Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో సమాఖ్య స్ఫూర్తి నీరుగారుతోంది. సామాజిక న్యాయం కనుమరుగైపోతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయువుపట్టైన ఇలాంటి ప్రధాన హక్కులపై ప్రస్తుతం కత్తి వేలాడుతోంది. సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకోవాలంటే జాతీయస్థాయిలో ఒక వేదిక అవసరమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇటీవల అత్యంత కీలకమైన, అవసరమైన మంచి ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. రాజకీయ పక్షాలు, పౌర సమాజ మేధావులు, భావ సారూప్యత కలిగిన ప్రతినిధులతో 'అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య'ను ఏర్పాటు చేయాలని స్టాలిన్ చేసిన ప్రతిపాదన ఆహ్వానించదగ్గ మంచి పరిణామం. అయితే ఈ విషయంలో విస్తృత సంప్రదింపులు అవసరం. కుల, మత, లింగ, ప్రాంత, భాషా వైరుధ్యాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమాన అవకాశాలు పొందే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. కానీ ఆ హక్కు రక్షించే బాధ్యత ఎవరిది? పాలకుల కనుసన్నల్లో మలిగే అధికార యంత్రాంగం మీదనే అందుకు ఆధారపడితే సామాజిక న్యాయం అమలు జరుగుతుందా ?
75ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ స్వేచ్ఛాస్వతంత్రాలు దక్కని 'సఫాయీ కార్మికులు' వంటి బానిసత్వం కంటే హీనమైన బతుకులు సాగిస్తున్న అభాగ్యులెందరో! వారికి సామాజిక న్యాయం జరిగేదెన్నడు? కుల, మత, లింగ విద్వేషపు దాడులూ కొనసాగుతున్నాయి. కట్టుబాట్లు, సాంప్రదాయాల పేరిట వాటిని చూసీచూడనట్టు నటిస్తూ కప్పిపుచ్చుతున్న పెత్తందార్ల ఆగడాలను అడ్డుకునేదెవ్వరు? కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆన్లైన్ చదువులను బలవంతంగా రుద్దుతూ భౌతిక తరగతులు లేక చదువులకు దూరమవుతున్న దళిత, బడుగువర్గాల పిల్లల హక్కులకు జవాబుదారీ ఎవరు? ఒకవైపు హక్కులను చట్టబద్ధం చేసిన పాలకులే ఆ హక్కులను మరో చట్టంతో కాలరాస్తుంటే సమానత్వపు హక్కులు నీటి మీద రాతలే అవుతాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత సామాజిక న్యాయం పెనం నుంచి పొయ్యిలో పడింది. మరోవైపు రాష్ట్రాల హక్కులు కూడా మోడీ ఏలుబడిలో మంటగలిసిపోతున్నాయి. విద్య, వైద్యం, విద్యుత్, నదీ జలాలు, ఇలా ప్రతి అంశంలోనూ కేంద్రం జోక్యం విస్తరించుకుంటూపోతోంది. భారత్ కేంద్రీకృత రాజ్యం కాదని, రాష్ట్రాల సమాఖ్య అని మన రాజ్యాంగం నిర్వచించింది. మోడీ సర్కార్ మాత్రం రాష్ట్రాలకు కేటాయించిన అంశాల్లోకి జొరబడి కేంద్రీకృతం వైపు లాక్కెల్తోంది. హిందూత్వ జాతీయ దురభిమాన సిద్ధాంతం దేశంలోని మైనారిటీలకు సమాన హౌదా నిరాకరిస్తూ సామాజిక న్యాయానికి, లౌకికతత్వానికి చేటు తెస్తోంది. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు అమలుచేయడానికి తిరస్కరిస్తూ.. తాను పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న ప్రయివేటీకరణ ఏవిధంగా సామాజిక న్యాయానికి విఘాతం కల్గిస్తోందో బీజేపీ చెప్పకనే చెప్తోంది. సంఫ్ుపరివారం అమలు చేయజూస్తున్న మనువాద ఎజెండా అగ్రవర్ణ పురాషాహంకార పూరితం. ఇటు రాష్ట్రాల హక్కులను కాలరాసి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడం, అటు సామాజిక న్యాయం మంటగలిపేయడం ద్వారా మోడీ సర్కార్ ప్రజాస్వామ్య పునాధులనే పెకలించేందుకు ఒడిగడుతోంది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనే క్రమానికి స్టాలిన్ చొరవ చూపడాన్ని స్వాగతించాలి.
సామాజిక న్యాయానికి, సమాఖ్య స్ఫూర్తికి కంకణం కట్టుకున్న పార్టీలన్నీ ఈ విషయంలో ముందుకురావాలి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమాఖ్య స్ఫూర్తి నీరుగారిపోతోందని ఆందోళన వెలిబుచ్చినవారే. రాష్ట్రాల హక్కుల కోసం కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిత్యం పోరాటం చేస్తోంది. తమిళనాడులో ప్రధానప్రతిపక్షమైన అన్నాడిఎంకె స్టాలిన్ ప్రతిపాదనకు పెడర్థాలు తీయడం ద్వారా తాను ఏ గట్టున ఉండనుందో తేల్చిచెపుతున్నది. పార్టీలే కాకుండా ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కులనేతలు సమాజం సమాజమే మొత్తంగా ఒక ఉమ్మడి పట్టు పడితేనే సామాజిక న్యాయం మనుగడ సాగించగలిగేది.
సమాజ పరిణామ క్రమంలో మార్పు తథ్యం. పాత వ్యవస్థలు కాలగర్భంలో కలిసిపోయి కొత్త వ్యవస్థలు పురుడు పోసుకుంటూనేవుంటాయి. మనదేశంలోనూ రాచరిక వ్యవస్థలు చరిత్రలో కలిశాయి. భూస్వామ్య వ్యవస్థలు కనుమరుగైనా వాటి అవశేషాలు ఇంకా మిగిలేవున్నాయి. మనుషుల మధ్య అంతరాలు నిర్మించిన మనుస్మృతి విష భావజాలం ఇంకా కొనసాగుతూనే వుంది. మనువాద మితవాద ఆగడాలు ఆగడం లేదు. కులం, ప్రాంతం, ప్రాంతం, లింగం పేరిట వివక్ష కొనసాగుతూనేవుంది. చట్టం దృష్టిలో పాలకులు, పౌరులు సమానమనే సమన్యాయపు న్యాయసూత్రాల్లో న్యాయం దక్కక బలైపోతున్న బడుగుజీవులకు భరోసా నేతిభీర చందమౌతోంది. సామాజిక దొంతరల్లో అట్టడుగునున్న అభాగ్యులకు, అణగారిన జనాలకు న్యాయం నేటికీ ఎండమావే. హక్కుల రక్షణను అధికార యంత్రాంగానికి వదిలేయకుండా సమాజం మొత్తం బాధ్యత వహిస్తేనే అణగారిన ప్రజలకు సమాన అవకాశాలు దక్కుతాయి.