Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధర్మరాజు అధర్మంగా వర్తించడనే రూలేం లేదు. పాపం! ఆయనా మనిషే కదా! అయితే ఆయన చెప్పిన అబద్ధామే ఫేమస్ అయ్యింది కాని, తమ గురువునే దారుణంగా వంచించాడనే విషయం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అశ్వథ్థామ (హతః) చనిపోయాడని ఆయనకు వినపడేలా బిగ్గరగా అరిచి, చిన్న గొంతుకతో ఆ పేరున్న ఏనుగు (కుంజరః) అన్నాట్ట. ఎల్లప్పుడూ సత్యవాక్య పరిపాలకుడైన ధర్మనందనుని నోట ఆ మాట వినేసరికి సదరు (నిజం) అశ్వథ్థామ తండ్రి, కురువంశానికే గురువైన ద్రోణాచార్యులవారు ధనుర్భాణాలు కిందపడేశాట్ట! అప్పుడాయన ప్రియ శిష్యుడైన అర్జునుడు గురువుగారి తల తెగనరికేశాట్ట! ఇంత 'పాపం' చేసిన వాళ్ళని ఈ రోజుల్లో ఎంత నీచంగా చూస్తామోననే విషయం వేరేసంగతి!
నిరంతరం శ్రీమద్రామాయణ, మహాభారతాల్ని వల్లెవేసేవారు వాటి గురించి ఏమీనేర్చుకోకుండా ఉంటారా? మొన్న బీజేపీ అఖిల భారత నాయకులు, కేంద్ర మంత్రివర్యులు అయిన ముక్తార్ అబ్బాస్ నఖ్వి సాబ్ 'హిజాబ్‌పై నిషేధం లేదు' అన్నారు. అంతవరకే విని వూరుకుంటే ద్రోణాచార్యులైపోతాం. ఎందుకంటే ఆ వెంటనే ''విద్యాసంస్థల్లో మాత్రం యూనిఫార్మ్ తప్పనిసరి'' అన్నారాయన. 'యూనిఫార్మ్' అంటేనే అందరూ ఒకేలా ఉండాలని కదా అర్థం?! స్కూళ్ల యూనిఫార్మ్‌లో హిజాబ్ ఉండదుకాబట్టి ఇక హిజాబ్ ప్రశ్నే రాదన్నమాట! పైగా ఈ పెద్దమనిషి, ఏ ఢిల్లీలోనో, ముంబారులోనో కాదు, సరిగ్గా మన హైదరాబాద్ నడిబొడ్డున అన్నారు. ఎందుకంటే ఇది వారి 'హిట్ లిస్టు'లో ఉంది. ఆ మధ్య అమిత్‌షా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తానంది కూడా మన పాతబస్తీపైనే! అక్కడ ఎన్నో తరాల నుండి హిందువులు, ముస్లిమ్‌లు కలిసిమెలిసి ఉంటున్నారన్న విషయం వీరికి తెలియదా? అక్కడ నివశించే ముస్లిమ్‌లు ఈ దేశ పౌరులే కాదన్న రీతిలో జరిగింది అమిత్‌షా ధోరణి. అవునులే! గుజరాత్లో రెండువేల మందికి పైగా అతి కిరాతకంగా హతమార్చిన ద్వయానికి మనుషుల ప్రాణాల విలువ ఎలా తెలుస్తుంది? మన తెలంగాణలో వారి ''సాగు''కు అవసరమైన ముస్లిమ్ జనాభా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా సమావేశంలో తాము తల్వార్లు పట్టుకు తిరగాల్సి రావచ్చన్న సంకేతాల్ని అన్యాపదేశంగా ఇచ్చారు. అంటే వారిప్లాన్లో ఎన్ని 'షాహీన్‌భాగ్'లున్నాయో, ఎన్ని గోద్రానంతర గుజరాత్లున్నాయో!?
మోడీ గుజరాత్లో నేర్చుకున్న పాఠం అధికారంలోకి రావడానికే కాదు, వచ్చిన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నా మత మారణహౌమాలు సృష్టించాలనే! దాన్నే నేడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చూస్తున్నాం. దీన్నే ''మాన్యుఫాక్చరింగ్ కాన్ఫ్లిక్ట్'' అని ఫ్రంట్‌లైన్ పత్రిక పేర్కొంది. కర్నాటక రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో బీజేపీ వేళ్లూనుకుంటున్న తీరు మనం అర్థంచేసుకోవాలి. ఆ నేపథ్యంలోనే తాజా హిజాబ్ గొడవ రేగ్గొడుతున్న తీరు చూడాలి. కర్నాటక కోస్తా ప్రాంతం అంటే సుందర దృశ్యాలకి, ఆహ్లాదకర వాతావరణానికీ, ఉడిపిలోని మఠాలకి, హిందూ ధర్మక్షేత్రాలకి పేరనే విషయమే భారతీయులకు తెలుసు. 2009లో మరో కోణంలో ఈ ప్రాంతం ప్రచారంలోకి వచ్చింది. 'శ్రీరామసేనె'కి చెందిన ప్రమోద్ ముతాలిక్ ఒక పబ్‌లో మహిళలపై దాడిచేసి ''తాము ఈ దేశ సంస్కృతీ పరిరక్షలు''గా ప్రకటించుకున్నారు. ఆ ఉడిపి ప్రాంతంలోనే ప్రస్తుతం హిజాబ్ గొడవ రాజుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రే 80శాతం, 20శాతం అంటూ ప్రచారం లంకించుకున్నాడు. యోగికి ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కించేస్తామని మన రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడతాడు. మన రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. కానీ, మిగిలిన రాజకీయ పార్టీల్లాగా దానికోరిక కేవలం అధికారమే కాదు, ప్రజల్ని మతం ఆధారంగా చీల్చడం. దాన్లో విజయం సాధి ంచాడనే జిహెచ్ఎమ్సి ఎన్నికల తర్వాత మేయర్‌నో, డిప్యూటీ మేయర్‌నో అందివ్వకపోయినా బండి సంజరుని అమిత్‌షా మెచ్చుకున్నది!
సామాజిక, తెగల తేడాలను గణనీయమైన మేరకు అధిగమి స్తూ, ఎక్కువ ప్రభావం చూపగల ''హిందూ అస్థిత్వాన్ని'' సృష్టించ డంలో బీజేపీ జయప్రదం అయ్యిందని, అవుతోందని వామ పక్షాలు దేశ ప్రజలకు చేస్తున్న హెచ్చరికలు ఎంత సరైనవో ఈ పరిణామాలు కండ్లకు కట్టినట్టు చూపుతున్నాయి.
సంఫ్‌ుపరివార్ ప్రతిరాష్ట్రంలో కొన్ని నిర్దిష్ట ప్రాంతాలను ఎంచుకుంటుంది. ఆ ఎంచుకునే ముందు ఆ ప్రాంత భౌగోళిక, రాజకీయ విషయాలనే గాక అక్కడున్న కులాలు, ఉప కులాలు, వాటి మధ్యనున్న సామాజిక వైరుధ్యాలు, వాటి చరిత్ర వంటి ఎన్నో విషయాల్ని అధ్యయనం చేస్తుంది. అక్కడ జరిగే ఉద్యమాలు, వాటిలో వామపక్షాల పాత్ర వంటివి కూడా అధ్యయనం చేస్తుంది. మందిరాలు, మసీదులు, చర్చీలు వాటి మధ్యనున్న వైషమ్యాలు, వాటి చరిత్రలు అధ్యయనం చేస్తారు. ఈ అన్ని విషయాల్ని తమ అబద్ధాల ఫ్యాక్టరీలో వేసి వండి, వారుస్తారు. దాన్ని తిన్న జనం టపా కట్టకముందే వారిని మేల్కొల్పాలి.