Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజం నిద్ర లేచే లోపు అబద్ధం ఆరడుగులేస్తున్నదనేది మన పెద్దలు చెప్పే మాట. ఒక నిజాన్ని నిజమని చెప్పటంలో ఆలస్యమైతే.. ఎంత నష్టం జరుగుతుందో, అలాగే ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని చెప్పటం వల్ల కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది... ఇది చరిత్ర చెప్పే మాట. ఈ రెండు మాటల్లోని సారాంశాన్ని కేంద్రంలోని అధికార బీజేపీ అద్భుతంగా ఒంటపట్టించుకుంటున్నది. ఆ సారాంశాన్ని తన రాజకీయాలకు అత్యద్భుతంగా వాడుకుంటున్నది. కాదేదీ కవిత కనర్హం అనే మహాకవి సూక్తిని ఇప్పుడు ఉత్తరాదిన ఎన్నికలకు ఆ పార్టీ ఉపయోగించుకుంటున్నది. కాకపోతే ఆ ఎలక్షన్లకు మన తెలంగాణలోని సమతామూర్తి రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని వాడుకోవటమే ఇప్పుడు కలవరపరిచే అంశం. 216 అడుగుల ఈ విగ్రహాన్ని '56 ఇంచుల ఛాతి...' ఉన్న ప్రధాని మోడీగారే ప్రతిష్టింపజేశారంటూ కాషాయ పార్టీ మద్దతుదారులు ఉధృత ప్రచారం చేస్తూ ఊదరగొడుతున్నారు. తమ అబద్ధాల ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయిన ఈ పద సంపదను, వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వారు జనం మీదికి వదిలారు. బహుశా వాటికి మోడీ ముచ్చింతల్ పర్యటన ఫొటోలను కూడా జత చేసి ఉండొచ్చు. అంతటితో ఆగకుండా 'ఎంఐఎం ఇలాఖాకు దగ్గరగానున్న ప్రదేశంలో ఒక హిందూ సన్యాసి విగ్రహాన్ని మోడీ, బీజేపీ ఏర్పాటు చేశారు...' అని చెప్పటం ద్వారా వారు ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లోని ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో ఇట్టే తెలిసిపోతున్నది.
ఇక్కడ రామానుజాచార్యుల వారి సమతా సూత్రం, ఆయన ప్రవచనాలు, ముచ్చింతల్ ఆశ్రమం, అక్కడ జరిగే పూజాధికాలు, ప్రధానితోపాటు అమిత్ షా, ఇతర వీవీఐపీల పర్యటన వివరాలు, వాటి ప్రస్తావన మనకు అవసరం లేదు. ఇదే సమయంలో ముచ్చింతల్‌లో ఉన్న ఆచార్యుని విగ్రహాన్ని కూడా తమ 'చింతల' (ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో బీజేపీ ఓడిపోతున్నదనే సంకేతాల నేపథ్యం)ను తీర్చేందుకు కమలం పార్టీ ఉపయోగించుకోజూడటం కూడా అతిశయోక్తి కాదు. ఈ తతంగాన్నంతా చూస్తుంటే ఒక విషయం సుస్పష్టమవుతున్నది. ఇప్పటిదాకా వివిధ ఎన్నికల సందర్భాల్లో పాకిస్థాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్ సమస్యలు.. ఉగ్రవాదులు, దేశద్రోహులు అనే ముద్రలు.. రాజద్రోహం కేసులనే బీజేపీ పప్పులుడికాయి. కానీ ఏడున్నరేండ్ల నుంచి వాటిని చూసిచూసీ ఉన్న జనానికి 'నిజమైన తత్వం...' ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. ఈ క్రమంలో తమ అసలు రంగు జనానికి తెలిసిపోయిందన్న వాస్తవాన్ని గమనించిన పువ్వు పార్టీ నేతలు... ఇప్పుడు రూటు మార్చారు. అందులో భాగంగా ఉత్తరాది ఓటర్లను ఏమార్చటానికి వీలుగా దేశం బయటి అంశాల జోలికి పోకుండా... అంతర్గత విషయాల ఆధారంగా సొమ్ము చేసుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకే తెలంగాణలోని రామానుజాచార్యుల విగ్రహాన్ని తామే ప్రతిష్టించామంటూ అబద్ధాలను ప్రచారంలో పెట్టటం ద్వారా ఐదు రాష్ట్రాల్లోని ఓట్ల కోసం కుప్పిగంతులేయటం వారి దుస్థితికి అద్దం పడుతున్నది.
ఇదే కోవలో కర్నాటకలో కళాశాల విద్యార్థుల డ్రెస్ కోడ్‌కు సంబంధించి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు వారు శతవిధాలా ప్రయత్నించటం ఆందోళనకరం. అక్కడున్న స్వల్ప వివాదాన్ని రాజకీయం చేయటం ద్వారా తమ పబ్బం గడుపుకునేందుకు యత్నించజూడటం దారుణం. ఇలాంటి తరుణంలో దేశ ప్రజానీకం సంయమనం పాటించాలి. ఉద్వేగాలు, భావోద్వేగాల ఆధారంగా రెచ్చిపోతే అది కార్చిచ్చులా మారటం ఖాయం. తద్వారా మన పిల్లలు, దేశ భవిషత్తు ప్రశ్నార్థకమవుతుందనేది గతం చెప్పిన సత్యం. కరోనా పుణ్యమాని... ఇప్పటికే గత రెండేండ్ల నుంచి రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. అయినా కేంద్రం ఇటీవల తాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాటి పట్ల కనికరం చూపలేదు. తెలంగాణ సైతం అదే రకమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు సంబంధించిన అసలు సమస్యలు, కష్టాల నుంచి వారి దృష్టిని మళ్లించేందుకు పాలకులు వేస్తున్న ఎత్తుగడల్లో భాగమే ఈ జిమ్మిక్కులు. దీన్ని అర్థం చేసుకోకుండా నేతల ప్రసంగాలకు, వారు చేసే అబద్ధపు ప్రచారాలకు మనం ఉర్రూతలూగితే మున్ముందు యావత్ దేశం బొక్క బోర్లా పడటం ఖాయం. తెలంగాణపై తమ ముద్రను బలంగా వేసేందుకు కమలం పార్టీ ఉవ్విళ్లూరుతున్న ప్రస్తుత తరుణంలో... మన ప్రజలు కూడా పరమత సహనాన్ని పాటించాలి. కులం, మతాలకు అతీతంగా కలిసిమెలగాలి. మెజారిటీ, మైనారిటీ అనే తేడాల్లేకుండా ఈ అత్యున్నత చైతన్యాన్ని, పరిణితినీ ప్రదర్శించాలి.