Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నయా ఉదారవాద విధానాల యుగంలో ప్రభుత్వ నివేదికలు, గణాంకాల విశ్వసనీయతే కాదు, ఆర్థిక సర్వేల విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారడం ఆందోళనకరమైన అంశం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిజాలను మసిపూసి మారేడు కాయ చేసే యత్నమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే నివేదిక. దేశంలో అత్యధిక ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోకుండా, ఆర్థిక వ్యవస్థ రికవరీ గ్రోత్ గురించి ప్రస్తావించడం అర్థరహితం. మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించి, ఏప్రిల్ 1 నుండి మొదలయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి సంబంధించి అంచనా వెలువరించడం వరకే ఆర్థిక సర్వే పరిమితం కాదు. గడచిన సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థను పట్టి పీడించిన రుగ్మతలు, వాటిని అధిగమించేందుకు ఏం చేశారు? ఏం చేయాలి? వంటి అంశాలపై వాస్తవాల ఆధారంగా సమగ్ర మదింపు జరగాలి. ఈ ఆర్థిక సర్వేలో అటువంటి ప్రయత్నం కన్నా కార్పొరేట్ల మెప్పు కోసం పడిన ఆరాటమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఆర్థిక వ్యవస్థ రికవరీ వేగం పుంజుకుంటుందని చూపడం కోసం నిజాలను విస్మరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 9.2శాతం దాటుతుందని ఆర్థిక సర్వే ఘనంగా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5శాతం మధ్య ఉండబోతుందని అంచనా. దీనికి ముందు ప్రపంచ ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు, మన దేశ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపైనా అంచనా ఉండాలి. ఉక్రెయిన్ సంక్షోభం యుద్ధానికి దారితీస్తే ఇప్పుడున్న ముడి చమురు ధరలు ఆకాశాన్నంటే ప్రమాదముంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు అత్యంత కనిష్ట స్థాయికి అంటే బ్యారెల్ 39 డాలర్లకు ఉన్నప్పుడే మన పెట్రో ఉత్పత్తుల ధరలు మండిపోయాయి. ఆర్థిక వృద్ధిరేటు అంతంతమాత్రంగా ఉంది. ప్రస్తుతం 70 డాలర్లకు చేరిన బ్యారెల్, రేపు వంద డాలర్లు చేరే ప్రమాదముంది. అప్పుడు మన ఆర్థిక వృద్ధి అంచనాలన్నీ తారుమారవుతాయి కాబట్టి భవిష్యత్తు గురించి అతిగా అంచనా వేసుకోవడం సరికాదు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచితే, మన దేశం నుంచి విదేశీ సంస్థాగత పెట్టు బడులు ఒక్కసారిగా వెనక్కి పోతాయి. అప్పుడు మన విదేశీ మారక నిల్వల పరిస్థితి ఏమిటి? అంతకంతకూ పెరుగుతున్న దిగుమతుల బిల్లుకు విదేశీ రుణాలపై వడ్డీల భారం కూడా తోడైతే అది చెల్లింపుల సంక్షోభానికి దారితీయకమానదు. దానికి తోడు రూపాయి విలువ కూడా పడిపోయి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోకుండా వచ్చే ఆర్థిక సంవ్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.5శాతం దాకా ఉంటుందని చెప్పడం నేల విడిచి సాము చేయడమే అవుతుంది.
కోవిడ్ సంక్షోభంలోనే కాదు, అది రాక ముందు కూడా వృద్ధి రేటు తీవ్ర క్షీణతలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు కేవలం 4.1శాతం మాత్రమే. 2020-21లో జీడీపీ కనివిని ఎరుగని విధంగా మైనస్ 7.3శాతానికి పడిపోయింది. ఇంత దయనీయమైన స్థితి 75ఏండ్ల స్వాతంత్య్రానంతర భారతావనిలో ఎన్నడూ లేదు. ఒక దశలో అంటే 2020-21 మొదటి త్రైమాసికంలో 24.4శాతం క్షీణత చోటుచేసుకుంది. 2022-23లో 8.5శాతం వృద్ధి రేటు నిజంగా సాధిస్తే, కోవిడ్‌కు ముందున్న స్థితికి ఆర్థిక వ్యవస్థ చేరుకోవచ్చు. ఈ లెక్కన ఆర్థిక మాంద్యం నుంచి బయటపడి పూర్వ స్థితికి చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంటుంది. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం దెబ్బకు 84శాతం కుటుంబాల ఆదాయాలు పడిపోయాయి. 4.6కోట్ల ఉద్యోగాలు పోయాయి. ప్రపంచ ఆకలి సూచీలో 116దేశాల్లో భారత్ 104వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో దేశంలోని 77శాతం ఆస్తులను కేవలం పది శాతం మంది సంపన్నులు కలిగి ఉన్నారు. కోవిడ్ ఉధృతంగా ఉన్న 2020-21లో సంపన్నుల వద్ద పోగుపడిన సంపద రూ.23.14లక్షల కోట్ల నుంచి రూ.53.16 లక్షల కోట్లకు పెరిగినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. అత్యంత ముఖ్యమైన ఈ సమస్యలను ఆర్థిక సర్వే గుర్తించేందుకు నిరాకరించడం ఈ సర్వే లోని అతి పెద్ద లోపం. ఇది ప్రభుత్వ దృష్టి లోపమే.