Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజ్ఞతను ప్రదర్శించటం.. దక్షతతో వ్యవహరించటం.. బాధ్యతతో మెలగటం.. ప్రతి వ్యక్తి జీవితంలో ఇవి కీలకం. అతడు వీటిని అనుసరిస్తున్నాడా..? లేదా..? అనే విషయాలపైన్నే అతడి వ్యక్తిత్వాన్ని మనం అంచనా కట్టొచ్చు. ఇదే ప్రాతిపదికన వ్యవస్థలనూ బేరీజు వేసుకోవచ్చు. మంగళవారం పార్లమెంటులో పద్దును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ పట్ల ఈ మూడింటినీ విస్మరించింది. ఈ మాట చెప్పటానికి ఎలాంటి సంశయమూ, సందేహమూ అక్కర్లేదు. రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచి ఈనాటి వరకూ తెలంగాణకు సంబంధించిన అనేక కీలకాంశాలపై ఇక్కడి ప్రభుత్వ పెద్దలు చేసిన ఏ ఒక్క విజ్ఞప్తినీ కేంద్రం పట్టించుకోలేదు. బడ్జెట్లో కొత్త రైల్వే లైన్లు, ఖాజీపేజ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయ హోదా తదితరాల ఊసే లేదు. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మన పట్ల 'శీత' కన్నేశారనటానికి ఇవి ప్రబల తార్కాణాలు. అసలు విభజన హామీల జోలికే ఆమె పోలేదంటే ఢిల్లీ దృష్టిలో తెలంగాణ పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 90శాతానికి మించి ఉన్న క్రమంలో వారి సంక్షేమాన్నీ, అభివృద్ధిని పట్టించుకోని కేంద్రం... అదే కోవలో తెలంగాణ పురోభివృద్ధికి మోకాలడ్డుతున్నది.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి తిరిగి పన్ను వాటాలను రాబట్టుకోవటానికి రాష్ట్రాలు నానా అవస్థలూ పడాల్సి వస్తున్నది. తెలంగాణ సైతం అదే గోసను అనుభవిస్తున్నది. దీంతో ఏటా రూ.నాలుగు వేల కోట్లను నష్టపోవాల్సి వస్తున్నది. తన బడ్జెట్లో డిజిటలీకరణ మంత్రాన్ని జపించిన మోడీ సర్కార్... అందుకనుగుణంగా వివిధ రంగాలను ఎలా సిద్ధం చేస్తున్నదనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం. అలాంటప్పుడు తెలంగాణలోని విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి కల్పన రంగాలకు సాంకేతికతను జోడించటం, తద్వారా ఆయా రంగాలను పరుగులు పెట్టించటం అనేది కూడా శేష ప్రశ్నే. స్వాతంత్య్ర భారతావనికి 75ఏండ్లు నిండిన నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్న బీజేపీ ప్రభుత్వం... మరో 25ఏండ్ల కాలానికి అతి అంచనాలతో కూడిన పద్దును ప్రవేశపెట్టింది. ఇక్కడ ఒక ముఖ్యాంశాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించిన వైనాన్ని మనం గమనించాలి. కరోనా దెబ్బకు యావత్ దేశంతోపాటు తెలంగాణ విలవిల్లాడింది. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే కోవిడ్ వల్ల రాష్ట్రం ఇప్పటికే ప్రత్యక్షంగా రూ.50 వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.50 వేల కోట్లను నష్టపోయింది. మొత్తంగా లక్ష కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఇప్పటికీ ఇక్కడి పారిశ్రామిక, ఉత్పాదక రంగాలు కోలుకోలేదు. ఫలితంగా ఉపాధి కోల్పోయిన వేలాది మంది పట్నాలను వదిలి... పల్లెలకు చేరారు. వారందరికీ ఉపాధి పెద్ద సమస్యగా మారింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యవసాయం తప్ప మిగతా రంగాలన్నీ కుదేలయ్యాయి. ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఇలాంటి తరుణంతో ఎప్పుడో 25ఏండ్ల అంచనాలు, అప్పటికి అనుగుణంగా ప్రణాళికల సంగతి తర్వాత... ముందు కోవిడ్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించేందుకు అవసరమైన ఊతకర్రను కూడా బడ్జెట్ ఇవ్వలేదు. ఈ రకంగా విజ్ఞతను ప్రదర్శించని కేంద్రం.. తనకు ఓటేసిన ప్రజల పట్ల కనీస దక్షతను కూడా చూపకుండా, రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం శోచనీయం.
ఇక బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయాన్ని కుండ బద్ధలు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని మనం నిర్మొహమాటంగా ప్రశంసించాల్సిందే. బీజేపీ విధానాలను, రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని కేసీఆర్ తూర్పారబట్టారు. కాకపోతే ఈ విధంగా తూర్పారబట్టే క్రమంలో అసందర్భోచితంగా ఆయన రాజ్యాంగం జోలికి ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు ఇప్పుడు సగటు మనిషిని వెంటాడుతున్నాయి. పైగా ప్రస్తుతమున్న రాజ్యాంగానికి సవరణలు కాదు.. కొత్త రాజ్యాంగాన్ని తీసుకు రావాల్సిందేనంటూ కేసీఆర్ నొక్కి వక్కాణించారు. ఈ అంశంపై ఏ ఛానెల్లోనైనా చర్చకు సిద్ధమంటూ ఆయన చెప్పటం వెనుక ఆంతర్యం బోధపడటం లేదు. బీజేపీ కోరుకుంటున్నది కూడా ఇదే అని తెలిసిన సీఎం... ఈ వ్యాఖ్యలు ఎలా చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలా సీఎం రాజ్యాంగం గురించి మాట్లాడారో లేదో... ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తామేదో రాజ్యాంగాన్ని గౌరవించేవారయినట్టు, రాజ్యాంగ పరిరక్షకులైనట్టు ముఖ్యమంత్రిని విమర్శించటం మరీ విడ్డూరం. ఈ తతంగ మంతా చూస్తోంటే... 'ఏ మాటల వెనుక ఏ అర్థాలు న్నాయో తెలుసుకోనంతకాలం జనం మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు...' అనే హితోక్తి గుర్తుకు వస్తున్నది. మాట మాట్లాడితే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చెప్పే బీజేపీ నేత నోటి వెంట... 'దాన్ని ఎవరూ మార్చలేరు...' అనటంలోని మర్మమేమిటో మున్ముందుగానీ తెలియదు. ఏదేమైనా అది బడ్జెట్ అయినా... రాజ్యాంగం విషయంలోనైనా అక్కడ ఢిల్లీ పెద్దలు, ఇక్కడి రాష్ట్ర పాలకులు... విజ్ఞతను, దక్షతను పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలి. కేంద్ర బడ్జెట్లో ఈ మూడూ కొరవడటం నయవంచనే. మళ్లీ మళ్లీ మోసపోవటానికి తెలంగాణ ప్రజలు మరీ అంత అమాయకులు కాదు.