Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ఎలుకలు జొరబడ్డాయని ఇల్లు తగలబెట్టాడట ఎనకటికొకడు. ఇంకోపిచ్చితల్లి మొకం బాగా కనిపించటం లేదని అద్దం నేలక్కొట్టిందట. ఇలా ఎన్నయినా సామెతలు చెప్పుకుంటూ పోవచ్చు. అలాగుంది మన సారు వరుస. ఇప్పటికి చాలా మందే ఈ యిశయాలు చెప్పుంటారు. అయినా కొన్ని మనమూ మాట్లాడుకొందాము. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా మన సీఎం సారు కేంద్రంపై ఆవేశాన్ని రాజ్యాంగంపైకి మళ్ళించాడు. మొన్న విలేకర్ల సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ పౌరుషాగ్నిని రగిలింపజేశారు. ఆగ్రహం బాగానే ఉంది. కానీ మధ్యలో రాజ్యాంగం ఏంచేసిందో ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. భారత రాజ్యాంగాన్ని మార్చుకోవాలని తెగేసి చెప్పారు.
ఎందుకు మార్చుకోవాలి! దేని గురించి మార్చుకోవాలి? ఈ ప్రశ్నలు ఇప్పుడు పెద్దసారును చుట్టుముట్టాయి. రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుందని, ఇన్నేండ్లయినా ప్రజలకు ఫలాలు అందటం లేదని సెలవిచ్చారు. ఈ రెండూ వాస్తవమైన విషయాలే. మార్చేసేయాల్సిన విషయం చర్చకు పెట్టాను. చర్చించండని అందరికి ఓ సలహానూ ఇచ్చారు. ప్రజలకు, నాయకులు, ప్రభుత్వాలు అందిస్తున్న ఫలాలను రాజ్యాంగం అడ్డుకున్నదా? రాష్ట్రాల హక్కులను కాలరాయటానికి రాజ్యాంగం కారణమా! ఇదెక్కడి తర్కం! పోనీ రాష్ట్రాల హక్కుల్ని కాలరాసే అనేక చర్యలను గత ఎనిమిది సంవత్సరాలుగా చూస్తూ ఉండిపోయారు కదా! మరి దాని సంగతేమిటి? రాజ్యాంగం మనకందించిన అనేక విలువలను, హక్కులను తుంగలో తొక్కి నియంతల్లా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను ఎప్పుడూ నిలదీయకుండా ఇదేమి వింతవాదన!
ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధానాలను పరిశీలించే ఎవ్వరికైనా మొదటి కర్తవ్యమేమిటంటే, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే, లౌకిక ప్రజాస్వామిక విలువలను పరిరక్షించుకోవటానికి, ఆర్థిక స్వయం సార్వభౌమాధికారానికి, సామాజిక న్యాయ సాధనకు, కేంద్ర రాష్ట్ర సంబంధాల ఫెడరల్ విధానానికి కట్టుబడి ఉన్న రాజ్యాంగం మనది. దీనికి మోడీ పరివారం నుండి తీవ్రమైన ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ఆ విలువలను, అవి అందించిన రాజ్యాంగాన్ని రక్షించుకొవాల్సిన సమయమిది. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం లౌకిక, ప్రజాస్వామిక విలువలన్నింటినీ పక్కకు పెట్టి హిందూత్వ ఎజెండాను ముందుకు తెస్తున్నది. అసలు స్వాతంత్య్రోద్యమ కాలం నుండీ భారతదేశపు జెండాను గౌరవించడమే తెలియనివారి వారసులు వాళ్లు. భారత రాజ్యాంగాన్నీ ఎప్పటి నుండో వ్యతిరేకిస్తున్న సంఫ్ుపరివారపు ఆలోచనా పరులే నేటి పాలకులు.
గమ్మత్తయిన విషయమేమిటంటే.. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని మార్చాలి అని అన్నడో లేదో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మారిస్తే ఊరుకునేదే లేదంటూ బీం దీక్షలకు దిగటం ఆశ్చర్యం కలిగిస్తుంది! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పాల్గొన్న గోవా హిందూ మహాసభలో, రాజ్యాంగాన్ని తీసేసి, మనుస్మృతిని పెట్టాలని వాళ్ళంతా తీర్మానం చేశారు. అప్పుడు బీజేపీ పరివారమంతా గుడ్లప్పగించి చూసారే కానీ ఒక్కమాటా రాలేదు. మరి ఇప్పటి ప్రతిస్పందనంతా ఒట్టి నటనగాక మరేమిటి? అసలు రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిత్యం ఉల్లంఘిస్తూనే ఉన్నది. రాష్ట్రాల ఆదీనంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మూడు నల్లచట్టాలను చేసి రుద్దపూనుకున్నది. రాజ్యాంగం కాశ్మీర్ ప్రజలకు హామీ పడిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను తెచ్చింది. మతపరంగా పౌరసత్వాన్ని కల్పించే మార్పును చేసింది. పౌరుల స్వేచ్ఛను, గోప్యత హక్కును కాలరాసే పెగాసెస్‌ను కొనుగోలు చేసి ప్రజలపై నిఘా పెంచుతున్నది.
సామాజిక న్యాయం అందించాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా దళిత, బడుగు బలహీన వర్గాలకు కల్పించబడుతున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. ప్రభుత్వ సంస్థలను, పరిశ్రమలను ప్రయివేటుపరం చేసి, పరోక్షంగా రిజర్వేషన్ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నది. వీటన్నిటి మీదా మాట్లాడాల్సిన సమయమిది. ఒకవైపు కేంద్రం వ్యూహాత్మకంగా రాజ్యాంగాన్ని కొద్ది కొద్దిగా పక్కకు నెడుతున్న సందర్భాన... 'నాపాట నీనోట పలకాల చిలకా' అన్నట్టు, వాళ్లు కోరుకున్న మార్పునే మన సారూ వెల్లడించడం ఎవరికి మేలు చేస్తుందీ..? రాష్ట్రాల ఆదాయ హక్కులను హరించేసే జీఎస్టీ తీసుకొచ్చినప్పుడూ మాట్లాడకపోగా మద్దతు పలికారు మన సారు. రైతు చట్టాలు తెచ్చినప్పుడూ స్వాగతించి నోరుమూసుకున్నారు. రాష్ట్రాల హక్కులలో జోక్యం చేసుకున్నప్పుడూ కిమ్మనకుండా ఊరుకుని, ఇప్పుడు ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు రాజ్యాంగం మీద పడటం తగని పని. ఆడలేక మద్దెల ఓడంటే ఇదే మరి! ఇప్పుడు మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోకపోతున్న ప్రభుత్వాలను. ప్రజల చేత ఎన్నుకోబడి, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న దుర్మార్గపు పాలకులను మార్చేయాలి. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని ప్రభుత్వాలను, నాయకులను మార్చేయాలి.