Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇస్తినమ్మ వాయినం! పుచ్చుకుంటినమ్మ వాయినం!'' మనం విన్నదేనైనా, హఠాత్తుగా పేరంటాళ్ల భాషెందుకొచ్చింది? వాయినం మాటలెందుకొచ్చినాయనే సందేహం ఎవరికైనా రావచ్చు. రాజకీయుల నుండి సర్వసంగ పరిత్యాగులకు, తిరిగి సదరు పరిత్యాగుల నుండి రాజకీయులకు, అలియాస్ రాజకీయాలకు 'వాయినాల' మార్పిడి మన తెలంగాణలో జోరుగా సాగుతోంది. బీజేపీ చావో రేవో తేల్చుకునే యూపీ ఎన్నికల మధ్య ఉన్నా రానూ, పోనూ రెండు గంటల సమయం పోగా దాదాపు ఆరుగంటలు మోడీజీ చినజీయర్ ఆశ్రమంలో, రామానుజుల 'సన్నిధి'లో గడిపినట్టు నాటి మీడియా వార్తలు వెల్లడించినాయి. మోడీ సాబ్ ఏమిచేసినా దానికో అర్థం, పరమార్థం ఉంటాయంటారు. డౌటుండేవారు ఆ తర్వాత యూపీ గల్లీ గల్లీల్లో పడ్డ పోస్టర్లు చూడవచ్చు. నిజంగానే స్వామికార్యంలోనే స్వకార్యం చక్కబెట్టగల దిట్టకదా! ''ఓవైసీ ఇలాఖాలో అతిపెద్ద హిందూ సన్యాసి విగ్రహం మోడీ నెలకొల్పాడ''ని ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్లు అంటించుకున్నారు. ఇంతకంటే దిగజారుడుంటుందా? చినజీయార్ మాటల్లో కేసీఆర్ ఫ్లస్ మైహౌమ్ రామేశ్వర్రావులే ఆ విగ్రహ''దాతలు''. భవిష్యత్‌లో కోటానుకోట్లు ప్రయోజనం పొందగల వ్యక్తులు, వారి వెనకాలున్న శక్తులు తమ వంతు పాత్ర పోషించి ఉంటారు. ఇందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరు, కరెంటు, రోడ్లు వంటివి నిర్మించిందని జీయర్‌స్వామి స్వయంగా మీడియా ముందు చెప్పారు. కానీ ఇందులో వీసమెత్తు భాగం కూడా లేని మోడీ ఇన్ని కోట్ల ప్రాజెక్టు నిర్మించాడని చెప్పుకోడానికి బీజేపీ వారికి సిగ్గనిపించక పోవడం ఆశ్చర్యమేమరి! బహుశా ఆ అవకాశం కోసమే వచ్చారా? లేదా దొరికిన అవకాశాన్ని ''సద్వినియోగం'' చేసుకున్నారా?
మరో మూడ్రోజులయ్యేసరికి ''నంబర్ టు'' కూడా చినజీయార్ సన్నిధానంలో ప్రత్యక్షం. ఈ కొత్వాలు పర్యటనను ఎలా వాడుకుంటారో త్వరలో యూపీ నుండో లేదా ఆ తరువాత జరగనున్న గుజరాత్ ఎన్నికల నుండో చూస్తాం కావచ్చు. ఆ వెంట బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు 'క్యూ' కట్టేలా ఉన్నారు. సాక్షాత్తు మూలవిరాట్ మోహన్భగవత్గారే హాజరేసు కున్నారు. చినజీయార్ స్వామి అమిత్‌షా చేతిలో బుల్లి రామానుజుల వారి విగ్రహం పెట్టి సాగనంపారు. ఆ సమయంలో నర్మగర్భంగా కేసీఆర్‌ని అమిత్‌షా రెండు మాటలంటే సున్నితంగా స్వామివారే కౌంటర్ చేసిపెట్టారు. ఇవన్నీ వాయినాల పరంపరంలో అంతర్భాగమేనని చిత్తగించవలెను. సుమతీ శతక కారుడు చెప్పినట్టు 'చీమలు' పెట్టిన పుట్టలు 'పాముల' కిరువౌతాయో, 'చీమ'లకే మిగుల్తాయో భవిష్యత్‌లో దర్శనం చేసుకుందాం.
ఈ వాయినాల పర్వం అనేక ప్రశ్నల్ని మిగిల్చింది. సమాధానాల కోసం దేవులాడుతోంది. ఫిబ్రవరి 5న జరిగిన కార్యక్రమం కోసం వి.వి.ఐ.పి.లకు (అది మోడీజీ ఒక్కరి కోసం కాదు కావచ్చు) ప్రత్యేకంగా ప్రధాన రహదారి నుండి 5 కి.మీ. రోడ్డు నిర్మించారు. అందుకు అటవీసంపద ధ్వంసమైంది. మహావృక్షాలు నేలకూలాయి. కొన్నింటిని తగులబెట్టారు. సామాన్యుల కోసం ముచ్చింతల్ కున్న సింగిల్రోడ్ డబుల్‌రోడ్డు అయ్యింది. ఆ విధంగా అక్కడ సమతా స్ఫూర్తి మంట గలిసింది. సామాన్యులను అసలు లోనికే అనుమతించలేదు. వారిచ్చిన పైకానికి అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ఇవన్నీ నిర్వహకుల ఇష్టం అనుకున్నా, అసలైన 'పెద్దెస్ట్' వాయినం ఏమంటే గతంలో ముచ్చింతల్ పరిసరాల్లో చ.గజం భూమి అసలు ధర రూ.1500. నేడు రూ.30-35వేలు పలుకుతోంది. ఆ పరిసరాల్లోని రామేశ్వరరావుగారి ఒక్కో విల్లా ఖరీదు రూ.2.5కోట్లు. ఈ వాయినం గురించి మీడియా మిత్రులు కథలు కథలుగా మాట్లాడుకున్నారు సదరు 5వ తేదీన.
స్వాతంత్య్రం రాకముందు మనదేశంలో రాజకీయాలూ ఉన్నాయీ. మతమూ ఉంది. 1906లో కొన్ని ప్రావినెన్స్‌లో హిందూ మహాసభ ఏర్పడి అఖిల భారత స్థాయిలో 1911 నాటికి సంఘటితమైంది. 1907లో ఆలిండియా ముస్లిం లీగ్ ఏర్పడింది. బ్రిటిష్‌వారి పుణ్యాన మతం, రాజకీయాలు కలగా పులగం చేసే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. 1925లో ఆరెస్సెస్ పుట్టిన తర్వాత ఆ ప్రయత్నాలు ఉధృతమైనాయి. కాని స్వాతంత్య్రానంతరం అవలంబించిన ఆర్థిక, రాజకీయ విధానాలు, నెహ్రూ వంటి నేతల అభివృద్ధిగాముక దృక్పథం పై ప్రయత్నా లను సాగనివ్వలేదు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు తిరగబడ్డారు. దేశం వెనక్కి నడుస్తోంది. మతమే రాజకీయాలకు ఆలంబనైంది. 75ఏండ్ల తర్వాత రాజ్యాంగాన్ని వ్యవస్థ వెక్కిరిస్తున్నది. మతం ఓటు బ్యాంకైంది. రామేశ్వరరావు వంటివారికి ఆర్థికంగా కోట్లు రాలుస్తున్నది. బీజేపీ వంటి పార్టీలకు ఓట్లు రాలుస్తున్నది. రాలుతున్న ఓట్లను, పారుతున్న నోట్లను అందుకునేందుకు అనేక ప్రాంతీయ పార్టీలు పోటీపడుతున్నాయి. 12 రోజుల్లో లక్షన్నర కిలోల నెయ్యి అగ్నికి ఆహుతి కాగా... చుట్టుపట్ల గ్రామాలవారికి మాత్రం కాలుష్యమే కానుకయ్యింది.