Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లతా మంగేష్కర్... జాతికి పరిచయం అవసరం లేని వ్యక్తి. లతాజీని, భారత దేశాన్ని విడివిడిగా చూడ సాధ్యం కాదు. ఆసేతు హిమాచలం ఆమె గానామృతం పలకరించని చోటు లేదనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అంతటి అసాధారణ ప్రజ్ఞాశాలిగా రాత్రికి రాత్రి అవతారం ఎత్తలేదు లత. నిరంతర సాధన, అకుంఠిత దీక్ష ఆమెను గాన కోకిల స్థానానికి చేర్చాయి. మహోన్నత శిఖరాలు అధిరోహింపజేశాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1929 సెప్టెంబర్ 28న జన్మించిన లతా మంగేష్కర్కు తొలి సంగీత గురువు ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్. తన 13వ ఏటనే తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. పాటలే జీవికకు ఆదరువయ్యాయి. ఆశా, ఉషాలను పెంచి పెద్ద చేసే క్రమంలో అవివాహితగా మిగిలిపోయారు. చిన్న నాట మరాఠీ నాటకాల్లో నటన, పెద్దయ్యాక చిత్రసీమలో గానం లతాకు జీవన వ్యాసంగాలయ్యాయి. లత గాన జైత్రయాత్ర ఆమె 90 వరకు ఏడు దశాబ్దాల పాటు అలుపు సొలుపు ఎదరు బెదురు లేకుండా సాగింది. అంత సుదీర్ఘ కాలం తన గళంతో పండిత పామరులను పరవశింపజేయడం లతాజీకే సాధ్యమైంది. తెలుగు సహా 36 భాషల్లో లత పాటలు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. తరాలను తన్మయులను చేసింది లతాజీ కంఠం. అలనాటి నటి నర్గీస్ మొదలుకొని నేటి తరం ప్రీతి జింటా వంటి యువ కథానాయికల వరకు, వారే పాట పాడుతున్నట్లు ప్రేక్షకులను రంజింపజేశారు. లతాజీ గొంతు తరాల మధ్య అంతరాలు చెరిపేసిందని ఖ్యాతి గడించారు. లోకమంతటికీ మాధుర్యాన్ని పంచిన లతాజీ స్వరం భాషా భేదాలను రద్దు పర్చింది. దేశ సరిహద్దులను తుడిచేసింది. భావ పరిపూర్ణమైన స్వరంతో కావ్య సౌందర్యాన్ని ఆవిష్కరించి పారవశ్యం నింపడమనే విద్య ఒక్క లతాజీకే సొంతం. ఆర్తి, భక్తి, దేశభక్తి, అనురక్తి, సహా అన్ని రసాలను తన స్వరంలో పలికించి వైవిధ్యభరిత గీతాలను ఆలపించారు. అలౌకిక మాధుర్యంతో ప్రేక్షకుల హృదయాలను సునాయాసంగా గెలుచుకోవడం లతాజీ ప్రత్యేకత. ఆత్మను అభిషేకించే కళ లతాజీది. అందుకే ఆమె పాటలను అంతగా ఆస్వాదించారు శ్రోతలు. ఆమె నిర్వహించిన కచేరీలన్నింటికీ అభిమానులు తండోపతండాలుగా పోటెత్తేవారు. ఆమె రూపొందించిన ఆల్బమ్లకూ అపరిమితమైన ఆదరణ ఉంది. లతా మంగేష్కర్ను వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న మొదలుకొని సినీరంగ అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె వరకు ఎన్నో ఎన్నెన్నో అవార్డులు ఆమె చెంతకు పరిగెత్తుకొచ్చాయి. 1999-2005 మధ్య లతాజీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. సాంస్కృతిక, కళా రంగాల కోటాలో కేంద్ర ప్రభుత్వం ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఎం.పి.గా ఆమె రూపాయి కూడా జీతం తీసుకోలేదు. తన తండ్రి పేరు మీద ముంబయిలో ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. తెలుగు వారితో లతా అనుబంధం పెనవేసుకుంది. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ జాతీయ అవార్డులను ఆమె అందుకున్నారు. దేవదాసు సినిమాతో ఎఎన్ఆర్ తన అభిమాన హీరో అయ్యారని లతా ప్రకటించారు. తెలుగు సినీ గాయని సుశీలను తన చెల్లెలిగా అభివర్ణించారు.
తన 92వ ఏట ఇటీవల కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. లతా ఇక లేరన్నది యావత్ దేశం జీర్ణించుకోలేని కఠోర వాస్తవం. కన్నీటి సంద్రంలో అభిమానులు తల్లడిల్లుతున్న సమయం. సినీ, రాజకీయ వర్గాలను విషాదంలో ముంచిన వేళ ఇది. లతాజీ భారత సాంస్కృతిక దిగ్గజ ప్రతీక. భారతదేశ చరిత్రలో లతాజీకి కొన్ని పేజీలు ఎప్పటికీ ఉంటాయి. భౌతికంగా లతా గొంతు మూగబోవచ్చునేమోకానీ ఆమె కంఠం నుండి జాలువారిన పాటలు ఎన్నటికీ చిరస్మరణీయం. ఆమె పాటల పూదోట. ప్రతి హృదయం లో ఆమె ఆలాపనలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. యావద్దేశం ఆమె పాటలను తమ జ్ఞాపకాల్లో గుర్తు చేసుకుంటుంది. జాతి గర్వించతగ్గ లతాజీకి నివాళి.