Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పైపై మెరుగులు కల్ల సుమా.. లోపలిదంతా డొల్ల సుమా, నిజం తెలియమని నేనంటాను.. లేదా కొంపే గుల్ల సుమా...' ప్రజాకవి కాళోజీ చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ నగ సత్యాలను మనం మననం చేసుకుంటే గత పద్దుల్లోని లోపాలు, లొసుగులను సవరించుకుని ముందుకెళ్లటానికి అవకాశముంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం (కార్యక్రమాలు, గణాంకాల శాఖ) విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో తెలంగాణ... దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు (19.46 శాతం)ను నమోదు చేసింది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,78,833గా నమోదైంది. ఇటీవల రాష్ట్ర ప్రణాళిక, అర్థగణాంక శాఖ విడుదల చేసిన 'స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్...'లోనూ అభివృద్ధే తమ అజెండా అంటూ ప్రభుత్వం చెప్పు కొచ్చింది. విద్యా, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వెల్లడించింది. ఈ అంకెలు, సంఖ్యలు, గణాంకాలను చూపుతూ ప్రభుత్వ పెద్దలు, విత్త మంత్రివర్యులు, అధికార పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు... 'చూడు చూడు మా పనితీరు, పథకాల అమలు తీరు అదరహో...' అంటూ జబ్బలు చరుచుకున్నారు. వారు అలా చరుచుకోవటాన్ని మనమెవరమూ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి వారి జబ్బలు కాబట్టి. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటమే ఇక్కడ ఆందోళనకరమైన అంశం. జీడీపీ, జీఎస్డీపీ లెక్కలు చూసి మనం మురిసిపోతే, అది రాష్ట్రానికి నష్టం చేసినట్టే.. ప్రజలను మభ్యపెట్టినట్టే. వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్ల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఆ సందర్భంగా ఇటు ఉద్యమకారులు, అటు ప్రజలు అనేక కలలుగన్నారు. తమ ఆశలు నెరవేరుతాయని ఆకాంక్షించారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు వివిధ ప్రాధాన్యత, కీలక రంగాలకు కేటాయింపులు ఘనంగా ఉంటున్నా.. వాటి ఖర్చులో మాత్రం ఆ ఘనత కానరావటం లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని బడ్జెట్లనూ పరిశీలిస్తే ఇదే విషయం సుస్పష్టమవుతున్నది. ఒక సంవత్సరం మన అంచనాలు, వాస్తవాలను పరిశీలించిన తర్వాతైనా కండ్లు తెరిచారా..? అంటే అదీ లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 దాకా అన్ని బడ్జెట్లు కలిపి మొత్తం రూ.10,85,435 కోట్లతో పద్దులను ప్రవేశపెడితే (కేటాయింపులు) అందులో రూ.6,83,619 కోట్లే ఖజానాకు చేరాయి. అంటే వాస్తవాలను విస్మరించి ప్రతీయేటా బడ్జెట్లను పెంచుకుంటూ పోవటంతో ప్రభుత్వం వేసుకున్న అంచనాల్లో రూ.2,18,917 కోట్ల ఆదాయం అసలు రానే రాలేదన్నమాట. ఈ ప్రభావం రాజకీయంగా అంతగా ప్రభావం చూపలేని సంక్షేమ పథకాల లబ్దిదారుల మీద విపరీతంగా పడింది. ఫలితంగా దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, ఆసరా పెన్షన్‌దారులు, వికలాంగులు, మహిళలు, వృద్ధులు, మైనారిటీలకు కేటాయించిన నిధుల ఖర్చులో కోతలు పడ్డాయి. మరోవైపు జీఎస్డీపీలో కీలక పాత్ర పోషించే వ్యవసాయానికి కేటాయింపులను బాగానే చూపిస్తున్నా... ఆ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన మీద ప్రభుత్వం దృష్టి సారించటం లేదు. దీంతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోస్టుల భర్తీ లేదు. భూసార పరీక్షల్లేవు. కొత్త వంగడాలపై పరిశోధనల్లేవు. యాంత్రీకరణ ఊసే లేదు. ఈ కోణంలో చూసినప్పుడు రైతు బంధు, బీమా అనేవి అన్నదాతకు ఎంతోకొంత భరోసానిస్తున్నా... అవే సర్వరోగ నివారిణి జిందాతిలస్మాత్ కాదనేది వాస్తవం. విద్యారంగాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే... 'గురుకులాలు' తప్ప వేరే ఏ ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలపైనా సర్కారుకు శ్రద్ధ లేనట్టు కనబడుతున్నది. వాటిలో కూడా గేటు వాచ్మెన్ దగ్గర్నుంచి ప్రిన్సిపాల్ దాకా అందరూ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందే. రాష్ట్రంలో 21,500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బడుల పనితీరును పర్యవేక్షించే ఎమ్ఈవోలు, డీఈవోల పోస్టుల్లో అత్యధికం ఖాళీలే. ఇవి చాలవన్నట్టు ప్రయివేటు యూనివర్శిటీలకు తలుపులు బార్లా తెరిచారు. ఇది భవిష్యత్తుకు నష్టదాయకం, ప్రమాదకరమైన నూతన విద్యా విధానాన్ని తిరస్కరించాలన్న సోయి కూడా టీఆర్ఎస్ సర్కారుకు లేదు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యరంగం ప్రాధాన్యతను ప్రపంచం మొత్తం గుర్తించింది. ఇదే కోవలో మన దగ్గర బస్తీ దవాఖానాలు, నూతన మెడికల్ కాలేజీలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఆస్పత్రి భవనాలు ఉంటాయి, కానీ అందులో సిబ్బంది, మందులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండని ఒక విచిత్రకరమైన పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఖజానాకు నానాటికీ ఆదాయం పెరుగుతున్నది, శాఖలకు కేటాయింపులు పెరుగుతున్నాయని చెబుతున్న ప్రభుత్వాధినేతలు... ధనిక రాష్ట్రంలో వివిధ ప్రాధాన్యతా అంశాలకు ముఖ్యంగా... ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, కేసీఆర్ కిట్, విద్యార్థుల మెస్ బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులకు నిధులు సకాలంలో ఎందుకు విడుదల చేయలేకపోతున్నారో..? బకాయిలు ఎందుకు పేరుకుపోతున్నాయో చెప్పటానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఈసారైనా తెలంగాణ పద్దు ఈలోపాలను సవరించుకుని సరికొత్త పొద్దు పొడుపుతో ముందుకొస్తుందని ఆశిద్దాం.