Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్న 25న తుర్కయాంజాల్‌లో ముగిసిన భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర 3వ మహాసభ అత్యంత జయప్రదమైంది. నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కీలకమైన కార్యదర్శివర్గంలోకి రెండు ప్రధాన వర్గ సంఘాలు రెండు సామాజిక రంగాల నుండి సాపేక్షంగా యువ నాయకత్వం ప్రవేశించింది. సీపీఐ(ఎం)లో సీల్డ్‌కవర్‌లు లేవు. కార్యవర్గాలను నాయకులు ఇష్టానుసారం నియమించుకునే సంస్కృతిలేదు. సమిష్టి నాయకత్వంలో నడిచే పార్టీలో కులాలకు పీటల్లేవు. పీఠాల్లేవు. ఒక కమ్యూనిస్టు పార్టీ జీవితంలో మహాసభలు కొత్తకాకపోయినా జరిగిన సందర్భం కీలకమైంది. నయా ఉదారవాద విధానాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో కమ్యూనిస్టు సిద్ధాంతం అనాకర్షణీయమైంది. ''మనం, మనది'' స్థానంలో ''నేను, నాది'' వచ్చి కూర్చుంది. 'సమిష్టి' స్థానంలో 'వ్యక్తి' వికటాట్టహాసం చేస్తున్నాడు. జావగారి నిర్వీర్యమయ్యే పార్టీలు కొన్ని, ఆశయాలుడిగిపోయి విచ్ఛిన్న మార్గాల్లో నడిచే పార్టీలు మరికొన్ని.. ఇదీ నేటి అనేక కమ్యూనిస్టు పార్టీల స్థితి. ఈ స్థితిలో సుమారు ముప్పయివేల మంది పార్టీ సభ్యులను ప్రాథమిక కమ్యూనిస్టు సిద్ధాంతానికి అంకితమయ్యేలా నిలపడం అపురూపమైన విషయం. కొన్ని చిన్న లోపాలున్నా పార్టీ తెలంగాణ కమిటి దీనిలో జయప్రదమయ్యింది. అవకాశమున్న అంశాలన్నింటిలోనూ ఆయా ప్రజల్ని పోరాటాల్లోకి తేగలిగింది. అది పోడు రైతుల పోరాటమైనా, ధర్నాచౌక్ పునరుద్ధరణ అయినా అన్ని పార్టీలను కదిలించగలిగింది. పాలక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెనక్కి కొట్టగలిగింది. కార్యకర్తల్ని నిలబెట్టుకోగలగడం, ప్రజల్ని పోరాటాల్లోకి దించగలగడం, పాలకుల్ని వెనక్కి కొట్టగలగడానికి మించి ఒక కమ్యూనిస్టుపార్టీ జీవితంలో మిన్న అయిన విజయపథాలేముంటాయి?
గత నాలుగేండ్లలో రాష్ట్రంలో పార్టీ అవలంబించిన రాజకీయ విధానం కత్తిమీద సాములాంటిది. సీపీఐ(ఎం) వంటి విప్లవ కమ్యూనిస్టుపార్టీ అఖిల భారత స్వభావం కలిగి ఉంటుంది. అఖిల భారత విధానానికి లోబడే రాష్ట్ర విధానం ఉండాలి. 2014లో కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకున్న మనువాద శక్తులు క్రమంగా నయా ఉదారవాద విధానాలను బలంగా అమలుచేస్తూ తమ మతోన్మాద ఎజెండాతో ముందుకు సాగుతున్నది. రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 370 రద్దయింది. మతం ఆధారంగా పౌరసత్వం నిర్ణయించేందుకు సిద్ధమవుతున్నారు. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా అయోధ్యలో ప్రధాని, ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకులే స్వయంగా భూమిపూజ నిర్వహించారు. అంతేనా?! మహాసభలో ప్రకాష్‌కరత్ చెప్పినట్టు అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయి. సామాజిక న్యాయానికి ఘోరీకడుతున్నారు. అందుకే బీజేపీని తెలంగాణలో పురోగమించనీయ్యరాదు. కాని మన రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ప్రజావ్యతిరేకంగా ఉంది. దానిలోపాలను చూపించి పెరిగే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ నిర్దిష్ట పరిస్థితిలో సాగర్‌లోనైనా, హుజురాబాద్లోనైనా పార్టీ తన విధానాన్ని రూపొందించుకుంది. ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిష్కర్షగా, నిర్మొహమాటంగా ప్రతిఘటించాలని మహాసభ పిలుపునిచ్చింది.
తన పొరపాట్లను నిర్మొహమాటంగా అంగీకరించి ఆత్మవిమర్శ చేసుకునే కమ్యూనిస్టు పార్టీ తన వర్గానికి నిజాయితీగా కట్టుబడి ఉంటుందని 'లెనినిజం పునాదులు'లో స్టాలిన్ వివరిస్తాడు. అందుకు చక్కటి ఉదాహరణ సీపీఐ(ఎం) తెలంగాణశాఖ. బి.ఎల్.ఎఫ్. ఏర్పాటు, దానిపై పి.బి. సి.సి. విమర్శ,, దాన్ని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణతో సరిచేసుకోవడంతో కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసింది. ఆ సందర్భంగా జరిగిన లోటుపాట్లను సరిచేసుకుని రాష్ట్రంలో ''వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను, సామాజిక, సాంస్కృతికోద్యమాలను సమీకరించి, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాల''ని 3వ మహాసభ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం యెడల, బీజేపీ యెడల టీఆర్ఎస్ అవలంబించే మెతక వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని కూడా రాష్ట్ర మహాసభ నిర్ణయించింది.
ప్రతినిధుల పొందిక ఆశావహంగా ఉంది. 50ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మొత్తం ప్రతినిధుల్లో 55శాతం కాగా, సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నుండి 70శాతం మంది పాల్గొన్నారు. యువతను మరింతగా ఆకర్షించాలని మహాసభ నిర్ణయించింది. 'యంగ్ కమ్యూనిస్టు స్టడీ సర్కిల్' వంటివి పట్టుదలగా నిర్వహించాలని నిర్ణయించింది.
మిగతా బూర్జువా పార్టీల్లాగా కాకుండా మన తెలంగాణ సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజల పరిస్థితులు, వాటి కారణాలు, పరిష్కారాలపై 60తీర్మానాలను మహాసభ ఆమోదించింది. వాటిపై రానున్న రోజుల్లో ప్రజల్ని కదిలించి పోరాడాల్సిన ఆవశ్యకతను మహాసభ నొక్కి చెప్పింది.
సీపీఐ(ఎం) తెలంగాణలో నిర్లక్ష్యం చేయగల్గిన శక్తికాదు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిదాన్నీ ప్రజల్లో ఎండగడుతోంది. ఇతరులను కూడగడుతోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టగలుగుతోంది. తన శక్తివంతమైన సిద్ధాంత వెలుగులో సుదూర ప్రాంతంలో ఉన్న ప్రమాదాన్ని కూడా పసిగట్టగలదు. అందుకే, రాష్ట్రంలో పెద్దశక్తిగా లేకున్నా అందరి మన్ననలూ పొందగలుగుతోంది. తలలో నాలుకగా ఉండగలుగుతోంది.