Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్యసమితిలోని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపిసిసి) తాజాగా ప్రకటించిన వాతావరణ మార్పుల ప్రభావ నివేదిక భూగోళానికి ముంచుకొస్తున్న ముప్పును మన కండ్ల ముందుంచింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం పరిస్థితి ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరింది. ఇప్పటి వరకు పర్యావరణాన్ని కాపాడుతున్న అనేక వ్యవస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు భూగోళం మీది సమస్త ప్రాణికోటికి మరణశాసనం రాస్తున్నాయి. చిన్న మొక్కలు, సముద్రపు నాచు వంటివి కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. పెరిగే సముద్ర మట్టాలు, మునిగే ప్రాంతాలు, భగ్గుమనే ఎండలు, కరువు రక్కసి కరాళ నృత్యాలు, ఎండే పొలాలు, రాలే ప్రాణులు ఇలా చెప్పు కుంటూ పోతే ప్రకృతి బీభత్సాలు ఎన్నో! దేశాలు, ప్రాంతాలు, నగరాల వారీగా భవిష్యత్ భయానక దృశ్యాలను ఈ నివేదిక కండ్ల ముందు పెట్టింది.
మన దేశంలో హిమాలయాలతో పాటు, సముద్రతీర ప్రాంతాల్లో చోటుచేసుకునే పెను విపత్తులను వివరించింది. ఈ నివేదిక వెలువడిన రెండు రోజుల్లోనే హైదరాబాద్లోని వాతావరణశాఖ ఈ ఏడాది వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో 47 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటూ ప్రమాద ఘంటికను మోగించింది. ఇప్పటికే అతి తక్కువ రోజుల్లో నమోదవుతున్న భారీ వర్షాలు సృష్టిస్తున్న విలయాలను కండ్లారా చూస్తున్నాం! భవిష్యత్లో ఈ తరహా 'అతి' కష్టాలు అత్యంత సాధారణం కానున్నాయి. అందుకే, ఇప్పటికైనా మానవాళి తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో పతనం తప్పదని ఐపిసిసి హెచ్చరించింది.
భూతల ఉష్ణోగ్రత పెరుగుదల 1.5డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా మించకుండా చూడాలని పారిస్లో జరిగిన వాతావరణ సదస్సులో చేసుకున్న నిర్ణయం అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే సగటున 1.1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిం దన్నది తాజా అంచనా! 2030 నాటికి కర్బన ఉద్గారాల స్థాయిని 50శాతం తగ్గించాల్సి ఉండగా, మరో 16శాతం పెరుగుతుందన్నది తాజా నిర్థారణ. అంటే మానవాళి ప్రయాణం ఎటో అర్థం కావడం లేదూ! పారిశ్రామిక విప్లవ ఫలాలను అందిపుచ్చుకున్న అనేక దేశాలు వనరుల దోపిడీని ఇష్టారాజ్యంగా చేసి భూగోళాన్ని ఎప్పుడో టైమ్బాంబ్గా మార్చేశాయి. తక్షణం స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఏ నిమిషంలోనైనా ఆ టైమ్బాంబు పేలవచ్చని ఇప్పుడు వివిధ సంస్థలు చేస్తున్న హెచ్చరికలను ఆ దేశాలు ఇప్పుడు బేఖాతరు చేస్తున్నాయి. మానవజాతి ఉనికిని ప్రమాదంలోకి నెట్టాయి. ప్రమాదాన్ని నివారించడానికి బదులు వక్రభాష్యం చెబుతన్నాయి.
విధ్వంసంలో ఏ దేశం పాత్ర ఎంత ఉన్నా, పర్యావరణ రక్షణకు మాత్రం అన్ని దేశాలకూ సమాన బాధ్యత ఉందని, బడుగు దేశాలు కూడా తమతో సమానంగా నిధులు ఖర్చు చేయాలంటున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని, తమ వంతు బాధ్యతగా చేతనైనంత చేస్తామని, అంత ఖర్చును తమ నెత్తిపై రుద్దడం న్యాయం కాదని వర్థమాన దేశాలు మొత్తుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సహాయక చర్యల కోసమంటూ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన 10వేల కోట్ల డాలర్ల వార్షిక సహాయ నిధినీ మూడేండ్లుగా వాయిదా వేస్తున్నారు. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధన నీరుగారుతోంది.
పర్యావరణ విధ్వంసం యథాలాపంగా జరిగిందేమి కాదు. సొంత లాభం కోసం సర్వాన్ని కబళించే కార్పొరేట్లు చేసే విధ్వంసంతో పోల్చితే, సామాన్యుడు చేసే నష్టం నామమాత్రం. పెట్టుబడి దారి దోపిడీలో భాగంగానే ప్రకృతి వనరులను నాశనం చేశారు. మనిషి శ్రమశక్తిని దోచినట్టే ప్రకృతిని కూడా అడ్డగోలుగా దోచి కార్పొరేట్లు ప్రపంచ మంతా తెగబలిశారు. ఆ లాభాల వేటలో భాగంగానే విధ్వంసం ముంచుకొస్తోందని తెలిసినా పరిరక్షణ చర్యలకు మోకాలడ్డుతున్నారు. మరోవైపు పేద దేశాల్లోని కోట్లాది మంది ప్రజలు వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే మనుగడ సమస్యను ఎదుర్కుంటున్నారు. గిరిపుత్రులకు అటవీ హక్కులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న మోడీ ప్రభుత్వం అదే సమయంలో చట్టంలో మార్పులు చేసి మరీ కీలకమైన అటవీ ప్రాంతాలను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి చట్ట సవరణ చేయడం గమనార్హం. ఇప్పుడు సముద్ర తీరాలను సైతం కార్పొరేట్లకు కట్టబెడుతోందీ ప్రభుత్వం. ప్రకృతిని కాపాడే పోరాటంలో మనమందరమూ భాగస్వాములు కావడం ద్వారానే భూమిని, భూగోళం మీది సకల ప్రాణికోటిని రక్షించుకోగలం.