Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాత్ముని గుండెలపై కర్కశంగా తూటాలు పేలినరోజిది. హేరామ్ అంటూ గాంధీ గొంతుక చివరిమాటల్ని పలికిన రోజు. భారతీయులంతా ప్రేమగా ''బాపూ'' అని పిలుచుకుంటూ జాతిపితగా గౌరవించుకున్న మోహన్‌దాస్ కరంచంద్‌గాంధీ హత్య గురించి చర్చించకపోతే నేటి అధికార రాజకీయ గమనాన్ని అర్థం చేసుకోలేము. ఎందుకంటే మహాత్ముని రక్తం కళ్ళజూసిన నాధూరాం గాడ్సే దేశభక్తుడని బహిరంగంగా ప్రవచిస్తున్న నాయకమన్యుల విన్యాసాలను చూస్తున్నాం మనం. హంతకుల వారసత్వానికి గర్వపడే ఆలోచనాపరుల పరంపరను ప్రత్యక్షంగానే కంటున్నాం.
ఇలాంటి సన్నివేశాలను ఇంతకు క్రితం ఎప్పుడూ కనలేదు, వినలేదు కూడా. ఒకవైపు గాంధీ విగ్రహం నీరాజనాలు అందుకుంటుంది, నమస్సులు గైకొంటుంది. శాంతికాముక వచనం గొంతు విప్పుతుంది. మరోవైపు అదే గొంతుకతో, అవే చేతులతో గాడ్సే విగ్రహం మాలాంకృతమవుతుంది. విచిత్రం కదూ! ఎవరి అనుచరులం మనం! ఎవరి ఆలోచనలకు వారసులం మనం! ఇప్పుడు స్పష్టపరచుకోవాల్సింది ఈ దృశ్యాన్ని చూస్తున్న మనమే. అందుకనే ఆనాటి మహాత్ముని హత్యోదంతపు ఉగ్రవాద చర్య నుండి కల్బుర్గీ, పన్సారే, గౌరీలంకేష్, అఖ్లాక్.. ఇంకా అనేకానేక హత్యా ప్రస్థానాలను సమగ్రంగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా నేటి తరం వివరంగా తెలుసుకోవల్సి ఉంది. పైపై మాటలకు, రూపాలకు, అంతర్విధానాల రూపకల్పనలకూ ఎంతెంత వైరుధ్యమున్నదో శోధించాలి. సత్యాన్ని పట్టుకోవాలి.
ఎందుకంటే గాంధీ సత్యశోధకుడు. సత్యాహింసలను రాజకీయరంగాన విస్తృతంగా ప్రచారం చేసినవాడు. ఆయనన్నట్లుగానే సత్యము, అహింస అనే సూత్రాలు నేలమీది ప్రాచీన కొండలంత పురాతనమైనవే. ముఖ్యంగా మన భారతీయ తాత్వికతల్లోని సారాన్ని బౌద్ధ, జైన, వైదిక ప్రబోధాల లోంచి గ్రహించి తనను తాను మలచుకొన్నవాడు గాంధీ. నిరాడంబరుడిగా జీవించాడు. ఏదైతే నమ్మాడో అదే చెప్పాడు. ఏది చెప్పాడో అదే చేసే ప్రయత్నం చేశాడు. మాటకూ చేతకూ సమన్వయాన్ని కుదుర్చుకోగలిగాడు. కొన్ని పరిమితులు, లోపాలు ఉన్నప్పటికీ గాంధీ, సమస్త భారతీయులను కదిలించగలిగాడు. తన భావాలతో ఎంతోమందిని ప్రభావితం చేయగలిగాడు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక పరిస్థితులను, సవాళ్ళను అధిగమించటానికి, ఈ పూర్వానుభావాలన్నింటినీ అధ్యయనం చేయాలి. ఇప్పుడు అనేక నూతన సవాళ్ళు మనముందుకొచ్చి ఉన్నాయి. గాంధీ స్వతహాగా భారతీయ వైదిక మతావలంబకుడు అయినప్పటికీ పరమతసహనం, శాంతిని ప్రదర్శించాడు. అన్ని మతాలూ అన్నదమ్ములవలె కలసి మెలసి ఉండాలని కోరుకున్నాడు. అందుకనే స్వాతంత్య్రం లభించిన సందర్భంలో అందరూ ఉత్సవాల్లో పాలు పంచుకొంటుండగా, గాంధీ కలకత్తాలో జరుగుతున్న మత కలహాలను చల్లార్చటానికి తన సమయాన్ని వెచ్చించారు.
మనం ముఖ్యంగా నేడు అసహనం అనే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నాం. ఒక భిన్నమైన మాటను, భిన్న అభిప్రాయాన్ని, భిన్న మతావలంబనను, సంప్రదాయాన్ని, ఆహారాన్ని, ఆహార్యాన్ని, ఆధ్యాత్మికతను సహించలేని తనం పాలక వర్గాల్లోంచి వస్తోంది. ''అసహనం, అటవికత, ఒత్తిడి ఉండకూడదు. నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తి తీసుకురావడానికి అసహనం పనికిరాదు. అసహనం కార్యాచరణలో వ్యక్తి నమ్మకాన్ని వొమ్ముచేస్తుంది'' అని గాంధీ చెప్పిన మాటకు పూర్తి భిన్నమైన ఆచరణ నేడు చూస్తున్నాం. మనుషులపైన, ప్రజలపైన నమ్మకం లేనివాడు నిఘాలకు పాల్పడతాడు. ప్రశ్నకు బెంబేలెత్తుతాడు. హింసకు పూనుకుంటాడు. ఇవే ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు. డబ్భై ఐదేండ్ల స్వాతంత్య్రానంతరం ఆందోళనలను, నిరసనలను సహించలేని పాలకులు మనముందుకొచ్చారు. ఎవరైతే ఇప్పుడు స్వాతంత్య్రపు అధికారాన్ని అనుభవిస్తున్నారో వారికి బహుశ ఎన్ని నిరసనలు, శాసనోల్లంఘనలు, సహాయ నిరాకరణలు, ఇందుకోసం చేయాల్సి వచ్చిందో తెలిసి ఉండదు. ఆ రకమైన చరిత్రకు వారసులు కానందునే ఉద్యమాలను అవహేళన చేస్తున్నారు. ఆందోళనలు అనవసరమంటున్నారు. 'చెడుకు సహాయ నిరాకరణ చేయడం ప్రతి మనిషి పవిత్ర కర్తవ్యం' అన్న గాంధీ మాటలు ఎంతో విలువైనవో.
మహాత్ముడు అని అంటున్నామంటే ఆయన మానవాతీతుడేమీ కాదు. గొప్ప ఆత్మగలవాడని. ఆత్మ అంటే మనసే. అనగా మంచి మనసున్నవాడనీ అర్థం. కొల్లాయి కట్టుకున్నాడు. చేత కర్రపట్టుకుని నూలువడికాడు. మురికివాడలు శుభ్రం చేశాడు. అన్ని మతాలు, కులాలు సమానమే అన్నాడు. 'ఈశ్వర్ అల్లా తేరేనామ్ సభ్కో సమ్మతి దే భగవాన్' అని పాడుకున్నాడు. అయితే అంటరాని తనాన్ని, అసమానతను రూపుమాపటానికి మానసిక ప్రవర్తన పరిష్కారమని భావించాడు. సమాజంలోని వైరుధ్యాలను తొలగించటానికి వైరుధ్యంలోకి వచ్చేవారికి హానిచేయకుండా వారిలో మార్పు తేవటం ద్వారా వారి నైతిక స్థాయిని పెంచాలని తను భావించాడు. అది నిజమైన పరిష్కారం కాకపోయినా తాను నమ్మినట్టు చేసుకుంటూ పోయాడు. అతి సామాన్యంగా జన్మించి సమాజం నుండి అనుభవ పాఠాలు నేర్చుకుంటూ తనను తాను ఎలా నిర్మించుకోవచ్చో గాంధీ జీవనాన్ని పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. చరిత్ర తన కవసరమైన వ్యక్తులనూ, శక్తులనూ అదే సృష్టించుకుంటుంది. అందులో గాంధీ ఒకరు. అయితే మనం ఇప్పుడర్థం చేసుకోవాల్సింది గాంధీ హత్యానేపథ్య చరిత్రను. నేడు కొనసాగుతున్న పరిణామాలకు అదెలా మాతృకో తెలుసుకోవాలి. మతోన్మాదం స్వమతస్తులను కూడా హతమారుస్తుందన్న నిజాన్ని గాంధీ వర్థంతి రుజువు చేస్తున్నది.