Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళలు అరవైనాలుగని చెబుతారు మనవాళ్లు. అందులో ఉపన్యాస కళ కూడా ఒకటి. ఉపన్యాసాల్లో అబద్ధాలు చెప్పటమూ పెద్ద కళనే. కళ అని ఎందుకంటున్నామంటే అందంగా చెప్పబడుతుంది. పదేపదే అలా చెబితే సత్యమని నమ్మేవాళ్ళూ ఉంటారు. వంద అబద్ధాలాడయినా ఒక పెండ్లి చేయాలని అంటారు పెద్దలు. ఎన్ని అబద్ధాలయినా చెప్పి అధికారం చేపట్టాలంటారు మన పాలకవర్గాలు. అబద్ధాలాడటం అంత చిన్న విషయమేమీ కాదు. ఎన్ని వొదిలిపెట్టుకుంటే ఒక్క అబద్ధం చెప్పగలం! సిగ్గు, లజ్జా, ఆత్మాభిమానం, నిజాయితీ, నీతి అన్నీ వదిలేయాలి. నాయకులు చెప్పగానే వినే ప్రజలు, అమాయకులు ఉంటారన్న అచంచల విశ్వాసం వాళ్లకి. పాపం వాళ్ళేం చేస్తారు. పదే పదే అదే వినపడుతోంటే నిజమనే నమ్ముతారు. అందుకనే ఆనాడు నాజీ హిట్లరు మహాశయుడు గోబెల్స్‌ను ప్రచారకుడుగా పెట్టుకుని అబద్ధాల్ని పండించాడు. ఇప్పుడా అవసరం లేకుండానే అధినాయకులే ఆ పని కానించేస్తున్నారు.
ఇంతకు ముందు జాతీయ నాయకులుగా ఉన్నవాళ్ళు, ప్రధానులు, మంత్రులు ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పేవాళ్లు కాదు. ఇప్పుడయితే స్వయానా ప్రధానమంత్రిగారే ఆపని చేసేస్తున్నారు. ఇది మన రాజకీయాలు దిగజారాయనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రెండోసారి అధికారం వచ్చాక ఎనిమిదేండ్లు పాలన గడిచాక ఏమిటీ వైపరీత్యము అని మనం అనుకోవచ్చు! కానీ ఇప్పుడే అవసరమవుతున్నవి. ఎందుకంటే, అచ్చేదిన్ అంటే చచ్చేదిన్గా మారింది. వెలిగిపోతున్న భారతంలో కన్నీళ్లు పెరిగాయి. కోట్ల ఉద్యోగాలు లేవు, రైతు ఇంట్లో పెరిగిన ఆదాయం లేదు. కరోనా అరికట్టలేక లక్షల్లో చావులు, కోట్లాది వలసలు అష్టకష్టాలు, కోట్లాకొలది ఉద్యోగాలు హుశ్కాకి. నిరుద్యోగ భారతం, ఆకలి పెరిగి, దారిద్య్రం ఎదిగి కనీవినీ ఎరుగని దిగజారుడు ఒకవైపు ఉండగా, ఆత్మనిర్భర భారతం అంతా భూటకంగా దర్శనమిస్తోంది. ఇప్పటి వరకులేని విధంగా గత ఐదేండ్లుగా జీడీపీ తగ్గుతూనే ఉంది.
కానీ నిన్న మన చట్టసభలో సాక్షాత్తు బీజేపీ పార్లమెంటు యువ సభ్యుడు 'భారతదేశంలో నిరుద్యోగం లేదు' అని ఏ జంకూ లేకుండా బొంకాడు. అదే సభలో కేంద్ర మంత్రి దేశంలో నిరుద్యోగంతో యిరువై ఐదు వేల మంది ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటన చేశారు. నిటి అయోగ్ నివేదికలో గానీ, ఆక్స్‌ఫామ్ నివేదికలో కానీ స్పష్టమైన అంకెలనే ఇచ్చారు. కరోనా కాలం 2020 ఏప్రిల్ నెలలో మనదేశంలో గంటకు లక్షా డెబ్భయివేల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ఆ కాలంలోనే 35 మిలియన్ల ప్రజలు ఉపాధి కోసం ఎదురుచూస్తూ గడిపారని వివరించారు. కానీ ఈ కాలంలో 2022 నాటికి ఇంకో నలభై మంది బిలియనీర్లు కొత్తగా పెరిగి 142మందిగా ఎదిగారు. ఆదానీ, అంబానీ ఆదాయం కారణం మూడువందల రెట్లు పెరిగింది. వీళ్ళ లాభాలు పెరుగుదలకు అమాత్యులే చెప్పాలి. ఈ ఎనిమిది ఏండ్లలో దేశంలోని ప్రజలు ఏడుకోట్ల అరవైలక్షల మంది నిరుపేదలయ్యారు' అని ప్రముఖ ఆర్థికవేత్త సంతోష్ మల్హోత్రా వాస్తవాలను బయటపెట్టారు.
వాస్తవాలు, సత్యాలు ప్రజలను వెన్నాడుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటి ఫలితాలను అనుభవించేది వారే కనుక. ఆ చురుకు ప్రజలలో మొదలయింది. అందుకని కొత్తమాటలు ఎత్తుకొంటున్నారు. అన్ని బాధలకు దేవున్ని నమ్ముకోమంటున్నారు. తానూ దేవుడి చుట్టూ, విగ్రహాల చుట్టూ, మతం చుట్టూ తిరగడం పెరిగింది. హైదరాబాద్‌లో రామనుజ విగ్రహాన్ని పెట్టించానని, అదీ ఒవైసీ ఇలాఖాలో ప్రతిష్టించానని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్నారు. మత విద్వేషాలను రెచ్చకొట్టటం ఆరంభించారు. కర్నాటకలో హిజాబ్ మిషతో వైషమ్యాలను ఎగదోస్తున్నారు. ధరలు పెరిగాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ఏం చేద్దాం! ఎనభైశాతం హిందువులు ప్రమాదంలో ఉన్నారని ప్రచారం చేస్తే సరిపోతుంది. ఇదీ వాళ్ళ తీరు. ఇటీవలనే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న స్పష్టంగానే 'పార్టీ ఐటీ సెల్ వాళ్ళు అసత్యాలు ప్రచారం చేస్తారు. ఎందుకంటే అధికారం కోసం ఇవన్నీ తప్పవు' అని బహిరంగంగానే సెలవిచ్చాడు. దేశం కోసం, ధర్మం కోసం అని ప్రచారం చేస్తూ అధికారం కోసం, కార్పొరేట్ల కోసం అనునిత్యం శ్రమించడం కాషాయ నాయకుల అసలు కర్తవ్యం.
కాబట్టి అబద్ధాలు చెప్పి కొందరిని కొంతకాలం నమ్మించవచ్చు. లేదా అందరినీ కొన్ని రోజులు నమ్మించవచ్చు. కానీ ఎల్లకాలమూ అందరినీ నమ్మించడం జరగని పని. ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. ఈ అబద్ధాల రాయుళ్ల పని పట్టేరోజులు దగ్గరపడుతున్నాయి. అబద్ధపు కళ వెలవెలపోక తప్పదు.