Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కలిగిన మనుజుండు కాముండు సోముండు
మిగుల తేజమునకు మెరయుచుండు
విత్తహీనుడెంత రిత్తయైపోవును' అని వేమన విత్తము గల అధిపతుల గురించి చెబుతూనే, అవిలేని వారి స్థితి ఎలా ఉంటుందో వివరించారు. అవును మిలియనీర్లు, బిలియనీర్లు ఎందరుంటే అంత ఖ్యాతి వెలుగుతుంటది. వాళ్లు ఎందరు పెరిగితే అంత పేరుగొప్ప మన ఏలినోళ్ళకి. ఆస్తిపరులు యేటికేడు పెరుగుతున్నరంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ వరుసలోకి మనమూ చేరిపోతామనే భ్రమాత్మక ఊహలు మన మధ్యతరగతికీ ఉండనే ఉంటాయి. వాళ్లలా కలల్లోనే చివరికంటా ఉండటమే కాక ఒక మెట్టు దిగజారుతున్న చిత్రం చూస్తే చేదుగుళిక మింగినట్టుంటుంది. అయినా మన దేశంలో కుబేరులు పెరిగితే దేశ సంపద పెరిగినట్టే కదా! ఆస్తిపరుల గౌరవమే దేశ గౌరవంగా చెప్పబడుతున్న కాలంలో ఉన్నాం!
ఈ మధ్య ప్రాపర్టీ కన్సలెటెంట్ నైట్ ఫ్రాంక్ వాళ్లు ఇండియా వెల్త్ రిపోర్ట్-2022 విడుదల చేసింది. అందులో మన హైదరాబాద్లో అపర కుబేరులు పెరిగి పెరిగి ఏకంగా దేశంలోనే ముంబాయి తర్వాత రెండో స్థానంలోకి ఎగబాకిందని వెల్లడించారు. దీనికి వాళ్లు తీసుకున్న కొలతేమిటంటే 226 కోట్ల ఆస్తి, అంతకు పైగా ఉన్నవాళ్లను లెక్కిస్తే మన హైదరాబాద్లో 467మంది తేలారట. ఇక ముంబయిలో అయితే 1,590మంది ఉన్నారట! ప్రపంచ వ్యాపితంగానూ ఈ కుబేరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అది మరీ ఈ కరోనా మూడేళ్ళకాలంలో పెరగటం మనం గమనించాల్సిన విషయం. మన రాష్ట్ర ప్రభుత్వాధినేత ఈ లెక్కలు చూసి ఒకింత గర్వపూరితమైన సంతోషాన్ని పొందుతూ ఉండవచ్చు. ఉండవచ్చేమిటి! తెలంగాణలో భూముల ధరలు పెరగటమే తాము సాధించిన ఘనత అని, తమవల్లనే పెరిగి పెరిగి ధనభూమిగా మారిందని ప్రకటించడం మనం చూసే ఉన్నాము. ఇప్పుడు భాగ్యనగరంలో పేదల మాట అటుంచి మధ్య తరగతిలో ఎవరూ కూడా గూటి కోసం రవ్వంత స్థలం కొనుక్కోలేని స్థితికి నెట్టబడ్డారు. భూమి ఉన్నవాళ్ళకు, భూమిని తమ సొంతం చేసుకున్న వాళ్ళకు ధనం గరిసెలు నిండుతున్నవన్నమాట నిజం. అవి ఏరకమైన ఉత్పత్తిని పెంచని ఉపాధిని ఇవ్వని పెరుగుదలలు. ఈ పెరిగిన కుబేరులు ఎక్కువగా రియల్ఎస్టేట్ ఆదాయగాండ్లే కావటం గుర్తుంచుకోవాల్సిన అంశం.
ఇక ధనవంతుల జాబితా పెరిగిందంటే దానర్థం దోపిడీ చేసే వారి సంఖ్య పెరిగిందని, ఆదాయాలు కోల్పోతున్న వారు పెరిగారని, దారిద్య్రం పెరిగిందని, ఈ విషయాల గణాంకాలు స్పష్టంగానే వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తంగా దేశంలో నిరుద్యోగరేటు 8.1శాతంగా నమోదైందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సి.ఎం.ఐ.ఇ.) తాజాగా తెలిపింది. అంతేకాదు దేశంలో ఆకలితో బాధపడుతున్న ప్రజలూ పెరిగారని ఆక్స్ఫామ్ నివేదికలు తెలియచేస్తున్నాయి. ఈ కరోనా ఉపద్రవ కాలంలో అనేక పరిశ్రమలు మూతపడి శ్రామికులు ఉపాధి కోల్పోయారు. దేశంలోని ప్రతి కుటుంబం తమ ఆదాయాన్ని సరాసరి పన్నెండు శాతం కోల్పోయింది. 21కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. ఇక ఇదే సందర్భంలో దేశంలోని మహిళలు ఒక్క 2021లోనే రెండు కోట్ల 20లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. కోట్లాది మంది కార్మికులకు చట్టప్రకారం అందాల్సిన కనీస వేతనాలు అందటం లేదు. కొత్తగా పట్టణ ప్రాంతాలలో ఉన్నత చదువులు పూర్తిచేసుకుని, నైపుణ్యాలు సంపాదించిన యువత నిరుద్యోగ సైన్యంలో చేరుతోంది. ఇక ఇదే సమయంలో గ్రామీణ ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉపాధి హామీ పనులకు నిధుల కేటాయింపులు తగ్గించేశారు. కానీ కార్పొరేట్లకు, బడా వ్యాపార వర్గాలకు పన్నుల్లో మినహాయింపునిచ్చారు. లక్షల కోట్లు సబ్సిడీ రూపంలో దోచిపెట్టారు. అంతే కాదు కారుచౌకగా దేశ శ్రామికులు తమ చెమటతో నిర్మించిన, పోగేసిన ప్రభుత్వ సంపదను, సంస్థలను కుబేరులకు కట్టబెట్టారు. అందుకే మరి ఒకవైపు పేదరికం, ఆకలి, నిరుద్యోగం పెరిగితే, మరోవైపు కుబేరుల సంఖ్యా పెరిగింది. ఇటు కోట్లాది మంది ప్రజల ఆకలి పేదరికాలు. అటు వేళ్లపై లెక్కించగల సంఖ్యలో సంపన్నుల పెరుగుదల. ఇదీ దేశపు అంతరాల ముఖచిత్రం.
ఈ కుబేరుల ధానాగారాల పెరుగుదలల కారణాలుగా ఎన్ని ఆకలి కేకల ధ్వనులు ఉన్నాయో! ఎన్ని కోట్ల జనుల దీనఘోషలు దాగున్నాయో! చూడగలిగే చూపులు కావాలి. వినగలిగే మనసులూ కావాలి. కానీ ఏలికలకు ఇవేమీ కనపడకపోగా సంపద సృష్టికర్తలు సంపన్నులేనని, వారివల్లే దేశం వెలిగిపోతోందని ఎంతో సంతోషంగా ప్రకటిస్తుంటారు. అది వారి సహజ లక్షణం. ఎందుకంటే వారు పనిచేస్తున్నది, పదవిలోకి వచ్చిందీ వారికి సేవ చేయటానికే అనే సంగతి మనకు తెలిసిరావాలి. సమస్త సంపదనూ, ఆస్తులను సృష్టిస్తున్నది శ్రామికుల చేతులేననే వాస్తవాన్ని గ్రహించాలి. శ్రామిక చేతులకు దక్కాల్సిన ఫలాలను లాగేసుకుని, పోగేసుకున్న పర్యవసానంగానే ఈ కుబేరుల జాబితా పెరుగుతోందనే సత్యం మనకు అర్థం కావాలి.