Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేల కిలోమీటర్ల దూరం... వీడియో ఫోన్లో పలకరింపు... కళ్ళ నిండా నీళ్ళు... నిండి కన్న కూతురితో సంభాషణ... 'బాధపడకండి నాన్నా! నేను బాగానే ఉన్నాను. యుద్ధ శబ్ధాలు వినిపిస్తున్నాయి. బాంబులు మాపై నుండే ప్రయాణిస్తున్నాయి. పొగలు విరజిమ్ముతున్నాయి. ఇప్పటివరకయితే ఏదో ఒకటి తిన్నాం. ఇక దొరికేట్టులేదు. నీళ్లూ అయిపోతున్నాయి. అయినా దిగులు చెందకండి. తిరిగి వస్తాను. దుఃఖపడకండి' అంటూ తల్లిదండ్రులను ఓదారుస్తున్న పిల్లలు. పిల్లలేమయిపోతారోనని గుండెల నిండా ఆందోళనలతో తల్లిదండ్రులు. ఇదీ ఉక్రేయిన్, రష్యా యుద్ధ సందర్భంగా చదువుల కోసం అక్కడ నివసిస్తున్న వేలాదిమంది భారతీయ విద్యార్థుల పరిస్థితి.
ఉక్రేయిన్లో పరిస్థితులు అతి భయంకరంగా ఉన్నాయి. మాకు ఆందోళనగా ఉంది. ఇండియాకి మమ్మల్ని పంపే ప్రయత్నం చేయండని విద్యార్థులు వేడుకుంటున్న దృశ్యాలు ఇక్కడి తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. తలదాచుకోవటానికి అందరికీ బంకర్లులేవు. విద్యుత్ పోయి చీకటిగదుల్లో ఉంటూన్నారు. నెట్వర్క్ పోయి, సంబంధాలూ తెగిపోయాయి. విమాన సర్వీసులు మూతపడ్డాయి. ఏం చేయాలి? యుద్ధం రెండు దేశాల మధ్యే జరగదు. మనుషులతో కలిపి ఉన్న తీగనంతా పెకిలిస్తుంది. యుద్ధబాంబులు శత్రువులనే హతమార్చవు. అప్పుడే కునులిప్పిన శిశువు ముఖంపై రక్తమై పేలుతాయి. యుద్ధం శాంతికాముక చల్లని పాలబుగ్గలపై అగ్నిజ్వాలను కురిపిస్తుంది. తమ పిల్లలు మృత్యు ఒడిలోకి ఎందుకు చేరుతున్నారో తెలియని తల్లుల దుఃఖపు జలానికి సమాధానమెక్కడా దొరకదు. యుద్ధ కారక సూత్రధారులు మాత్రం కేవలం వీక్షక పాత్రలో సురక్షితులు.
అందుకే మన మఖ్దూం మొహియుద్దీన్ సిపాయీ అనే తన గీతంలో 'వెళుతున్న సిపాయినడుగు, నీ పయనం ఎక్కడికని! విషాదాల ఒక తల్లిని చూడు పాటపాడుతూ ఉన్నది. ఆకలికేడ్చే పిల్లలనేదో మభ్యపుచ్చుతూ ఉన్నది, కళేబరాలు కాలేవాసన క్రమ్ముకుంటూ ఉన్నది, జీవితమేదో గొంతు పెకలక రోదిస్తూనే ఉన్నది. జానేవాలే సిపాహీసే పూఛో, వో కహాం జారహౌహై... భయం భయంగా ప్రతినక్షత్రం అడుగులు వేస్తూ ఉన్నది, ఆకాశాన హత్యలు ఏవో జరిగాయన్నట్లున్నది. గగనం అంచున ఎర్ర ఎర్రని రంగే కారుతూ ఉన్నది' అని యుద్ధ సన్నివేశాన్ని కళ్లకుకడతారు. యుద్ధ కాంక్షపరుల సామ్రాజ్యవాద భయంకర రక్తదాహాలు చరిత్రలో కోకొల్లలు. ప్రపంచపు అగ్రభూతం కాలిడి రక్తం పారించని నేల ఉందా! వియత్నాం, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, చీలీ, పెరూ, క్యూబా, అఫ్ఘనిస్తాన్ ఇలా ఎన్నయినా చెప్పుకుంటూ పోవచ్చు. చమురు నేలల కోసం, సంపద ఆక్రమణల కోసం కత్తులు దింపిన అమెరికన్ నెత్తుటి చేతులు చరితలో ఇంకా తడితడిగానే ఉన్నాయి కదా!
తెలుసుకోవాలి. వెనుక, లోపల దాగిన క్రూర పన్నాగాలను పసికట్టాలి. ఇంతకూ రష్యాను రెచ్చగొట్టిందెవరు? ఉక్రేయిన్ను వెనుకుండి తోసిందెవ్వరు? ఎవరెవరి ప్రయోజనాలు దాగున్నాయి ఇందులో. ఎవరి ఆయుధ వ్యాపారం లాభాలు పొందుతున్నది. ఎక్కడ యుద్ధపు తంత్రం రచింపబడుతున్నది! తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అందరి సమస్య. నాకేమీ సంబంధం లేదనుకుంటే, మనమూ బలవుతాము. యుద్ధగీతం మన ఇంటి ముందరికీ వస్తుంది. మౌనంగా ఉంటే నేరస్తులమే. యుద్ధానికి మనుష్యులే శత్రువులు. యుద్ధమంటే మానవత్వంపై ఎక్కుపెట్టిన క్షిపణి. ''యుద్ధమంటే శవాలు కాలే కమురువాసన, కళ్లను తాకే పచ్చినెత్తురు. తల్లి శవం పక్కనే స్తన్యాన్ని వెతికే పసిబిడ్డ ఏడుపు, బతుకే యుద్ధమైన చోట, కావాల్సింది ప్రేమే తప్ప యుద్ధభాష కాదు' అంటాడు అరుణాంక్.
యుద్ధం అయిపోతుంది. కానీ దాని తాలూకు ప్రభావాలు, పరిణామాలు మాత్రం అందరినీ తాకుతాయి. అందుకే పాలస్తీనా కవి దార్విష్ ఇలా అంటారు. 'యుద్ధం ముగిసిపోతుంది, యుద్ధోన్మాద ప్రభువులు చేతులు కలుపుకుంటారు, కోల్పోయిన కొడుకు కోసం ఆ పండు ముసలి స్త్రీ ఎదురుచూస్తూనే ఉంటుంది. ప్రియాతి ప్రియమైన సహచరుడి కోసం ఆ నవయువతి ఎదురుచూస్తూను ఉంటుంది. వీర యోధుడైన తండ్రి కోసం అనాధ పిల్లలు ఎదురు చూస్తూనే ఉంటారు.'' నిజమే కదా! ఇప్పుడు తక్షణమే గాయపడినవారిని ఓదార్చాలి. దుఃఖితుల కన్నీళ్ళు తుడవాలి. భయాలతో ఆందోళనపడుతున్న వారికి చేయూతనందించాలి. దేశం గురించి, భక్తిని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. మన భారతీయులను రక్షించేందుకు కావలసిన చర్యలను చేపట్టాలి. వారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చాలి. శాంతి సామరస్యాల కోసం కృషి చేయాలి. కేవలం మాటలు చెప్పటం కాదు. పరిష్కారం కోసం ప్రయత్నం మొదలు పెట్టాలి. అగ్రదేశాల పంచన చేరితే జరిగే అనర్థాలను గుణపాఠంగా తీసుకోవాలి.
ఏ ఆలోచనల వెనకాల ఎవరి ప్రయోజనాలున్నాయో, ఎవరిని హత మార్చనున్నాయో చైతన్యయుతంగా అవగాహన చేసుకోవాలి. నిజమైన మానవీయ సంబంధం కోసం, శాంతికోసం అడుగులు వేయాలి.