల మీద కూడా పడనుంది.
సొంత కాళ్లమీద నిలబడటం మానేసిన పాలక వర్గాలు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ పెట్టుబడికి కొమ్ము కాసే విధానాలను అమలు చేయడమే ఈ పరిస్థితికి కారణం. మన ఆర్థిక సంస్థలు ప్రభుత్వరంగంలో బలంగా ఉంటే ఇటువంటి షాక్‌ల నుండి తట్టుకునే చేవ వస్తుంది. మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి అట్టహాసపు మాటలు చెప్పే నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఉత్పాదన రంగం వైపు పెట్టుబడులను మళ్లించి, ఉపాధి కల్పన పెద్ద ఎత్తున చేపట్టి ప్రజల కొనుగోలు శక్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచడమే ఈ తరహా సంక్షోభాలకు పరిష్కారమార్గం. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడంతో పాటు, నూతన అవకాశాల వైపు విస్తరించాలి. ప్రజల కొనుగోలు శక్తి పటిష్టంగా ఉన్నంతకాలం మార్కెట్టు నిలదొక్కుకుంటుంది. సామాన్యుల సంపదకు కనీస భద్రత లభిస్తుంది.