Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్-రష్యా పరిణామాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఈ భయానక పరిణామాలకు కారణం రష్యా భద్రతా సమస్యా? లేక అమెరికా ప్రపంచాధిపత్య వ్యామోహమా? అన్నది అటుంచితే బలైపోతున్నది మాత్రం ఉక్రెయిన్ ప్రజలే. ''మా దేశాన్ని కాపాడుకునే విషయంలో మేం ఒంటరిగా మిగిలిపోయాం. మాతో కలిసి పోరాడేందుకు ఎవరున్నారు? నాకైతే ఎవరూ కనిపించడం లేదు'' అంటున్న ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఉక్రెయిన్ కోసం నాటో బలగాలను పంపే ఆలోచనే తమకు లేదని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. ఇప్పటికే రష్యా దాడులతో చాలా ప్రాంతాల్లో విధ్వంసానికి గురైన ఆ అమెరికా మిత్రదేశానికి ఈ ప్రకటన పెద్ద షాకే ఇచ్చింది. అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయిపోగా, చివరికి నాటోను నమ్మి నట్టేట మునిగినట్టయింది ఉక్రెయిన్ పరిస్థితి.
అండగా నిలుస్తాయనుకున్న అమెరికా సహా పశ్చిమదేశాలన్నీ సానుభూతి ప్రకటనలకే పరిమితమైపోవడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు అసహనంతో రగిలిపోతున్నారు. ''అంత్యంత శక్తివంతమైన దేశం కేవలం దూరం నుంచి చూస్తూ ఉంది'' అంటూ పరోక్షంగా అమెరికాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు తమను నాటోలో భాగస్వాములు కావాలంటు ఎవరు ముందుకొచ్చారంటూ నాటో దేశాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీనిని బట్టి ఈ పరిణామాలకు కారణాలేమిటో, ఎవరి ప్రయోజనాలకు ఎవరు బలవుతున్నారో కొంత అర్థం చేసుకోవచ్చు. నేటి ఈ ఉక్రెయిన్-రష్యాల వివాదానికీ నాటో కూటమికీ సంబంధమేటో తెలియాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది.
నాటో... అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో అమెరికా నేతృత్వంలో కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 12 దేశాలతో ఏర్పాటయింది. ఈ కూటమిలోని దేశాలపై మరేదేశం యుద్ధానికి దిగినా ఒకరికొకరు అండగా సైనిక సహకారం అందించుకోవాలన్నది దీనికి భూమిక. సభ్యదేశాల్లో దేనిపై దాడి జరిగినా తమపై జరిగినట్టుగానే భావించాలన్నది ఒప్పందం. ఇది పైకి పరస్పర సహకారం కోసం, ఆత్మరక్షణార్థం ఏర్పడిన సైనిక కూటమిగా కనిపించినా... దీని అసలు లక్ష్యం అది కాదని దాని చరిత్ర, విస్తరణ చూస్తే అర్థమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో నాటి సోవియట్ యూనియన్ ప్రభావాన్ని అడ్డుకోవడం, ప్రపంచాధిపత్యాన్ని సాధించడమే దాని అసలు లక్ష్యమన్నది చరిత్ర చెపుతున్న సత్యం. అయితే దీనికి ప్రతిగా నాటి సోవియట్ రష్యా తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలతో ఏర్పాటు చేసిన ''వార్సా'' కూటమి నాటో ఆటలు సాగనివ్వలేదు. కానీ 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత వార్సా కూటమి నిర్వీర్యమైంది. ఆ తరువాత నాటి తూర్పు ఐరోపా దేశాలను కలుపుకుని అమెరికా తన నాటో కూటమిని 30 దేశాలకు విస్తరించింది. ఇందులో మాజీ సోవియట్ యూనియన్ నుండి చీలిన దేశాలు కూడా కొన్ని చేరిపోయాయి. ఇది తమ దేశ భద్రతకు ప్రమాదమని భావించిన రష్యా మొదటి నుండీ ప్రపంచ వేదికలపై గట్టిగా వ్యతిరేకిస్తోంది. దీనితో తూర్పు దిశగా తమ వ్యాప్తి ఉండదని రెండు దశాబ్దాల క్రితమే నాటో హామీ ఇచ్చింది. ఆ మేరకు నాటోలో చేరిన తూర్పు యూరప్ దేశాల నుండి మీ బలగాలను, ఆయుధ సంపత్తిని వెనక్కి తీసుకోవాలని సుదీర్ఘకాలంగా రష్యా కోరుతోంది. అయినా పట్టించుకోకపోగా ఇప్పుడు రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్ను కూడా నాటోలో చేర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయడమే నేటి ఈ యుద్ధ సంక్షోభానికి ప్రధాన కారణం.
ఈ మొత్తం పరిణామాల్లో అమెరికాకు పావుగా వ్యవహరించిన ఫలితాన్ని నేడు ఉక్రెయిన్ అనుభవిస్తోంది. అమెరికాకు తన ప్రయోజనమే తప్ప ప్రపంచ ప్రయోజనాలు పట్టవని ఇది మరోసారి నిరూపిస్తోంది. అలాగని రష్యానూ సమర్థించలేం. కారణాలేమైనప్పటికీ ఏ దేశమూ మరో దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయకూడదు. సమస్య ఎలాంటిదైనా శాంతియుతంగా దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలేగానీ, యుద్ధమెప్పుడూ న్యాయమైనది కాదు. ఎందుకంటే... అది మొదట బలితీసుకునేది సాధారణ సైనికుల్నీ, అమాయక ప్రజల్నే. అది మిగిల్చే విషాదం అంతులేనిది. కాకపోతే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు మొదలు బ్రిటన్ ప్రధాని దాకా అందరూ దౌత్య ప్రయత్నాలకు వెచ్చించాల్సిన సమయాన్ని కూడా ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే వాడుకోవడం అమానవీయం. వారు కనీసం రష్యా కోరుతున్నట్టు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వగలిగినా పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. అయినా ప్రజల ఆశలూ, ఆకాంక్షలతో సంబంధంలేని ఈ ఆధిపత్య ధోరణులలో న్యాయాన్యాయాలకు చోటెక్కడిది..?