Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం కోసం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన విశిష్ట వ్యక్తుల గౌరవార్థం ఏర్పడినవే ''పద్మ'' పురస్కారాలు. కానీ ఈ అత్యున్నత పురస్కారాలు సైతం అధికార వ్యామోహాలకు సోపానాలుగా మారిపోతుండటం అవాంఛనీయం. ఇది ఆ అవార్డుల ప్రతిష్టకే అవమానకరం. మట్టిలో మాణిక్యాల్లాంటి కొందరు ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడం అభినందనీయమేగానీ, ఈసారి పద్మాల ప్రకటనలో ఎక్కువగా రాజకీయవాసనలే ఉండటం ఆక్షేపణీయం. అయినా ఈ పురస్కారాల్లోకి రాజకీయాలు చొరబడి చాలా కాలమే అయింది. కాకపోతే ''కమలాలు'' అధికారంలోకొచ్చాక ''పద్మాలు'' మరింతగా తమ పరిమళాలను కోల్పోతున్నాయి. రాజకీయాలు ప్రజల కోసం అనుకునే ఆదర్శవాదులకూ, కాదు పదవుల కోసమే అనుకునే అధికార వ్యామోహులకూ తేడా ఏమిటో వివరిస్తున్నాయి.
ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూడకూడదన్నది నిజమేగానీ, అలా చూడకూడదనుకున్నా అందులో రాజకీయాలు మాత్రమే కనిపిస్తుండటం అంతకన్నా నిజం...! కాంగ్రెస్ అసమ్మతి గ్రూప్‌గా పిలువబడుతున్న ''జీ23'' నాయకుడు గులాం నబీ అజాద్‌కు, దివంగత బీజేపీ నేత కళ్యాణ్‌సింగ్‌కు పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు ప్రతిపక్షీయులకూ నిజాయితీగా అవార్డులిచ్చి గౌరవించడం ప్రశంసనీయమే. ఇలా గౌరవించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. కానీ గులాం నబీ అజాద్ అవార్డు వెనుక మాత్రం ఆ నిజాయితీ కనిపించడంలేదన్నది విమర్శకుల మాట. రాజ్యసభలో అజాద్ పదవీ విరమణ సందర్భంలో ప్రధాని మోడీ ''కన్నీటిపర్యంతమైన'' నాటి నుండే, కాశ్మీర్లో కాషాయ ప్రయోజనాలకు అతడినో పావుగా ప్రయోగించబోతున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కనుక, ఇప్పుడు దానికి కొనసాగింపే ఈ పద్మభూషణమని అభిప్రాయాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యమేముంటుంది? అందుకే, ఇది కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్న అసమ్మతిని మరింత తీవ్రం చేసి అజాద్‌ను ఆ పార్టీకి మరింత దూరం చేయడానికి ఉద్దేశించిందేనన్న విమర్శకుల వ్యాఖ్యను అంత తేలిగ్గా కొట్టిపారాయలేం.
ఇక బాబ్రీ విధ్వంసానికి కారకుల్లో ఒకరైన కళ్యాణ్‌సింగ్‌కు పద్మవిభూషణ్ ప్రకటించడం కూడా తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని తొలిసారిగా అధికారంలోకి తెచ్చిన నేతగా ఆ పార్టీకి ఆయనపట్ల గౌరవముంటే ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రిగా, ప్రభుత్వాధినేతగా దేశభద్రతను గాలికొదిలి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసుల చేతులు కట్టేసి, కరసేవకుల మసీదు కూల్చివేతకు అవకాశం కల్పించినవాడికి ఇంతటి ఉన్నత పురస్కారమివ్వడమేమిటి? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయ లక్ష్యాలు సాధించడానికేనా? యూపీలో ఓబీసీలంతా బీజేపీకి దూరమవుతున్న నేపథ్యంలో లోథ్ కులస్థులను ఆకర్షించడానికేనా? కళ్యాణ్‌సింగ్ లోథ్ కులస్థుడు కావడం, ఆ రాష్ట్రంలో యాదవులు, కుర్మీల తరువాత స్థానం వారిదే కావడం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. రాష్ట్రం ఎన్నికలకు వెళుతున్న వేళ ఒక నిస్సంకోచమైన రాజకీయ సందేశాన్ని ఇవ్వడానికే ఈ ఎంపిక అనడంలో సందేహమేమీలేదు.
సీపీఐ(ఎం) నేత, బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య తనకు పద్మభూషణ్ వద్దని చెప్పడం కూడా ఓ చర్చగా మారింది. ''ఆయన గులాంగా పురస్కారాలకు తలవంచలేదు.. ఆజాద్‌గా తిరస్కరించారు'' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్, ట్వీట్స్ వెలువడుతున్నాయి. గతంలో కూడా ఆ పార్టీ అగ్రనేతలు జ్యోతిబాసు ''భారతరత్న''ను, నంబూద్రిపాద్ పద్మవిభూషణ్‌ను తిరస్కరించారు. అప్పుడు జ్యోతిబసు, నంబూద్రిపాద్లైనా, ఇప్పుడు బుద్దదేవ్ అయినా.. తమ లక్ష్యం ప్రజాసేవే తప్ప పురస్కారాలు కాదన్న పార్టీ విధానానికి అనుగుణంగానే ఈ పని చేసారు. మరో ఇద్దరు బెంగాలీ కళా ప్రముఖులు అనింద్య చటర్జీ, సంధ్యా ముఖర్జీలు కూడా ఈ అవార్డులు తమకు ఎప్పుడో రావాల్సివుండగా ఇప్పుడు ఇవ్వడమేమిటని తిరస్కరించారు. కాగా దేశంలో అర్హులైనవారెందరినో పక్కన పెట్టి, దేశానికి ప్రత్యక్ష సేవలేమీ అందించని గూగుల్ సీఈవో సుందర్ పిచారు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అవార్డులు ప్రకటించడంపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోవిడ్ నరమేధాన్ని సైతం తమ బొక్కసాలు నింపుకోవడానికే వాడుకున్న ''ఎల్లా''లు, ''పూనావాలా''లను పద్మాలంకృతలను చేయడం కూడా మోడీ విరచిత 'స్కీం'లో భాగమేనేమో!
ముందే చెప్పుకున్నట్టు పురస్కారాల్లో రాజకీయాలు ఈ దేశానికి కొత్తేమీకాదు గానీ, వీటిని సైతం ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవడం మోడీ ఏలుబడిలో పరిపాటిగా మారింది. గతేడాది ప్రకటించిన పద్మాల్లో మూడొంతులు ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలకు తరలిపోగా, ఈ ఏడాది కూడా పదమూడు పద్మాలు కేవలం ఉత్తరప్రదేశ్‌కే దక్కడం గమనార్హం! శాస్త్రవేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, కళాకారులు, వ్యాపారవేత్తలు, వ్యాక్సిన్ తయారీ దారులెందరో ఈ పద్మాల జాబితాలో ఉన్నప్పటికీ, ఈ ఎంపికలో బీజేపీ మార్క్ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తుండటం కాదనలేని సత్యం.