Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సమాజంలో చదువుకున్నవారు, చదువుకోనివారు అన్న తేడా లేకుండా మూఢనమ్మకాలలో పడిపోతున్నారు. వీటి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ సమాజానికి చీడలా దాపురించాయి. ఇటీవల జగిత్యాల పట్టణంలో క్షూద్ర పూజలు, మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను కుల సంఘ సభ్యులే దారుణంగా హత్య చేసిన ఘటన, నల్లగొండ జిల్లాలో మహంకాళి విగ్రహం వద్ద నరబలి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. జగిత్యాల జిల్లాలో చేతబడి చేయించాడనే అనుమానంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని బంధువులే సజీవ దహనం చేయడం కలకలం రేపింది. గతంలో చిత్తూరు జిల్లాలో మూఢత్వంతో తల్లిదండ్రులే తమ ఇద్దరు కూతుళ్లను చంపుకున్న ఘటన మరువకముందే తెలంగాణలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు విస్మయమేకాదు ఆవేదన కలిగిస్తున్నది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులను అశాస్త్రీయ ప్రయోగాలకు, అశాస్త్రీయ భావాల వ్యాప్తికి ఖర్చు చేస్తున్నది. సాక్షాత్తు ప్రధానే వినాయకుడి ప్లాస్టిక్ సర్జరీ అంటూ, పుష్పక విమానాలు ఆ కాలంలోనే ఉన్నాయంటూ ప్రచారం చేస్తూంటే సమాజంలో సైంటిఫిక్ టెంపర్ చచ్చిపోతోంది. అధినేతలే అలా ఉంటే వారి మంది మాగాదులు అంతకంతకు రెచ్చిపోతూ సమాజాన్ని తిరోగమనంలోకి తీసుకుపోతున్నారు. ఫలితంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ కాలంలో కూడా ఇంకా చేతబడి, బాణామతి వంటి ఆచారాలు నిస్సిగ్గుగా అమలవుతున్నాయి. దేవుడి పేరుతో జోగిని, బసివి, మాతంగి వంటి ప్రచ్చన్న వ్యభిచారం గ్రామాలలో కొనసాగుతుంది. ఈ దురాచారాలకు బలవుతున్నది పేద దళితులూ, దళిత స్త్రీలు అనేది బహిరంగ రహస్యం. బాణామతి చేశారనే నెపంతో దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తులను సజీవ దహనం చేయడం వంటివి తెలంగాణలో చాలాసార్లు చూస్తాం. ఆ అభాగ్యుల సజీవ దహనాలను గ్రామమంతా చూడ్డం కూడా మనకు తెలుసు.
మహారాష్ట్రలో దభోల్కర్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం కోసం పోరాడుతూ మతోన్మాదుల చేతిలోనే హత్యకు గురయ్యారు. అనంతరమే మహారాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం 2016ను తీసుకువచ్చింది. ఈ తరహా చట్టం అన్ని రాష్ట్రాలలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాధినేతలే స్వయంగా జోగినీల చేత 'రంగం' చెప్పించుకుంటున్నారు. ఒకపక్క అంటరానితనం నేరం అని రాజ్యాంగం చెబుతున్నా రకరకాల అంటరానితనాలు అధికారుల అండదండలతో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మూఢనమ్మకాలపై చట్టం అనేది ఉంటే దాన్ని అమలు చెయ్యమని కనీసం అడగడానికి ఒక హక్కు, ఆసరా అయినా బాధితులకు ఉంటుంది. ఒక పక్క సైన్స్ ఫలాలను అనుభవిస్తూనే మూఢనమ్మకాలను విశ్వసించే వారి సంఖ్య పెరుగుతోంది. విద్యావంతులలో శాస్త్రీయ వైఖరి లోపించడం, మితిమీరిన మత విశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు, ప్రభుత్వాల పరిపాలనా విధానాలు, పద్ధతులు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మూఢత్వం దిశగా ప్రేరేపిస్తున్నాయి. దీంతో రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకోవడం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వీటిని ప్రసారం చేసే టీవీలు, సెలబ్రిటీల పైన, వస్తువులను అమ్మేవారి పైన మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కింద కేసు నమోదు చేయమని మహారాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించడం ఓ ముందడుగు. నేడు పేద మధ్య తరగతి జీవితాల్లో పెరుగుతున్న ఆభద్రతా భావం కూడా నకిలీ బాబాలు, స్వామిజీలు, మాంత్రికుల వలలో పడేటట్టు చేస్తూ అజ్ఞానం వైపు నెడుతున్నది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మూఢ విశ్వాసాల తీవ్రత పెరుగుతున్న కొద్దీ మంత్రగాళ్ల నెపంతో అనుమానితులను వేధించడం, క్రూరంగా చంపడం వంటి సంఘటనలు కూడా చోటుచేసు కుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తి గత కక్ష్యలను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇవి శాంతి భద్రతలకు, ప్రజారోగ్యానికి పెను సవాలుగా నిలుస్తున్నాయి. విద్యాసంస్థలు సైతం మూఢత్వంలోకి నెట్టబడుతున్నాయి.
సామాజిక రుగ్మతైన అంధ విశ్వాసాలను అరికట్టకపోతే దేశాభివృద్ధికి ఇవి అవరోధంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వాటి నిర్మూలనకు అవగాహనతోపాటు విధాన పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. పౌరులు శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక ఆలోచనలను పెంపొందించుకొని జ్ఞానాభివృద్ధికి కృషి చేయాలని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటోంది. కానీ నేటి పాలకుల వైఖరి మాత్రం సమాజంలో సైన్సు దారి సైన్స్దే మూఢనమ్మకాల దారి మూఢనమ్మకాలదే అన్నట్టుగా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. విశ్వవిద్యాలయాలలో ఇలాంటి చదువులు చదివిన విద్యార్థులు భౌతిక వాస్తవికతను వదిలి మూఢనమ్మకాల బారిన పడుతున్నారు. పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు వైజ్ఞానిక ఆలోచనలకు పునాది వేసే దిశగా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, హేతువాదులు, యువత, మీడియా కృషి చేయాలి. అప్పుడే మూఢత్వానికి చోటివ్వని సమర్థ మానవ వనరులను నిర్మిస్తూ, వైజ్ఞానిక భారతానికి పునాదులు పడతాయి.