Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశ ప్రజలు, అందులోనూ తెలుగు ప్రజలు మహా అమాయకులని మన ప్రధాని అభిప్రాయం కావొచ్చు. ఎవరైనా సరే తన మాటల మంత్రజాలంలో తన్మయులవడం, తాను చెప్పినదానికల్లా డూడూ బసవన్నల్లా తలలూపడం తప్ప మరేమీ చేయలేరనుకునే ఆయన అపారమైన నమ్మకానికి నిజంగా జోహార్లు చెప్పాల్సిందే! ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా ఆయన మరోసారి మాయచేయబూనుకున్నారు. ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తీరు పట్ల తీవ్ర ఆవేదన చెందారు. ఈ విభజన ద్వారా కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందంటూ తెగ బాధపడిపోయారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానిమిస్తూ... అత్యంత అప్రజాస్వామికంగా, హడావుడిగా చేసిన ఈ విభజనవల్ల ఆ రెండు రాష్ట్రాలు ఇప్పటికీ కష్టాలతో కొట్టుకుంటున్నాయని సెలవిచ్చారు. ఇందుకు కారణమైన కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఇంతవరకూ బాగానే ఉందిగానీ, ఈ అప్రజాస్వామిక, హడావుడి విభజనలో తామూ భాగస్వాములమేనన్న సంగతి ఆయన విస్మరించడమే విడ్డూరంగావుంది..! బహుశా తెలుగు ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించలేరన్న నమ్మకమో, లేక గుర్తించినా మరిచిపోతారన్న విశ్వాసమో అయివుండాలి ఆయనది.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పార్లమెంటు తలుపులు మూసి, మైక్‌లు కట్‌చేసి, పెప్పర్ స్ప్రేలు వాడి విభజన చట్టంపై ఎలాంటి చర్చకూ అవకాశం లేకుండా చేసిందన్నది ఈ సందర్భంగా ప్రధాని ఆరోపణ. వివాదాలకు తావులేని రీతిలో, శాంతియుత వాతావరణంలో, సమగ్ర చర్చ ద్వారా బిల్లును ఆమోదించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన ప్రవచించారు! ఇది ముమ్మాటికీ నిజమే. కానీ అటువంటప్పుడు ఆనాడు పార్లమెంటులో ప్రధాని పార్టీ ఈ బిల్లును ఎందుకు ఆమోదించిందన్నదే ఇప్పుడు ప్రశ్న. తమపార్టీ ఆధ్వర్యంలో, వాజ్‌పేయి నేతృత్వంలో మూడు కొత్త రాష్ట్రాలను ఎంత గొప్పగా ఇచ్చారో చెప్పిన ప్రధాని... అందుకు భిన్నంగా అనైతికంగా జరిగిన ఈ విభజన బిల్లును అదే పార్టీ ఎలా ఆమోదించిందో మాత్రం చెప్పకపోవడం వైచిత్రి!
తాము విభజనకు అప్పుడూ ఇప్పుడూ అనుకూలమేగానీ, విభజన జరిగిన తీరుకే వ్యతిరేకమంటున్న ప్రధాని.. ఈ తీరును ఆనాడే బీజేపీ ఎందుకు ఖండించలేదో, అంత గుడ్డిగా ఎందుకు మద్దతిచ్చిందో కూడా చెప్పివుంటే బాగుండేది. నోటిమాటగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహౌదాను హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అదే హామీని విభజన చట్టంలో చేర్చి ఉంటే ఆ రాష్ట్రానికి ఈరోజు ఇంత అన్యాయం జరిగివుండేది కాదని వాపోయిన ప్రధాని, అందుకోసం ఆనాడు సభలో పట్టుబట్టడానికి తమకున్న ఆడ్డంకులేమిటో సెలవిస్తే సమంజసంగా ఉండేది. ప్రత్యేకహౌదాను విభజనచట్టంలో చేరిస్తేనే మేం మద్దతిస్తామని ఆనాడు వీరు ఎందుకు చెప్పలేకపోయారో వివరించి ఉండాల్సింది. ఇవన్నీ మరుగున పెట్టి అన్యాయమంతా కాంగ్రెస్ పార్టీదే అన్నట్టుగా ప్రధాని మాట్లాడటం ప్రజల్ని వంచించడమే అవుతుంది.
రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఎవరూ అంగీకరించలేరు. అందుకే తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు తమ తీర్పు ద్వారా తగిన పాఠమే నేర్పారు. జరిగిన ఈ అన్యాయం పట్ల ఆగ్రహాన్నీ, ఆంధ్రప్రదేశ్ పట్ల అంతులేని 'సానుబూతి'నీ ప్రదర్శిస్తున్న ప్రధాని, తాము అధికారంలోకి వచ్చిన ఈ ఏడుండ్లుగా మాత్రం చేసిందేమిటి? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహౌదాను బీజేపీ కూడా వాగ్దానం చేసింది కదా? మరి ఆ వాగ్దానం ఎందుకు అమలుకు నోచుకోలేకపోయింది? జరిగిన నష్టాన్ని పూడ్చడానికి వీరు చేసిందేమీ లేకపోగా, కనీసం విభజనచట్టంలో పేర్కొన్నవైనా అమలు చేశారా? ఆ హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? లేదే..! ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం కాదా? మరి ఈ అన్యాయానికి కారకులెవరు?
ఆ మాటకొస్తే విభజనచట్టంలో తెలంగాణకిచ్చిన హామీలకేమైనా న్యాయం చేశారా అంటే అదీలేదు. ఇక్కడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాళేశ్వరం జాతీయహౌదా వంటి హామీలన్నీ దిక్కులేకుండానే ఉన్నాయి కదా! పోనీ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభజన సమస్యల పరిష్కారానికైనా ప్రయత్నించారా? అదీ లేకపోగా, నదీజలాల వివాదంలో పరిష్కారానికి కేంద్రం తలుపుతట్టినందుకు ఒనగూరిందేమిటో ఇప్పటికే తెలుగు ప్రజలకూ, ప్రభుత్వాలకూ అనుభవంలోకొచ్చిన సంగతి ఆయన మరచినట్టున్నారు! ఇలా విభజన సమస్యల పరిష్కారానికీ, విభజనచట్టాల అమలుకూ కనీస ప్రయత్నమైనా చేయకుండా రెండురాష్ట్రాలు కొట్టుకుంటున్నాయనడం ప్రధానికి భావ్యమేనా? ఇందులో ఏడేండ్ల కిందటి విభజన గాయాల్ని తిరగదోడటం, తెలుగు ప్రజలమధ్య సుహృద్భావాన్ని దెబ్బతీయడం తప్ప మరో ప్రయోజనమేదైనా ఉంటుందా? ఎవరిని ఏమార్చడానికీ మాటలు..? తెలుగువారు ఇది గమనించలేనంత అమాయకులని ప్రధాని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎవరికైనా... ప్రజలు గురువులనుకుంటే దారి సక్కగుంటది. లేకుంటే బుద్ధి గడ్డి తింటది.