Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో పచ్చని పల్లెలు, పంట పొలాలపై పారిశ్రామిక కాలుష్యం విషం చిమ్ముతోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో అటు సాగు నీటిని, ఇటు తాగు నీటిని అందించిన చెరువులు, కుంటలు ఇప్పుడు కనీసం పశువులు కూడా తాగలేనంతగా కలుషితమయ్యాయి. కూరగాయలు, పండ్ల సాగుతో రూ.లక్షల ఆదాయం ఇచ్చే వ్యవసాయ భూములు ఇప్పుడు నిస్సారంగా మారుతున్నాయి. భూ గర్భజలాలు సైతం కాలుష్యం బారిన పడడంతో మూడు పంటలు పండిన భూములలో కనీసం గడ్డి కూడా మొలవని పరిస్థితి దాపురించింది.
హానికర వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలను కట్టడి చేయాలంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలు పాలకులకు పట్టడంలేదు. అందుకే రైతులు వ్యవసాయంపై ఆశలు వదులుకొని ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కుంటున్న పరిస్థితి. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఈ దుస్థితి దాపురిస్తోంటే కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఏం చేస్తున్నట్టు? అభివృద్ధికి, ఉపాధికి బాటలు వేయాల్సిన పరిశ్రమలు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నా, ఇదే విషయాన్ని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పీసీబీ కానీ, ప్రభుత్వాలు కానీ కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.
సరైన సమయంలో పీసీబీ రైతుల ఘోష పట్టించుకుంటే వ్యవసాయానికి గానీ, ప్రజల జీవనోపాధికి కానీ ఇంత గడ్డు పరిస్థితి దాపురించేది కాదు. కనీస నిబంధనలు పాటించని పరిశ్రమలపై కనీస చర్యలకు కూడా ఉపక్రమించలేదు. ఫలితంగా ఆయా పరిశ్రమల నుంచి విడుదలైన విష రసాయనాలు, హానికర వ్యర్థాలు, శుద్ధి చేయబడకుండానే సమీప చెరువులు, కుంటలు, వాగులు ఇతర జలవనరుల్లోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు భూ గర్భంలోంచి చెరువుల వరకు పైపులేసి, మరికొన్ని మురుగు కాలువల ద్వారా, ఇంకొన్ని వర్షాకాలంలో వర్షపు నీటిని కలిపి ప్రమాదకర రసాయన వ్యర్థాలను చెరువుల్లో వదిలేస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్ పరిసరాల్లోని నీటి వనరులతో పాటు, సంగారెడ్డి, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ పరిధిలోని భూగర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయి.
యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిపల్లితో పాటు మండలంలోని మరో ఐదు గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాలు, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం మండలాల్లో రెండు వేల ఎకరాలు కాలుష్య జలాల కారణాంగా బీళ్లుగా మారాయి. చౌటుప్పల్ మండలం, నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలంలో ఎనిమిది గ్రామాల పరిధిలో దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కాలుష్యం ప్రభావంతో భూగర్భజలాలు కలుషితమైన ప్రాంతాల్లోని భూముల్లో రెండో పంటపై రైతులు ఆశలు వదులుకున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచునూర్, సల్ఫనూర్, బోరపట్ల, సదాశివపేట, జహీరబాద్, సంగారెడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మొత్తంగా సంగారెడ్డి జిల్లాలోని భూములు సాగు యోగ్యత కోల్పోతున్నాయి. ఒక్క పటాన్ చెరువు మండలంలోనే తొమ్మిది వందల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి సాగుకు పనికిరాకుండా పోతున్నది. ఇప్పుడు ఈ భూముల్లో కనీసం ఆముదం కూడా పండని దారుణ పరిస్థితి. పటాన్ చెరువు మండలంలోని నక్కవాగు, పాశమైలారం చెరువు వంటివి చేపలు బతికేందుకు కూడా అవకాశం లేనంతగా కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి.
ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుండే గ్రామాలకు నేడు పరిశ్రమలే ప్రధాన కాలుష్య కారకాలుగా మారాయి. ఇక్కడ నింగి, నేల, నీరు సర్వం కలుషితమయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఏండ్ల తరబడిగా పరిశ్రమలు వెదజల్లే వాయు, రసాయనిక కాలుష్యంతో ప్రజలకు అంతు చిక్కని వ్యాదులు పుట్టుకొస్తున్నాయి. అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం దీనికి తోడవుతున్నది. ప్రాణాంతకమైన రసాయన వ్యర్థాలు భూమి మీద పచ్చటి పంట పొలాలను, చెరువులను, కుంటలను, గాలిని కలుషితం చేస్తున్నా, ప్రజల ఉసురు తీస్తున్నా పరిశ్రమల యజమాన్యాలు చేస్తున్న ఆకృత్యాలు మాత్రం బయటి ప్రపంచానికి కనబడటంలేదు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా పేరు గడించాల్సిందిపోయి, నేడు ఈ ప్రాంతమంత కాలుష్యంతో రెంటికి చెడ్డ రేవడిగా మారి పోతుండం విషాదకరం. పరిశ్రమలు కాలుష్యాన్ని బయటికి వదలకుండా ఈటీపీలను ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలు ఉన్నా అవి ఎక్కడా అమలు కావటంలేదు. రసాయన పరిశ్రమలను ఎక్కడ పెట్టాలనే నిబంధనలు గాలికి వదిలేయడంతో ప్రాణాంతకమైన పరిశ్రమలు ఎక్కడ పడితే అక్కడ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వాటిపై నిఘా పెట్టాల్సిన అధికారులు పరిశ్రమల యజమాన్యాలు విసిరే చిల్లరకు కక్కుర్తిపడటంతో యథేచ్ఛగా వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది.