Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొక్కగానే ముండ్లతో మొలవడం విషముష్టిచెట్టుకు సహజ లక్షణమైనట్టు, విద్వేషం బీజేపీ పుట్టుకలోనే ఉందన్న మాట నిజమేననిపిస్తోంది. నేడు ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న నాలుగో విడత పోలింగ్ నేపథ్యంలో ఆ పార్టీలో అసహనం బుసలు కొడుతోంది. విద్వేషం కోరలు చాస్తోంది. ''నాకు కాకుండా మరొకరికి ఓటేసే హిందువులకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తా''నంటున్నారు యూపీ బీజేపీ ఎమ్మెల్యే రాఘవేంద్రసింగ్. ఇంతకు ముందు ''నేను గెలిస్తే ముస్లింల నుదుట తిలకం దిద్దిస్తా''నంటూ వీరంగమాడిన ఈ నేత... ఇప్పుడు ''ఒక హిందువు వేరే పార్టీకి ఓటేస్తే వారిలో 'మియా' రక్తం ప్రవహిస్తున్నట్టు.. అతను ద్రోహి. జైచంద్ అక్రమ సంతానం'' అంటూ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడుతున్నాడు. ''ఈ దేశంలో ఉండాలంటే ఎవరైనా రాధే రాధే అనాల్సిందే''.. ఇది యూపీకే చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే మయంకేశ్వర్ శరణ్‌సింగ్ హెచ్చరిక. బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామన్న తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ మాటలు ఇంకా చెవుల్లో రింగుమంటుండగానే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అంతకంతకూ పెరుగుతున్న ఈ విద్వేష వ్యాఖ్యలు మచ్చుకు కొన్నే...!
ఇప్పటి వరకు మూడు దశల్లో జరిగిన పోలింగ్ తమకు అంతగా అనుకూలించదని గుర్తించారో, లేక ఈ నాలుగో దశలో ఎదురుగాలి తప్పదని భావిస్తున్నారో తెలియదుగానీ, ప్రతికూలతలను ఎదుర్కోవడానికి మత విద్వేషమే అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. అదీ ఫలించదనుకుంటే బెదిరింపులకు తెగబడుతున్నారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రాంతాలైన లఖీంపూర్ ఖేరీ, సీతాపూరు, ఫెలిబిత్, హర్దోయి, ఫతేపూర్లాంటి తొమ్మిది జిల్లాల్లో ఈ దశలోనే ఎన్నికలు ఉండటం కమలనాథులను కలవరపరుస్తున్నట్టుంది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో రైతులను వాహనాలతో తొక్కించి చంపిన కేంద్ర మంత్రి తనయుడు అజరుమిశ్రాకు బెయిల్ లభించడం మరింతగా రైతుల ఆగ్రహానికి గురవుతోంది. దీనికి తోడు లైంగికదాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌సింగ్ సెంగార్ ప్రధాన దోషిగా తేలిన ఉన్నావ్ కూడా ఈ ప్రాంతంలోనిదే కావడం బీజేపీకి ఇంకింత ఆందోళన కలిగిస్తున్నట్టుంది. అందుకే విద్వేషాలను రెచ్చగొట్టి, విభజన రాజకీయాలతో గట్టెక్కాలని చూస్తున్నారు. స్వయంగా యోగి ఆధిత్యనాథే ''మార్చిలో మా ప్రభుత్వమొస్తుందీ, వచ్చిన మరుసటి రోజు నుండే బుల్డోజర్లకు పని చెప్పాల్సి ఉంటుంది'' అంటున్నారంటే పరిస్థితి ఎలావుందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ భాష మాట్లాడుతుంటే అక్కడ విద్వేషానికిగాక సామరస్యానికి చోటుంటుందా..?!
''స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలతో, ఉన్నత ఆదర్శాలతో నెహ్రూ రూపుదిద్దిన ఇండియాలో... ఇప్పుడు ఆ విలువలు క్షీణిస్తున్నాయి''. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ చేసిన ఈ విమర్శకు అగ్గిమీద గుగ్గిలమయ్యే భారత ప్రభుత్వ పెద్దలు... అందులో ఆవగింజంతైనా ఆత్మవిమర్శకు ప్రయత్నించగలిగితే దేశానికి ఈ దుస్థితి దాపురించేది కాదేమో! ప్రజల ''ఓటు హక్కు'' ఇంత ప్రమాదంలో పడేది కాదేమో..!! లేదంటే... ''వేల సంఖ్యలో బుల్డోజర్లు కొని పెట్టుకున్నాం..! బుల్డోజర్లు దేనికి ఉపయోగపడతాయో తెలుసుకదా..?'' అంటున్న యోగి హెచ్చరికల సారాంశమేమిటి? యోగికి ఓటెయ్యకపోతే యూపీలో బతికే హక్కే లేదన్నట్టుగా సాగుతున్న కమలనాథుల వ్యవహారంలో ఓటు హక్కుకు చోటెక్కడీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మనుషుల్ని మతాలుగా చీల్చేందుకు తెగబడుతుంటే లౌకిక భావనలకు తావెక్కడీ అధికార గర్వంతో వ్యవస్థలను సైతం లెక్కచేయని పాలనలో రాజ్యాంగ నియమాలకు రక్షణ ఉంటుందా..? మరో దేశ పాలకుడెవరో ఎత్తిచూపితే మనకు నచ్చకపోవచ్చుగానీ, దిగజారుతున్న మన ప్రజాస్వామ్య విలువలకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
మతం పేరుతో హిందూ ఓటర్లను సమీకరించడం, కాదంటే బెదిరించడం మాత్రమే కాదు, హిందూత్వ అనే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ముస్లింలకు కూడా తమకు ఓటేయడం తప్ప మరో గత్యంతరంలేని స్థితిని వ్యూహాత్మకంగానే సృష్టిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూనే ''ఇది 80శాతానికీ 20శాతానికీ మధ్య యుద్ధం'' అని ప్రకటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైనారిటీల అన్యీకరణనే తమ అధికారానికి దగ్గరి దారిగా ఎంచుకున్నారు. ప్రజాభిప్రాయానికి అవకాశమే లేకుండా చేస్తున్నారు. అసలు ప్రజలకు స్వేచ్ఛగా ఓటేసే హక్కే లేనప్పుడు ఇక ఆ ప్రజాసామ్యానికి దిక్కెవరు..? నిస్సందే హంగా ప్రజలే. ''భారత ప్రజలమైన మేము, మేముగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నందున.. దానిని కాపాడుకునే బాధ్యత కూడా మాదే''నని ప్రకటించుకున్నట్టుగా ఇప్పుడు ఆ బాధ్యత ప్రజల మీదే ఉంది. వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రగతిశీల శక్తుల మీద ఉంది. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద విశ్వాసంగల అభ్యుదయవాదులు మాత్రమే ఇందుకు బాధ్యత వహించగలరు.