Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వ పెగాసస్ గూఢచర్యం గుట్టురట్టయ్యింది. ఇజ్రాయెల్-భారత్ మధ్య 2017లో జరిగిన రక్షణ పరికరాల ఒప్పందంలో పెగాసస్ ఒక ముఖ్య భాగమని ప్రముఖ అంతర్జాతీయ ఆంగ్ల పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' బాంబు పేల్చింది. విపక్ష నేతలు, హక్కుల కార్యకర్తలు, న్యాయాధికారులు, పాత్రికేయుల ఫోన్లపై నిఘా కోసం పెగాసస్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు పేర్కొంది. 'ప్రపంచ అత్యంత శక్తిమంతమైన సైబర్ ఆయుధం కోసం పోరాటం' పేరిట వెల్లడించిన నివేదిక సంచలనమైంది. దేశంలో పెగాసస్ గూఢచర్యంపై గతేడాది అంతర్జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు, గిట్టనివారి ప్రచారమని మోడీ ప్రభుత్వం తప్పించుకుంది. తాజాగా వెలువడిన 'న్యూయార్క్ టైమ్స్' కథనంతో ప్రభుత్వ పరిస్థితి కన్నంలో దొరికిపోయిన దొంగలా తయారైంది. ఇంతకాలం పార్లమెంట్ లోపల, బయట, చివరికి సర్వోన్నత న్యాయస్థానానికి సైతం ప్రభుత్వం అబద్ధాలే చెప్పిందని తేలిపోయింది. పెగాసస్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని అఫిడవిట్ వేయమని కోరినప్పుడు పొంతనలేని సాకులు చెప్పింది. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలను కోర్టుకు సమర్పించలేమని బొంకింది. రాఫెల్ యుద్ధ విమానాల్లోనూ ఇలాగే చెప్పి బయట పడింది. ప్రతి సందర్భంలోనూ ఆ కారణం చెల్లుబాటు కాబోదన్న సుప్రీం కోర్టు పెగాసస్‌ను వాడారా లేదా అని విచారించేందుకు జస్టిస్ ఆర్వి రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని నియమించాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వంలో కనీస పశ్చాత్తాపం లేదు.
పెగాసస్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందనడాన్ని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించిన అంశాలన్నీ బలపరిచేవే. 2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన ప్రధాని మోడీ, అప్పటి ఆ దేశ ప్రధాని బెంజిమెన్‌తో రూ.15 వేల కోట్ల రక్షణ సంబంధ ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడే చెప్పుల్లేకుండా మోడీ, బెంజిమెన్‌తో సముద్ర తీరానికి వాహ్యాళికి వెళ్లారు. బెంజిమెన్ను దోస్త్‌గా అభివర్ణించారు. బెంజిమెన్ సైతం మన దేశానికొచ్చి అలాగే మోడీని పొగిడారు. ఆ బంధానికి కారణం 'పెగాసస్' భారీ డీల్ అని ఇప్పుడు అర్థమవుతోంది. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నప్పటికీ మోడీ ప్రభుత్వం దర్యాప్తునకు అంగీకరించలేదు. విపక్షాలన్నీ సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జెపిసి) ఏర్పాటు చేయమని కోరినా తిరస్కరిం చింది. సాంకేతిక కారణాలతో సుప్రీం కోర్టు నుండి క్లీన్ చిట్ పొంది అదే తమ సచ్ఛీలతగా ప్రచారం చేస్తోంది. రాఫెల్ విమానాల్లో భారీగా ముడుపులు చేతులు మారాయని ఫ్రాన్స్ కోర్టుల్లో విచారణ సాగుతోంది. తన సచ్ఛీలతను నిరూపించుకొనేందుకు దర్యాప్తు జరిపించాల్సిన మోడీ సర్కారు మాత్రం గమ్మునుంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అజ్ఞాత కార్పొరేట్ల నుండి అత్యధిక మొత్తంలో విరాళాలు పొందిన పార్టీ బీజేపీ. ఈ విషయాలపై నోరు మెదపకుండా అవినీతిపై పోరాడతామని ప్రధాని చెప్పడం గోముఖ వ్యాఘ్రం తంతు కాదా?
ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థ ఎన్ఎస్ఒ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్‌ను 2011 నుండి వివిధ దేశాల నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. ఇజ్రాయెల్ విదేశాంగ, రక్షణ శాఖల అమోదంతోనే అమ్ముతోంది. తాము ప్రభుత్వ సంస్థలకే అమ్ముతున్నామని ఎన్ఎస్ఒ మొదటి నుండి నొక్కి వక్కాణిస్తోంది. దానిపై మోడీ సర్కారు నోరు మెదపట్లేదు. ఉగ్రవాద, ఇతర కరడుగట్టిన నేరస్త నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు పెగాసస్‌ను సమకూర్చుకున్న అమెరికా సంస్థ ఎఫ్బిఐపై విమర్శలు రావడంతో వాడకాన్ని నిలిపేసింది. సౌదీ అరేబియా, యుఎఇ, మెక్సికో, ఫిన్లాండ్లో స్పైవేర్‌ను దుర్వినియోగం చేసినట్లు తేలింది. మన దేశంలో రాహుల్‌గాంధీ, మాజీ జడ్జిలు, పాత్రికేయులు సహా 300మందిపై నిఘా పెట్టినట్లు గతంలోనే 'ది వైర్' వెల్లడించింది. ఇది ప్రజాస్వామ్యానికి, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం. ప్రాథమిక ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా ప్రభుత్వ నిఘాను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలి. శ్రీరంగ నీతులు చెప్తూ, అవినీతి పంకిలంలో, అబద్ధాల ఊబిలో నిలువులోతు కూరుకుపోయిన మోడీ సర్కార్ పాలనార్హత కోల్పోయింది.