Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావత్ మోడీ సర్కార్ ఓ పిల్ల దేశపు ప్రధాని మాటలకు చిగురుటాకులా వణికిపోతోంది. ఎందుకంటే ఆయన 'ప్రజాస్వామ్యం' గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఆయన నెహ్రూని ఆకాశానికెత్తాడు. అక్కడితో సింగపూర్ ప్రధాని 'ఆగడాలు' ఆగలేదు. (భారత)దేశ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి నిప్పుకణికలా బయటికొచ్చిన నెహ్రూ కొన్ని విలువలు స్థాపించాడన్నాడు. ఆ తర్వాత భారత్‌లో విలువలు దిగజారాయన్నాడు. ప్రస్తుత లోక్‌సభ సభ్యుల్లో సగం మందిపై క్రిమినల్ కేసులున్నాయన్నాడు.
ఇంకేముంది? విదేశాంగశాఖ మంత్రి సింగపూర్ హైకమిషనర్‌ని పిలిపించి నిరసన తెలిపినట్లు సమాచారం. సదరు సింగపూర్ ప్రధానికి ''తప్పుడు'' సమాచారం ఎవరిచ్చారో ఆరాతీస్తారట! బహుశా ఈ మోడీ వ్యతిరేక క్యాంపెయిన్ వెనుకున్న విదేశీశక్తుల ''కుట్ర కోణం'' కూడా పరిశోధిస్తారేమో!
ఆ కాలంలో నెహ్రూ అవలంబించిన అన్ని చర్యలనూ అందరూ ఏకీభవించకపోవచ్చు. కాని ఆయన ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదే అనడంలో భిన్నాభిప్రాయాలకు తావేమీలేదు. పార్లమెంట్లో చర్చ తర్వాతే పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమైనాయి. పార్లమెంటరీ చర్చ తర్వాతే ప్రభుత్వరంగం ఆవిర్భవించింది. దాన్ని నాడు వ్యతిరేకించింది ఒక జనసంఫ్‌ు మాత్రమే. ప్రభుత్వరంగ నిర్వహణలో లోపాలుండవచ్చు. కానీ అవి వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడ్డాయి. లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా ప్రభుత్వాలకు వనరులందించాయి. మన సమాజంలోని వెనుకబడ్డ కులాలకు ఉపాధి దొరికింది. విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు చౌకగా ప్రజలందరికీ లభ్యమైనాయి. నీరు, రోడ్లు మొదలైనవి అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కేవలం నెహ్రూ గొప్పతనాలు కాదు. స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలు. దీన్నే సింగపూర్ ప్రధాని ''స్వాతంత్య్రోదమ అగ్ని పరీక్షల్లో రాటుదేలిన వ్యక్తి నెహ్రూ'' అన్నాడు. ఆనాటిది స్వాతంత్య్రోద్యమమే కాదని బరితెగించి చెపుతున్న బీజేపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే కదా!? నెహ్రూ ఎక్కడున్నా ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య సభలో మాట్లాడేటప్పుడు సభలోనే ఉండి పాయింట్లు రాసుకునేవారట! వంది మాగధులు బల్లలు చరుస్తుంటే.. అధినాయకుడు పరవశించిపోయే నేటి దశలో అవన్నీ ఊహించగలమా?! ఆర్.కె. లక్ష్మన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కార్టూనిస్టుతో తనపైనే కార్టూన్లూ వేయించుకునేవారట! కార్టూన్లకే జైళ్లు నోళ్ళు తెరుచుకునే నేడు ఆ విషయాలను ఊహించనైనా లేము. లాల్ బహుదూర్శాస్త్రిని నేడు బీజేపీ ఆకాశానికెత్తుతోంది. ఆయన కొడుకు నేడు యూపిలో బీజేపీ మంత్రి. లాల్‌బహుదూర్‌శాస్త్రి రైల్వేమంత్రిగా ఉండగా జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పదవిని త్యజించారు. భిలారులో కార్మికులపై పోలీసు కాల్పులకు నిరసనగా కేంద్ర కార్మిక మంత్రి పదవికి వివి గిరి రాజీనామా చేశారు. ఈ విలువలు నేడు చూడగలమా?! కనీసం తమ సిట్ ఫైల్ చేసిన రిపోర్టులో దోషి అని తేలిన తరువాత కూడా ఆ వ్యక్తి తండ్రిని మంత్రివర్గంలో కొనసాగిస్తున్న బీజేపీ నుండి ఏ విలువలు ఆశించగలం?
అందుకే ఇప్పుడు బీజేపీ మండిపోతోంది. సింగపూర్ ప్రధాని వారి పార్లమెంటులో ప్రసంగించిన సందర్భం ఏదైనా, మనదేశంలోని దాని టైమింగ్ బీజేపీకి ప్రమాదకరమైంది. దేశంలో జరిగే ప్రతి ప్రతికూల అంశానికీ నెహ్రూనే కారకుడన్నట్టు మోడీ ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో... దానికి తోడు బీజేపీకి చావోరేవో తేలే యూపీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో... మరీ ముఖ్యంగా అక్కడ రేవుకి చేరే చాన్సేలేదన్న దశలో ఫిబ్రవరి 15న ఆయన ప్రసంగం బయటికి రావడంతో మరి మండదా?! కీలకాంశం నెహ్రూ కాలంలో శాస్త్రీయ దృక్పథం పరిఢవిల్లింది. మోడీ శకం అశాస్త్రీయతకు ఆలవాలమవుతోంది. యూనివర్శిటీ స్థాయిలో భూతవైద్యం, జ్యోతిష్యశాస్త్రం వంటివి సబ్జెక్టులుగా ప్రవేశపెట్టి పట్టాలిస్తున్నారు. దేశంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు... అంటే ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ పరిశ్రమలు, హరితవిప్లవం, శ్వేత విప్లవం, విద్యుత్ చట్టం, ట్రాన్స్‌పోర్టు చట్టం మొదలైన వన్నీ నెహ్రూ కాలంలోనే జరిగాయి. అవన్నీ జాతీయోద్యమ వారసత్వ సంపదలు. జాతీయోద్యమంతో ఏ సంబంధమూ లేని బీజేపీ చరిత్ర చక్రాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తోంది. దాన్నే సింగపూర్ ప్రధాని స్పష్టంగా బయటపెట్టాడు. దినపత్రకల వార్తలే నిజమైతే... నాటి ఆయన మాట్లాడిన సందర్బంÛ ఏమంటే సింగపూర్‌లో ఒక పార్లమెంటు సభ్యురాలు అబద్ధాలు ప్రచారం చేసినందుకు జరిమానా విధించారు. అది మోడీ శకంలో సాధ్యమేనా? వెనక్కి తెస్తానన్న నల్లధనమేమైంది? రైతుల ఆదాయం రెట్టింపేమైంది? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలేమైనాయి. ఈ అబద్దాలన్నిటికీ ఫైన్లు వేస్తే బీజేపీ ఎంత రుసుము చెల్లించాలో..?!