Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.4శాతానికి పడిపోవడం భారత ఆర్థికవ్యవస్థ మాంద్యంలోనే కొట్టుమిట్టాడు తోందని స్పష్టం చేస్తోంది. అంతకుముందు త్రైమాసికం (8.5శాతం)తో పోల్చితే వృద్ధి 3.1శాతం తగ్గింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9.2 శాతంగా ఉంటుందని జనవరిలో వేసిన అంచనాలను సవరించి 8.9శాతానికి ఎన్ఎస్ఓ కుదించింది. అది కూడా చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.1శాతం నమోదు చేస్తేనే సాధ్యమవుతుంది. కోవిడ్ మహమ్మారి మూడవ వేవ్ సమసిపోతున్నది కాబట్టి రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు పరుగులు తీస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్న దానికి ఆర్థిక వ్యవస్థ వాస్తవిక పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ఆర్థిక మాంద్యం కోవిడ్ మహమ్మారి తలెత్తడానికి ముందు నుంచే ఉంది. 2019 రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5శాతానికి పడిపోయింది. కోవిడ్ దీనిని మరింత తీవ్రతరం చేసింది. ఇది వ్యవస్థాగతంగా ఏర్పడిన సంక్షోభం, కోవిడ్ సమసిపోయినా, ఆర్థిక వృద్ధిరేటు 2019 నాటి ముందు స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ప్రభాత్ పట్నాయక్ వంటి ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వృద్ధిరేటు పడిపోవడానికి అంగడిలో సరుకులకు గిరాకీ తగ్గడమే అసలు కారణం. దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలను మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో మరింత ఉధృతం చేసింది.
సంక్షేమ రంగానికి కోతలు పెట్టడం, పెట్రో ధరల మోత మోగించడం వంటి చర్యలు దేశంలో ధరల పెరుగుదలకు, అంతులేని నిరుద్యోగానికి, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరగడానికి దారితీశాయి. నిజ ఆదాయాలు పడిపోయి ప్రజల వద్ద కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 116 దేశాల్లో 101వ స్థానంలో ఉంది. దేశంలో మూడింట రెండొంతుల మంది పేదరికంలో మగ్గుతున్నారు. 2021 నవంబరు ఒక్క మాసంలోనే 68లక్షల మంది వేతన జీవులు ఉద్యోగాలు కోల్పోయారు. పట్టణ ప్రాంతాల యువతలో నాల్గోవంతు మంది నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబ వినిమయ వ్యయం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా డిమాండ్ పడిపోయి పారిశ్రామిక, సేవల రంగాలు సంక్షోభంలో పడ్డాయి. ఉత్పత్తిని తగ్గించుకోవడం, సిబ్బందిని కుదించడం, వేతనాల్లో కోత సర్వసాధారణమయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉపాధి కల్పన, సంక్షేమ రంగానికి నిధులు పెంచడం ప్రభుత్వ బాధ్యత. కానీ, మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఉపాధిహామీకి 25వేల కోట్ల నిధులు కోత పెట్టింది. పెట్రోఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు విధిస్తూ ప్రజలపై ఎనలేని భారాలను మోపుతున్నది. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర వంద డాలర్లు దాటింది. రష్యా, ఉక్రెయిన్ ఘర్షణలు కొనసాగితే ఆ పేరుతో చమురు ధరలు ఆకాశాన్నంటే ప్రమాదముంది. దీని ప్రభావం వల్ల దేశంలో పెట్రోధరలు మరింతగా పెరుగుతాయి. ఇది నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు, రవాణా ఖర్చులు పెరగడానికి దారి తీస్తుంది.
ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తుంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న మధ్య తరహా పరిశ్రమలను నిర్లక్ష్యం చేస్తున్నది. అదే సమయంలో బడా పారిశ్రామికవేత్తలకు, విదేశీ పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల పన్నుల రాయితీలు ఇస్తున్నది. మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలను తిప్పికొట్టడమొక్కటే మార్గం. ఈ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సాగాలి. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న దేశవ్యాపిత సమ్మె అందులో భాగమే.