Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చత్తీస్ఘడ్ గూడేల్లో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. సరైన వైద్యం అందక గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా అధికారులు, పాలకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఆరోగ్య రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించనుందంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు బాకా బజాయిస్తున్నారు. కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించామని ఊదర కొడుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు తాజా ఉదాహరణే ఛత్తీస్‌ఘడ్‌లో గిరిజనుల దుర్భర పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులను ప్రయివేటు ఆసుపత్రులకు పంపించి వారి ఉసురు తీస్తున్న తీరు తాజాగా వెలుగు చూసింది. ఆ రాష్ట్ర గిరిజన మంత్రిత్వశాఖ తెలిపిన గణాంకాల ప్రకారమే గిరిజన జిల్లాల్లో గడిచిన మూడేండ్లలో 3112 మంది మహిళలు సరైన వైద్యం అందక మృతి చెందారు. అందులో 995మంది గర్భిణి స్త్రీలు ఉండటం విస్మయాన్ని కలిగిస్తుంది.
చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న గిరిజన ప్రాంతాల ప్రజలను లైసెన్స్లులేని ప్రయివేటు ఆసుపత్రులకు పంపిస్తున్న 'సిఫార్సుల రాకెట్' గుట్టు ఇటీవల బయటపడింది. వారిలో చాలా మంది మహిళలు సరైన చికిత్స అందక, తప్పుడు వైద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నది ఆందోళన కలిగిస్తోంది. కోర్బా జిల్లాలోని గీతా దేవి మెమోరియల్ ఆసుపత్రిలో సుని బారు కోర్వా అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన క్రమంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ డాక్టర్ అనాధికారికంగా నిర్వహిస్తున్న ఆసుపత్రిలో బాధిత మహిళ సరైన వైద్యం అందక మృతి చెందింది. దీంతో ఆసుపత్రిని మూసివేశారు అధికారులు. సంబంధిత వైద్యుడికి నోటీసులు పంపించారు. అయితే ఇది కేవలం మచ్చు తునక మాత్రమే. ఎలాంటి వెలుగు చూడని ఘటనలు ఆ రాష్ట్రంలో గల్లీకొకటి జరుగుతున్నాయి.
ఈ తీగ లాగితే డొంకంతా కదిలింది. ఒకదాని వెంట ఒకటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన మూడేండ్లలలో ఒక్క దంతెవాడ జిల్లాలోనే 1753మరణాలు నమోదయ్యాయాంటే నిజంగా మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేదా అన్న సందేహం కలుగుతోంది. ఆ పక్కనే ఉన్న కోర్బా జిల్లాలో 103 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇలా గిరిజన జిల్లాలే లక్ష్యంగా ''సిఫార్సుల మాఫియా'' రాజ్యమేలుతోంది. అయితే, మరణాలు గర్భస్రావం, రోగనిరోధక వ్యవస్థ పాడవటం వంటి వాటితోనే సంభవించాయని రికార్డుల్లో ఉండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయే తప్ప. కనీసం విచారణకు కూడా ఆదేశించక పోవడం గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.
ఎవరైనా తీవ్ర అనారోగ్య కారణాలతో మరణిస్తే అర్థం చేసుకోగలం. కానీ, సాధారణ రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నారంటే అది వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అని భావించాల్సి ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన అంశం. అది గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకున్నారంటే వారికి ఏం జరిగినా ప్రశ్నించే వారు ఉండరనే కదా. ముఖ్యంగా బలరామ్‌పుర్, బస్తర్, బీజాపుర్, దంతెవాడ వంటి జిల్లాల్లో సుమారు 22 లైసెన్స్ లేని ఆసుపత్రులను ప్రభుత్వ వైద్యులే నడుపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బంది సాయంతో రోగులను వారి ప్రయివేటు ఆసుపత్రికి వచ్చేలా మభ్యపెడుతున్నారు. ఆయా ఆసుపత్రుల్లో సరైన వైద్య సామగ్రి లేకపోవటం, సరైన సదుపాయాలు లేకపోవడంతో అధిక మరణాలు చోటుచేసుకుంటున్నా యన్నది పచ్చి నిజం. మన రాష్ట్రంలో సైతం గిరిజన ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు కానీ, వైద్యులు కానీ లేరు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఎజెన్సీ ప్రాంతాల్లో నిమోనియా, రక్తహీనతతో బాధపడే మహిళలు అనేక మంది ఉన్నారు. వారికి అవసరమైన వైద్యం సకాలంలో అందక మరణాలు సంభవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మన ముఖ్యమంత్రి గిరిజన ప్రాంతాల్లో మాల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తానని చెప్పి కూడా ఏండ్లు గడుస్తున్నాయి. అయినా అది అమలుకు నోచుకోలేదు. సరైన రవాణా సదుపాయం కూడా లేని గూడేల్లో అర్థరాత్రి ఆసుపత్రికి పోవాలంటే పోలేని పరిస్థితే తెలంగాణలో ఉన్నది. ఇప్పటికీ డోలీ కట్టుకోనే రోగులను ఆసపత్రులకు తరలిస్తున్నారు.
విద్య, వైద్యం ప్రధానంగా ప్రభుత్వ రంగంలో కొనసాగి నప్పుడు లేని దారిద్య్రం అవి ప్రయివేటు రంగం పట్టులోకి పోయిన తర్వాత దేశంలోని సాధారణ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు ప్రాణాలు పోయడానికి బదులు వాటిని తోడేస్తున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు, చికిత్స ఖర్చులు ఊహించనంతగా పెంచేసి కోట్లాది నిరుపేదల ఊపిరిని హరిస్తున్నాయి. ఆసుపత్రుల్లో, మందుల షాపుల్లో ఎక్కడికక్కడ పేద ప్రజల అజ్ఞానాన్ని ఉపయోగించుకొని సాగుతున్న దోపిడీ వల్లనే వారు ఇంతగా ఆరోగ్య వ్యయానికి బలైపోతున్నారు. బ్రిక్స్ దేశాలలో ప్రజారోగ్యానికి అతి తక్కువగా ఖర్చు పెడుతున్నది మన దేశమేనన్నది చేదు వాస్తవం. మొత్తం 184 దేశాల్లో ప్రజారోగ్య సంరక్షణ విషయంలో భారత్ 147వ ర్యాంకులో ఉన్నది.