Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎల్ఐసిని తెగనమ్మడానికి మోడీ ప్రభుత్వం బరితెగిస్తున్న తీరు అత్యంత దుర్మార్గం. దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వాటాల విక్రయానికి సంబంధించిన ముసాయిదా ప్రతి (డిఆర్‌హెచ్‌పి)ని సెబికి సమర్పించడంతో ఈ ధోరణి మరింతగా స్పష్టమైంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎంత వాటా అమ్ముతారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు సమకూర్చుకుంటారన్న విషయాలు పక్కన పెడితే అసలు ఎల్ఐసిని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుందన్నది కీలక ప్రశ్న! 1956లో జీవిత బీమా సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం 5కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడి మీద ఇప్పటివరకు ప్రభుత్వానికి వచ్చిన డివిడెండ్ 31,616 కోట్ల రూపాయలు. దేశ వ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న ఆస్తుల విలువే సుమారు రూ. 38 లక్షల కోట్లు ఉంటుందని అంచనా! ఇంతింతై.. వటుడింతై... అన్నట్టుగా సాగుతున్న ఈ అసాధారణ ప్రస్థానానికి కారణం కేవలం ఐదు కోట్ల రూపాయలు కాదు! అంతకుమించి దేశ వ్యాప్తంగా సాధారణ ప్రజానీకం పెట్టుకున్న నమ్మకం! ప్రపంచంలోనే మరే బీమా సంస్థ కలలో కూడా ఊహించలేని విధంగా 40కోట్ల మంది ప్రజానీకం ఎల్ఐసికి పాలసీదారులుగా మారారు. వారి జీవితాశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఎల్ఐసి పాలసీల రూపంలో ప్రతిఫలించాయి. వారి కష్టార్జితమే ఎల్ఐసిని ముందుకు నడిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్ఐసికి వారే నిజమైన యజమానులు. వారి ప్రమేయం, సమ్మతి లేకుండా ఎవరైనా సరే ఎలా అమ్మగలరు? కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగబడింది. 1956లో ప్రత్యేక చట్టంతో ఎల్ఐసిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటాలు అమ్మడానికి మరో చట్టాన్ని పార్లమెంటులో పెట్టే ధైర్యం, నిజాయితీ మోడీ ప్రభుత్వానికి లేదు. అందుకే, పాలసీదారులతో ఒక్క మాట చెప్పకుండా, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, పార్లమెంట్లో నామమాత్రపు చర్చ కూడా జరపకుండా దొడ్డిదోవన బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చి ఈ అక్రమానికి తెగబడింది.
ఎల్ఐసి ప్రతి ఏటా 4లక్షల కోట్ల రూపాయల నికర మిగులును ఆర్జిస్తోంది. దీంతో పాటు ప్రతి సంవత్సరం 14శాతం చొప్పున వ్యాపారాన్ని పెంచుకుంటోంది. ఈ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే రానున్న సంవత్సరాల్లో కూడా వ్యాపారం మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి 38లక్షల కోట్ల రూపాయల స్థిరాస్తులు అదనం! ఇది కాక... ఎల్ఐసి పట్ల ప్రజానీకంలో అపరిమితమైన గుడ్‌విల్ ఉన్నది. దీనిని ఎలా లెక్క కట్టాలి? అందుకే ఎల్ఐసి ఎంబెడెడ్ విలువను లెక్క కట్టడం అసాధ్యమని, అది అనంతమని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. కానీ, ఎల్ఐసి ఎంబెడెడ్ విలువను కేవలం 5లక్షల కోట్ల రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాతిపదిక ఏమిటో చెప్పకుండా ఇంత తక్కువగా విలువను నిర్ధారించడం వెనుక కార్పొరేట్ కుతంత్రం లేదంటే నమ్మగలమా? ప్రజల సొత్తును అడ్డగోలుగా దోచిపెట్టడమని కాక దీనిని మరేమి అనగలం?
దేశ స్వావలంబనలోనూ ఎల్ఐసి కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా మౌలిక వసతుల రంగంలో ఆ సంస్థ పోషించిన పాత్ర అనిర్వచనీయం! దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఎల్ఐసి నిధులతో నిర్మాణమైన కట్టడాలు, కార్యాలయాలు ఒకటో, రెండో ఉంటాయి. ఇక దేశ పబ్లిక్ రంగ సంస్థలు నిలదొక్కుకోవడం లోనూ, విద్య, వైద్యం, విద్యుత్, సాగునీరు, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు మారు మూల పల్లెలకు విస్తరించడంలోనూ ఎల్ఐసి పెట్టుబడులే కీలకం.
మన దేశం 2008 ఆర్థిక సంక్షోభపు తాకిడిని తట్టుకుని నిలవగలిగిందంటే, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు వెన్నుదన్నుగా నిలవడమే కారణం. మళ్లీ ఇప్పుడు మరో సంక్షోభంలోకి కూరుకుపోతున్న సమయంలో ఎల్ఐసి వాటాలను తెగనమ్మడం దేశ ప్రయోజనాలకు చేటు. అందుకే, ఎల్ఐసిని కాపాడుకోవడమంటే కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థను పరిరక్షించుకోవడం మాత్రమే కాదు. దేశ స్వాతంత్య్రాన్ని, స్వావలంబనను కాపాడుకోవడం. సామాన్య ప్రజల ప్రయోజనాలను, వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం. ఎల్ఐసి ఆవిర్భావ మూలాలు దేశ స్వాతంత్య్ర పోరాటం నుండి వచ్చాయి. దాని పరిరక్షణ కోసం జరిగే పోరాటమంటే దేశ స్వావలంబన కోసం జరిపే పోరాటమే! దీనిలో భాగస్వాములు కావడం నిజమైన దేశభక్తులందరి బాధ్యత!