Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ, ఒక జాతిని వేరొక జాతీ పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై సాగదు' అని ఓ కవి గళం ఎలుగెత్తి చెప్పగలిగిన ధైర్యం, స్థయిర్యం అందించిన గ్రంథం అది. అదొక ప్రణాళికా పత్రం మాత్రమే. ఇప్పటికీ నూటాడెబ్భయినాలుగు సంవత్సరాలయ్యింది. అందులోని సజీవత చెక్కుచెదరలేదు. దృఢమైన, నిర్ధిష్టమైన, సత్యమైన పదునుదేరిన భావాల ఆయుధం అది. ప్రపంచంలోని ప్రకృతి, మానవలోక గమనాలను అర్థం చేసుకుని మార్చగలిగిన మహాత్తర ఆచరణాత్మక పథక సంహిత అది.
మానవ చరిత్ర గమనాన్ని దీనంతగా ప్రభావితం చేసిన మరో గ్రంథమేదీలేదు. ఆలోచనలో స్పష్టత, స్వచ్ఛమైన భవిషద్ధర్శనం, విముక్తిదాయకమూ సృజనశీలతనూ కలిగివుండి ఈనాటికీ ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ప్రజాపోరాటాలకు దిశానిర్దేశం చేస్తున్నది. 'సకల దేశ కార్మికులారా ఏకంకండు' అంటూ అది ఇచ్చిన సమరశీల నినాదం... దోపిడీలేని సామాజిక వ్యవస్థ కోసం పరిశ్రమించే శ్రామికశక్తిని ఉత్తేజ పరుస్తూనే ఉంది. జర్మన్‌భాషలో మొదట వెలుగు చూసిన ప్రణాళిక 1850లో ఇంగ్లీషు భాషలో మొట్టమొదటిసారిగా 'రెడ్ రిపబ్లికన్' అనే లండన్ పత్రికలో అచ్చయింది. ఆ తర్వాత కొన్ని వందల భాషల్లోకి అనువాదమయింది. తెలుగులో ప్రథమంగా 1933లో పుచ్చలపల్లి సుందరయ్య అనువాదంచేసి సైక్లోస్టయిల్ కాపీలు సభ్యులకు పంచారు. తర్వాత కంభంపాటి అనువాదాన్ని అచ్చువేశారు. రామచల్లు రామచంద్రారెడ్డి, ఇప్పుడు ఎ. గాంధి సులువైన భాషలో చేసిన తెలుగు అనువాదాలు అందుబాటులోకి తెచ్చారు. లక్ష కాపీలు ముద్రించి 'రెడ్ బుక్ డే' ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నవతెలంగాణ, ప్రజాశక్తి, పికాక్ క్లాసిక్స్, నవచేతన, విశాలాంధ్ర ప్రచురణ సంస్థలు అన్నీ కలిసి ఈ ప్రణాళికను నేటి తరానికి అందించడం ఒక చారిత్రక ఘటన.
ప్రణాళిక మొత్తం నలభైనాలుగు పేజీల చిన్న పుస్తకం. ఇందులో నాలుగు విభాగాలున్నాయి. బూర్జువాలూ-కార్మికులూ, కార్మికులూ-కమ్యూనిస్టులూ, సోషలిస్టు, కమ్యూనిస్టు సారస్వతం, ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి. ఇందులోని ఒక్కొక్క వాక్యం చదువుతుంటే మన మెదడుపై పరచుకున్న మాయపొరలు తొలగిపోతుంటాయి. వాస్తవిక సమాజ గమనాన్ని, అందులోని అంతఃసారాన్ని కళ్ళకు కట్టిస్తుంది. ప్రణాళిక గురించి ఎంగిల్స్ చెబుతూ.. 'డార్విన్ సిద్ధాంతం జీవశాస్త్రానికి ఏమిచేసిందో అదే ఈ ప్రణాళికలోని ప్రతిపాదన చరిత్రకు చేసి తీరుతుందని నా అభిప్రాయం' అని అన్నారు. 'యూరప్‌ను ఒక భూతం ఆవహించింది. అదే కమ్యూనిజం అనే భూతం - ఈ దయ్యాన్ని వదిలించడానికి యూరపు అధికార శక్తులన్నీ ఒక పవిత్ర కూటమిగా ఏర్పడ్డాయి' అని మొదలవుతుంది. ఎందుకంటే కమ్యూనిజం దానికదే ఒక శక్తి అనేది ఈ ఆరంభం తెలుపుతుంది. 'ఇంత వరకూ సాగిన సమాజ చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే' అన్న వాక్యం చారిత్రక భౌతికవాదపు అంతఃస్సారం. 'నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, రణరక్త ప్రవాహ సిక్తం' అని కవి పలకడానికి అవగాహనా మాతృక ఈ పుస్తకం.
ప్రతి చారిత్రక శకంలోనూ ఆర్థిక ఉత్పత్తి విధానమూ, దాని నుండి విధిగా ఉత్పన్నమయ్యే సామాజిక వ్యవస్థాకలిసి, ఆ శకం యొక్క రాజకీయ, బౌద్ధిక చరిత్రకు పునాదిగా ఉంటాయి. తత్ఫలితంగా చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర, దోపిడీదారులకూ, దోపిడీకి గురయ్యే వాళ్ళకూ జరిగే పోరాటాల చరిత్ర. భిన్న సామాజిక అభివృద్ధి దశలలో ఉన్న పాలిత, పాలక వర్గాల మధ్య జరిగే పోరాటాల చరిత్ర. అయితే అణచివేతకు గురైన పీడితవర్గం అంటే కార్మికవర్గం తనను అణగదొక్కి పీడించే బూర్జువావర్గం నుండి విముక్తి పొందడం అనేది మొత్తం సమాజమంతటినీ దోపిడీ నుండి పీడన నుండీ శాశ్వతంగా విముక్తి చేస్తే తప్ప సాధ్యం కాని దశకు వర్గపోరాటాల చరిత్ర ఈనాడు చేరిందని' మార్క్స్ మూలభావాన్ని వివరించారని ఎంగెల్స్ వివరిస్తారు. బూర్జువా అంటే పెట్టుబడిదారుడు. ఈ పెట్టుబడి మానవ సంబంధాలన్నిటినీ కేవలం డబ్బు సంబంధాలుగా కుదించి, ప్రతిదీ అమ్మకాలు కొనుగోళ్ళుగా మార్చివేస్తుందని చాలా స్పష్టంగా ప్రణాళికలో వివరిస్తారు. స్త్రీలను కూడా ఒక సరుకుగా, సొంత ఆస్తిగా చేసిన బూర్జువాలు, కమ్యూనిస్టులు ఆస్తిని రద్దుచేసినట్లుగానే స్త్రీలనూ సమాజంపరం చేస్తారని దుష్ప్రచారం చేస్తారు. కమ్యూనిస్టులు బూర్జువాల సొంత ఆస్తిని రద్దు చేస్తామని బహిరంగంగానే చెబుతారు. ఇతరుల శ్రమను దోచుకుని పోగేసుకున్న ఆస్తిని రద్దు చేయటమే వారి లక్ష్యం. ఫ్రెంచి విప్లవం ఫ్యూడల్ ఆస్తి సంబంధాలను రద్దు చేసినట్టుగానే ఇదీ జరుగుతుంది. పెట్టుబడిదారుడు తన విచ్ఛిన్నాన్ని కార్మికుల రూపంలో తనే సృస్టించుకుంటాడు. ఇది రుజువు చేయబడుతూనే ఉంది. ఇప్పుడు మరీ స్పష్టంగా కనపడుతూ ఉంది. కార్పొరేట్ శక్తుల పెరుగుదల ఒకవైపు, కార్మికుల అణచివేత మరోవైపు వర్గపోరాటాలకు ఆయువు పోస్తున్న తరుణంలో ఈ రెడ్‌బుక్ అధ్యయనం మరింత ప్రాధాన్యత సంతరించుకొన్నది. జయించేందుకు ఓ ప్రపంచముందన్న దృఢ సంకల్పాన్ని కమ్యూనిస్టు ప్రణాళిక మనకిస్తుంది.