Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రజలకు అవసరమైన పనులేవీ నేను చెయ్యనుగాక చెయ్యను.. జనాలకు నష్టం చేకూర్చేదైనా సరే అది నాకిష్టమైతే కండ్లు మూసుకుని చేసి పారేస్తా...' అన్నట్టుంది కేంద్రంలోని బీజేపీ వైఖరి. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య హడావుడి చేసింది. ఇది అడవులు, పర్యావణానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది.. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటూ నిపుణులు, మేధావులు చెప్పినా పట్టించుకోకుండా ముందుకెళ్లబోయింది. అదే సెంట్రల్ గవర్నమెంట్... నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించే, గిరిజన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మాత్రం వంకర టింకర మాటలు మాట్లాడుతూ బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి... 'బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదు...' అని సెలవిచ్చారు. తద్వారా రాష్ట్ర విభజన చట్టంలోని ఒక ప్రధానమైన హామీని తుంగలో తొక్కినట్టు ఆయన చెప్పకనే చెప్పారు. వాస్తవానికి కిషన్‌రెడ్డి నోటి నుంచి వెలువడిన ఈ ఆణిముత్యాలు... బయ్యారం స్టీల్ ప్లాంట్ పట్ల మోడీ సర్కార్ వైఖరికి తార్కాణాలు.
ప్లాంట్ ఏర్పాటు 'సాధ్యం కాదు...' అంటూ మంత్రి చెప్పిన ఒకే ఒక వాక్యాన్ని పరిశీలించి, పరికించి చూస్తే... కేంద్రం ఎంత వాస్తవ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదో తెలుస్తున్నది. ఈ విషయంలో మోడీ సర్కారు పచ్చి అబద్ధాలు వల్లె వేసున్నదనటానికి అనేక ఉదాహరణ లున్నాయి. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన ముడి సరుకు, వనరులు, నీటి సదుపాయం పుష్కలంగా ఉన్నాయనేది నిపుణులు, అధికారులు తేల్చిన విషయం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం... దేశంలోని ఇనుప ఖనిజ నిల్వల్లో సుమారు 11 (సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నులు) శాతం బయ్యారంలోనే ఉంది. దీని విలువ రూ.10 లక్షల కోట్లని అంచనా. అక్కడికి దగ్గర్లోనే మున్నేరు, బయ్యారం చెరవు ఉన్నాయి, కాబట్టి నీటి వసతికి ఢోకా లేదు. పక్కనే ఉన్న మదారం గ్రామం (కారేపల్లి మండలం)లో... ప్లాంట్‌కు అవసరమైన డోలమైట్ నిక్షేపాలు కూడా విస్తారంగా ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ కేంద్రం కావాలనే మరుగుపరుస్తూ ఉండటం గమనార్హం. ఒకవేళ అది చెప్పినట్టుగానే సరిపడినంత ముడి ఇనుము బయ్యారంలో లేదని అనుకున్నా... అక్కడికి 180 కిలోమీటర్ల స్వల్ప దూరంలోనున్న ఛత్తీస్‌ఘడ్‌లోని బైలాడిల్లలో గనులున్నాయి. వాటిని కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోవటమనేది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే. ఇందుకు సంబంధించి 2016లోనే జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎమ్డీసీ) అంగీకరించినప్పటికీ మోడీ సర్కార్ పరిగణన లోకి తీసుకోకపోవటమనేది తెలంగాణపట్ల కక్షపూరితంగా వ్యవహరించటమే అవుతుంది తప్ప వేరేది కాదు.
మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వరంగల్ జిల్లాలోని ముల్కనూరులో 'రచనా స్టీల్ కంపెనీ'ని నిర్మించతలపెట్టిన విషయం విదితమే. ఆ సంస్థకు కావాల్సిన ముడి ఇనుమును బయ్యారం నుంచి తరలించేందుకు అప్పట్లో రంగం సిద్ధం చేశారు. ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించటం, వైఎస్ హఠాన్మరణంతో ఆ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయింది. ఇక్కడ చెప్పొచ్చేదేమంటే... నిజంగా బయ్యారంలో ఐరన్ ఓర్ సరిపోయినంతగా లేకపోయినా, అది నాణ్యమైంది కాకపోయినా... వైఎస్‌లాంటి వ్యక్తి దాన్ని తన అనుయాయుల కంపెనీకి వాడుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు...? ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత... 'బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదు...' అనే వంకర మాటలు ఒట్టి బోగస్ అని తేలిపోతున్నది. దాని నిర్మాణం కోసం లక్షలాది మంది గిరిజన బిడ్డలు ఎదురు చూస్తున్నారు. అక్కడ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే కొన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ ప్రాంత అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఇదే డిమాండ్‌పై గతంలో సీపీఐ (ఎం), ప్రజా సంఘాలు ఐదు లక్షల మందితో సంతకాల సేకరణ చేపట్టాయి. బయ్యారం నుంచి మహబూబాబాద్ వరకూ పాదయాత్ర నిర్వహించాయి. అయినా కేంద్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇక్కడ సమస్త రంగాలను ప్రయివేటీకరిస్తున్న బీజేపీ సర్కార్...ప్రభుత్వ రంగంలో కొత్తగా ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుందని అనుకోవటం అత్యాశే అవుతుంది. పొరుగు రాష్ట్రం విశాఖలో ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్‌నే ప్రయివేటు, కార్పొరేట్ కంపెనీలకు బేరం పెడుతున్న మోడీ ప్రభుత్వం... తన విధానానికి భిన్నంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్‌కు అభయమిస్తుందన్న అంచనా ఏ కోశానా ఉండాల్సిన అవసరం లేదు. ఈ పరంపరలోనే తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగవరపు కిషన్‌రెడ్డి... 'సాధ్యం కాదు...' అంటూ దుస్సాహసం చేశారు. ఆయనకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఓకే చెప్పించాలె. అందుకనుగుణంగా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలె.