Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గంపెడు ఆశలతో ఎదురుచూసిన బడ్జెట్ గండాలనే మిగిల్చింది. నేల విడిచి సాము చేసిన తీరుగా.. కండ్లముందరి కష్టాలను విస్మరించి కలల్లో తేలియాడింది. వర్తమానంలో ప్రజలనుభవిస్తున్న ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపకుండా, రాబోయే 25ఏండ్ల నాటికి అధునాతన సాంకేతికత ద్వారా దేశ స్వరూపాన్నే మార్చి చూపించడానికి నానా అవస్థలూ పడింది. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి నిర్మలసీతారామన్ చేసిన ప్రసంగం ఆసాంతం వాస్తవాలను దాచిపెడుతూనే సాగింది. ప్రభుత్వ వాస్తవ ఆర్థికస్థితిగతుల వివరాలు లేకుండానే డిజిటల్ మాయాజలంలో భవిష్యత్తును ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం 1.30లక్షల కోట్ల మేరకు పెరిగిందని చెప్పుకుంటూనే మరోవైపు సామాజిక సేవలకు కేటాయింపుల్లో భారీగా కోతలు విధించడం విడ్డూరం!
నేటి కరోనా కల్లోల కాలంలో ప్రజలకు కనీస ఉపాధి మార్గంగా నిలిచిన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దాదాపు ఇరవైఅయిదు వేల కోట్లు కోతపెట్టారు. 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినవారు, గడువు పూర్తవుతున్నా బడ్జెట్లో ఆ ఊసే మరిచారు. ఇప్పటి వరకూ ఆ దిశగా చేసిందేమీ లేకపోగా గత బడ్జెట్లో 3.97శాతంగా ఉన్న కేటాయింపులను ఈ బడ్జెట్లో 3.51శాతానికి కుదించారు. కీలకమైన విద్యావైద్య రంగాలూ తగిన కేటాయింపులకు నోచుకోలేదు. ఈ కోవిడ్ సమయంలోనూ ఆరోగ్యరంగానికి తగిన కేటాయింపు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. కరోనా, ఉపాధిలేమి కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా ఆహార సబ్సిడీలను తగ్గించారే తప్ప పెంచలేదు. దేశవ్యాప్తంగా 90శాతం ప్రజానీకం కష్టాల కొలిమిలో చిక్కుకుని ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వేళ... ఇప్పుడు కాదు ఇరవై అయిదేండ్ల తరువాత అంటూ ఇంత నిర్లజ్జగా చెపుతున్న తీరు ఇదివరకెన్నడూ ఎరుగనిది.
కోవిడ్ మూలంగా కోట్లాదిమంది ఉపాధి కోల్పోయినా, వారికి ఈ బడ్జెట్లో ఏ ఊరటా లభించలేదు. ఆదాయపన్ను రేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా మధ్యతరగతి నడ్డివిరిచారు. పన్నురాయితీల కోసం ఎదురుచూస్తున్న వేతనజీవులకు ఆర్థికమంత్రి క్షమాపణలతో సరిపెట్టారు. కానీ కార్పొరేట్లపై మాత్రం అపారమైన కరుణా కటాక్షాలు కురిపించారు. 2021లో కార్పొరేట్లు చెల్లించాల్సిన రూ.72.041కోట్ల పన్నును మాఫీ చేసినట్టు బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నారు. ఇది ఇప్పటికే కార్పొరేట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.4లక్షల కోట్లకు అదనపు మినహాయింపు. ఇది చాలదన్నట్టు కార్పొరేట్ పన్నుపై విధించే సర్చార్జిని కూడా 12శాతం నుంచి 7శాతానికి తగ్గించారు. ప్రభుత్వరంగంలో పెట్టుబడుల ఉపసంహరణకూ, ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికీ తెగ ఉత్సాహం చూపించారు. ఎయిర్ ఇండియా తరహాలోనే మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలనూ అమ్మి తీరుతామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను రెండవ దశకు తీసుకుపోతామని, రాబోయే 25సంవత్సరాల పాటు ఇదే తమ విధానమని ప్రకటించారు. ఇలా ఒకవైపు ప్రజల ఆస్తులన్నిటినీ కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతూ మరోవైపు ఆత్మనిర్భర్ భారత్ అని వల్లించిడం వీరికి మాత్రమే చెల్లింది. బడా పెట్టుబడిదారుల సేవలో తరించిపోతున్న కేంద్ర ప్రభుత్వం... దేశంలో అసంఖ్యాకుల ఉపాధికి కీలమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని (ఎంఎస్ఎంఈ) పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మౌలిక రంగాల్లో పెట్టుబడులను నిరాకరించడం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు చేటుచేస్తుందన్న సోయే ప్రభుత్వానికి లేకుండాపోయింది. ఫలితంగా చివరికి బడ్జెట్ కూడా సంపన్నుల సేవా సాధనంగా మారిపోవడం విచారకరం.
నిజానికి బడ్జెట్ ఒక సామాజిక ప్రయోజనం కలిగి ఉండాలి. వర్తమానంలో అది అంతరాల నిర్మూలనకు సాధనం కావాలి. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో అన్ని రకాల అసమానతల తొలగింపును చాలా స్పష్టంగా వాగ్దానం చేసింది. మనం ఈ అసమానతలను ఎలా తగ్గిస్తాం అనేది ఒక సవాలుగా తీసుకుంటే... దేశ సంపదను, వనరులను, ఉత్పత్తి సాధనాలను కేంద్రీకృతం కాకుండా కాపాడి, విస్తృత ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని కూడా రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ ఈ సంపద, ఉత్పత్తి సాధనాలు, వనరులు అన్నీ క్రమేణా సమష్టి సమాజం చేతిలో కాకుండా వ్యక్తుల చేతుల్లోకి జారిపోతున్నాయి. దేశమేమో అంతులేని అసమానతల మయంగా మారిపోతోంది. ఇలాంటి బడ్జెట్లు వీటిని నిలువరించగలవా..? దేశంలోని వందమంది కోటీశ్వరులు రూ.57లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నట్టు తాజా ప్రపంచ గ్లోబల్ రిపోర్ట్లు చెబుతున్నాయి. ఇది ప్రస్తుత బడ్జెట్ కంటే చాలా ఎక్కువని గమనించాలి. కానీ 50శాతం జనాభా, అంటే సగం మంది కేవలం 6శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. మరి ఈ బడ్జెట్ ఆ అసమానతలను తొలగించగలదా..?