Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు నాల్కల ధోరణి.. ద్వంద్వ వైఖరి... విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తేటతెల్లం చేయటానికి బహుశా ఈ పదాలు సరిపోవేమో. ప్రయివేటు, కార్పొరేట్ గద్దలకు ఆ రంగాన్ని కట్టబెట్టటానికి వీలుగా మోడీ సర్కార్ సుతిమెత్తగా పావులు కదుపుతున్న ప్రస్తుత తరుణంలో 'మోటార్లు... మీటర్లు...' అనే అంశం తెరమీదికొచ్చింది. 'మోటార్లకు మీటర్లు పెట్టనియ్య...' అంటూ ఇటీవల జనగామ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో, అటు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఇటు రాష్ట్రంలోని బీజేపీ నేతలు... అసలు మోటార్లకు మీటర్లు పెట్టే ఉద్దేశమే లేదంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కే.సింగ్ ఒకడుగు ముందుకేసి 'వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని బలవంతం చేస్తున్నామనటం పచ్చి అబద్ధం...' అంటూ నొక్కివక్కాణించటం గమనార్హం.
ఇక్కడ కేంద్రం... మీటర్లు పెట్టాలా..? వద్దా...? అనే విషయాన్ని నేరుగా చెప్పకుండా దొంగాట ఆడుతున్నది. డిస్కామ్‌ల భుజాలపై తుపాకిని పెట్టి కాల్చేందుకు ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి విద్యుత్ బిల్లు -2003కు సవరణలు చేసేందుకు వరసగా 2014, 18, 20, 21 సంవత్సరాల్లో కేంద్రం పావులు కదిపింది. అయితే ఆ రంగానికి చెందిన నిపుణులు, విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్ల వ్యతిరేకతతో కొంత వెనక్కు తగ్గింది. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పేరుతో దొడ్డిదారిన వాటిని మళ్లీ ముందుకు తేవటంతో దాని బండారం బయటపడింది. వాడుకున్న ప్రతీ యూనిట్‌కు కస్టమర్ల నుంచి అంటే వారు గృహ వినియోగదారులు, పరిశ్రమలు, రైతులు... ఇలా ఎవరైనా కావచ్చు, ఛార్జీలు వసూలు చేయాలన్నది దీని అంతర్లీన సూత్రం. ఇదే తెలంగాణకు గుదిబండ కాబోతున్నది. ఎందుకంటే ఇక్కడ రైతులకు 24 గంటలపాటు ఉచిత కరెంటును ఇస్తున్నారు కనుక. సంబంధిత సబ్సిడీని సర్కారు భరిస్తున్నది. ఆ సబ్సిడీని ప్రభుత్వమే డిస్కాములకు చెల్లిస్తున్నది. ఒకవేళ విద్యుత్ సవరణ బిల్లు చట్టమై వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సి వస్తే, వాటి ప్రాతిపదికన రైతులపై పెను భారాలు పడే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం... సంబంధిత సబ్సిడీని నేరుగా రైతుల అకౌంట్లలో వేయాల్సి ఉంటుంది. వారు తిరిగి డిస్కాములకు ఛార్జీలను చెల్లించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును వారి అకౌంట్లలో వేయకపోతే వాటిని రైతులే భరించాలి కదా..? అలాగాకుండా సర్కారు... రైతులను ఒత్తిడి చేయొద్దంటూ డిస్కామ్లను ఆదేశించిందే అనుకుందాం. అలాంటప్పుడు అసలు ఇప్పుడు అమలవుతున్న పద్ధతీ.. అప్పుడు జరగబోయేదీ రెండూ ఒకటేగా...? ఇవన్నీ ఆన్సర్లు లేని క్వశ్చన్లు. అసలు ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కోసం నయాపైసా విదల్చని మోడీ సర్కార్... ఈ తతంగాన్నంతటినీ గుడ్లప్పగించి చోద్యం చూస్తుందన్న మాట.
మరోవైపు 2021 జులైలో బిల్లుకు సంబంధించి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన 'రివామ్ప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్'లో స్మార్ట్ మీటర్లు, వాటిని ఏయే రంగాల్లో అమర్చాలనే విషయాలను పొందుపరిచారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌లో 'డిస్కామ్‌లు మీటర్లు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు...' అని పేర్కొన్నారు. అంటే మీటర్లు పెట్టాలా..? వద్దా...? అనే అంశంపై కేంద్రం తన విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా... డిస్కామ్‌ల మీదికి దాన్ని తోసేసి చేతులు దులుపుకుందన్నమాట. ఈ క్రమంలో మొత్తం 13 రాష్ట్రాలు ఈ విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాయి. తెలంగాణ అసెంబ్లీ ఏకంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టాలో చెప్పటం లేదు. వాటిని ఎవరి కోసం పెట్టాలంటున్నారు..? వాటికి ఎన్ని వేల కోట్లు ఖర్చవుతాయి..? అనేవి శేష ప్రశ్నలే. అనుమతి లేని కనెక్షన్ల గురించి కేంద్రం మాట్లాడుతున్న క్రమంలో... అలాంటివే ఉంటే ఎంతో కొంత రుసుము తీసుకుని వాటిని క్రమబద్ధీకరించవచ్చుకదా..? ఇలాంటి వాటికి మోడీ సర్కార్ వద్ద సమధానాలే లేవు.
ఏతావాతా తేలేదేమంటే... విద్యుత్ రంగాన్ని మొత్తానికి మొత్తంగా కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కంకణం కట్టుకున్న కేంద్రం, ఆయా కంపెనీలు భవిష్యత్తులో ఎలాంటి ఆటంకం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా కరెంటు ఛార్జీలను పెంచుకు నేందు కు, ఎలాంటి కష్టం లేకుండా సుఖంగా వాటిని వసూలు చేసుకునేందుకు వీలుగా 'మీటర్ల...' పురాణాన్ని భుజానికెత్తుకున్న దన్నమాట. ఈ వాస్తవాలన్నీ తెలిసి కూడా బీజేపీ నాయకులు సమాధానం చెప్పకుండా అడ్డదిడ్డంగా, డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు. విక్రమార్కుడు, భేతాళుడి కథలోలాగా...అనేకానేక ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పని కేంద్రాన్ని, దాని నాయకగణాన్ని ఏం చేయాలో ప్రజలే తేల్చుకుంటారు.