Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్‌లో 'మార్పు' తథ్యం అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తొలి దశ ఎన్నికల వేళే బోధపడినట్టుంది. బీజేపీకి ఓటేయకపోతే యూపీ అతికొద్ది కాలంలోనే కాశ్మీర్గానో, బెంగాల్గానో లేదా కేరళగానో మారిపోయే 'ప్రమాదం' ఉందంటూ ఆయన చేసిన బెదిరింపులు బీజేపీ ఆందోళనకు అద్దం పడుతున్నాయి. యోగి వ్యాఖ్యలు బీజేపీని దేశవ్యాప్తంగా అపహాస్యం పాలుచేశాయి. విమర్శలూ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మానవాభివృద్ధి సూచికల్లో కేరళ అగ్రభాగాన ఉన్న సంగతి తెలియంది ఎవరికి? యోగి అన్నట్లుగానే యూపీ కేరళగా మారితే నిజంగా 'ప్రమాదకరమే'. కానీ ఆ ప్రమాదం ప్రజలకు కాదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి, దాని తిరోగమన, మత మౌఢ్య, విచ్ఛిన్నకర సంఫ్‌పరివార్ భావజాలానికి ఆ 'మార్పు' కచ్చితంగా ప్రమాదకరమే. ప్రజలను ఏదోరకంగా భయాందోళనలకు గురి చేయడం ద్వారా లబ్ధి పొందాలని యోగి చేసిన ప్రయత్నం ఇలా బెడిసికొట్టింది. కేరళపై బీజేపీ నేతలు గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసి నవ్వులపాలయ్యారు. ఇప్పుడూ అదే పునరావృతమైంది.
దేశాభివృద్ధికి కేరళ ఒక దిక్సూచి. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, పరమత సహనం, ప్రజల ఐక్యత, ప్రజాతంత్ర విలువలు, సుపరిపాలన పరిఢవిల్లుతున్న రాష్ట్రమది. మానవాభివృద్ధికి, పరిపాలనకు సంబంధించిన ఏ అంశంలోనైనా శిఖరాగ్రాన నిలుస్తున్న ప్రగతిశీల రాష్ట్రం కేరళ. అంతర్జాతీయ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాలానుగుణంగా విడుదల చేసే నివేదికలే కేరళ ప్రగతి పథానికి సాక్ష్యాలు. నిటి అయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచికల్లోనూ కేరళ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలువగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత అధ్వాన్న రాష్ట్రంగా దిగజారిపోయింది. విద్య, వైద్యారోగ్య రంగాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) లాంటి అంతర్జాతీయ సంస్థలు సైతం కేరళ ప్రగతిని శ్లాఘించిన సంగతి తెలిసిందే. యోగి భయాందోళన ఫలించి ఒకవేళ యూపీ గనుక కేరళగా మారితే ఎల్డీఎఫ్ ప్రభుత్వ సారథి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పినట్టు యూపీ ప్రజలకు విద్యా, వైద్య రంగాల్లో అత్యుత్తమ సేవలందుతాయి. సంక్షేమ ఫలాలు ప్రజంలందరికీ చేరి సుభిక్షమైన వాతావరణం ఏర్పడుతుంది. కులం పేరుతోనూ, మతం పేరుతోనూ హత్యలకు తావులేని శాంతియుత వాతావరణం నెలకొంటుంది. వాస్తవానికి యూపీ ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నది ఈ 'మార్పు'నే. బీజేపీని ఓడిస్తేనే ప్రజల ఆ ఆకాంక్ష నెరవేరేది.
ఉత్తరప్రదేశ్‌లో మూడు దశాబ్దాల్లో ఏ ప్రభుత్వమూ ఎదుర్కోనంత ప్రజాగ్రహాన్ని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంటోందని కథనాలొస్తున్నాయి. ఢిల్లీలో అన్నదాతల మహౌద్యమం జరుగుతున్న సమయంలోనే యూపీ... లఖింపూర్‌లో కేంద్ర మంత్రి తనయుడు రైతులను తన కాన్వారుతో తొక్కించి ప్రాణాలు బలిగొన్నాడు. ఇక మూకదాడులు, మత విద్వేష దాడులు కోకొల్లలు. కోవిడ్ రెండో దశలో యోగి సర్కార్ వైఫల్యానికి ఆక్సిజన్ అందక ఊపిరాగిన ప్రాణాలకు లెక్కలేదు. వారణాసి సాక్షిగా గంగానదిలో కొట్టుకుపోయిన భౌతికకాయాలకు దిక్కేలేదు. అలాంటి యూపీ ఎక్కడా? ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి అంతర్జాతీయ సమాజ ప్రశంసలు పొందిన కేరళ ఎక్కడా? అందుకనే బీజేపీపై కట్టలు తెంచుకునేంత ఆగ్రహం యూపీ ప్రజానీకంలో నిబిడీకృతమైంది.
ఇక బెంగాల్, కాశ్మీర్ కూడా యూపీ కంటే అనేక అంశాల్లో మెరుగైన రాష్ట్రాలే. జమ్ము-కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని అత్యంత అప్రజాస్వామి కంగా రద్దు చేసి ముక్కలు చేసిన కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రజలపై తీవ్ర నిర్బంధం కొనసాగిస్తోంది. అటు సీమాంతర ఉగ్రవాదులు, ఇటు సొంత సైనికుల మధ్యన సామాన్య కాశ్మీర్ ప్రజానీకం అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోతున్నారు. కాశ్మీర్ కల్లోలితంగానే ఉన్నా 2018 వరకూ కొనసాగిన స్వయం ప్రతిపత్తి కారణంగానూ, అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కారణంగానూ గతంలో యూపీ కంటే మెరుగైన స్థితిలోనే ఉంది. అలాంటి కాశ్మీర్ ఇప్పుడు తడారని నెత్తుటి క్షేత్రంగా మారిందంటే దానికి కారణం కేంద్రంలోని మోడీ సర్కారే. కేంద్ర బలగాలను, గవర్నరు వ్యవస్థను వాడుకొని ధన, మందబలంతో పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలను అక్కడి ప్రజలు తుత్తునియలు చేసినా అది గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ఒకప్పుడు కరవుతో విలవిల్లాడిన బెంగాల్... వామపక్ష ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ పంపిణీ ద్వారా, ప్రజానుకూల విధానాల ద్వారా ఎంతో వృద్ధి సాధించింది. జీవన ప్రమాణాల పరంగానూ, పారిశ్రామికంగానూ ఏ రకంగా చూసినా యూపీ కంటే పైచేయిగానే బెంగాల్ కూడా నిలిచింది. వామపక్షాలు ప్రాబల్యంగా ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి ఆయన నెత్తినే మొట్టికాయలు వేశాయి.