Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సర్వదేవతలను సర్వ మతాలను/ సమముగా నెఱుంగు సజ్జనుండు/ దుర్జనుండు లాతి దోషమ్ములను నెంచు'... సజ్జనుడైన వాడు సర్వదేవతలను సర్వమతాలను సమంగా ప్రేమిస్తాడు. దుర్జనుడు ఎదుటి మతంలోని దోషాలనెంచుతాడని చెపుతూ... 'సర్వమతములందు సారమ్ము గ్రహియించి/ ఐకమత్యమార్గ మనుసరించి/ క్రించుదనము మాని ప్రేమించుకొన మేలు' అంటారు పోతులూరి వీరబ్రహ్మం. అంటే, అన్ని మతాల్లోని సారాంశం ఒక్కటేనని, ఐకమత్యంతో వక్రబుద్ధి లేకుండా ఒకరికొకరు ప్రేమతో కలిసి మెలగుటే ఉత్తమమని స్పష్టం చేశారు. 'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె/ నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే/ అండనే బంటు నిద్రదియు నొకటే/ మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే/ ఛండాలుడుండేటి సరిభూమి యొకటే' అంటాడు అన్నమయ్య. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజల జీవన విధానంలో ప్రతిబింబించే సోదరత్వమే ప్రజాస్వామ్యం అంటారు అంబేద్కర్. మతతత్వం ఒక మాయాహస్తం. ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి ఆ హస్తమెప్పుడూ మతాన్ని చూపిస్తుంది. వాస్తవానికి అందులో మతం ఉండదు.
భారత రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛను, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కును ఇచ్చింది. స్వేచ్ఛ అంటేనే ప్రజాస్వామ్యం. మెజారిటీ నిర్ణయం అంటే ప్రజాస్వామ్యమే. కానీ, బీజేపీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. మెజారిటీ ప్రజల మత స్వేచ్ఛకు, భక్తిభావానికి ఆటంకం కల్పిస్తోంది. మేము మెజారిటీ కాబట్టి మేము చెప్పిందే రాజ్యాంగం అంటోంది. మదర్సాలు, క్రిస్టియన్ విద్యాసంస్థలు ఉండటానికి వీల్లేదంటూనే, మేము మాత్రం వేదపాఠశాలలు నడుపుతాం అంటూ బుకాయిస్తోంది. ఇలాంటప్పుడు ఇంకా మత స్వేచ్ఛ ఎక్కడుంది? ఇక్కడ ప్రజాస్వామ్యానికి, మతస్వేచ్ఛకు మధ్య తగువు పెడుతోంది ఆర్ఎస్ఎస్. అసలు హిందువుల్లోనే మెజారిటీ ప్రజలకు స్వేచ్ఛ ఉందా? అనేదికూడా పెద్ద ప్రశ్న. పౌరోహిత్యం చేయగల హక్కు, దేవాలయాల్లో ప్రవేశించే హక్కు అన్ని కులాల వారికీ ఉందా? చివరకు దైవ దర్శనంలో కూడా సమానత్వం లేదే? సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనం, విఐపి దర్శనం అంటూ రకరకాల దర్శనాలు ఎవరి కోసం? పెద్ద కులాలైతేనో, ఎక్కువ డబ్బుంటేనో ప్రత్యేక దర్శనాలు, తక్కువ కులాలు, పేదలకు మాత్రం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడే సాధారణ దర్శనం. 'కలవారినేగాని కరుణించలేడా/ నిరుపేద మొరలేవి వినపించుకోడా/ కన్నీటి బతుకుల కనలేనినాడు/ స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా' అంటాడో సినీ రచయిత. మరి ఇదెక్కడి సమానత్వం? ఇదెక్కడి స్వేచ్ఛ? ఇక మైనారిటీలకైతే... వారి మత సంప్రదాయాలను పాటించే హక్కు లేదు. హిజాబ్ వేసుకునే హక్కు లేదు. చివరికి వారి తిండి విషయంలోనూ ఆంక్షలే. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇంకెక్కడి మతస్వేచ్ఛ? మెజారిటీయిజం పేరుతో దేశంలోని ఇతరుల మత స్వేచ్ఛను అడ్డుకోవడం... నిరంకుశ ఆధిపత్య ధోరణి తప్ప మరొకటికాదు.
దీనికి భిన్నంగా గతంలో భక్తి ఉద్యమాలు నడిచాయి. రామానుజాచార్యుడు జనాలకు నారాయణ మంత్రోపాసన చేశాడు. 'మతము లెన్నియైన సతములు కావవి/ సతము కర్మమగును జగతి యందు/ అన్ని మతములందు నరయ నొక్కటి లేదు'- కర్మమే స్థిరమైనది కాని మతం స్థిరం కాదు. మానవత్వమే పరమావధి. ఏ మతానికీ కట్టుబాట్లు లేవంటూ మత ప్రాధాన్యాన్ని నిరసించారు వేమన. నాటి వర్ణ వివక్ష పూరిత, పురుషాధిక్య సమాజంలో శూద్రులనూ, స్త్రీలనూ దేవుడికి దూరంగా ఉంచారు. ఈ వివక్షనూ, అణచివేతనూ అది సవాలు చేసి, తిరుగుబాటు చేసింది. కాబట్టి దేవునిమీద భక్తి ఉంటే చాలదు. భక్తి, ఆరాధన కొనసాగించే హక్కు కోసం కూడా పోరాటం చేయాలన్నమాట. కష్టాలొస్తే పోరాటాలెందుకు... దేవుడ్ని తలుచుకో అంటారు. దేవుడ్ని తలుచుకోడానికే కాదు చూడటానికి కూడా పోరాటం చెయ్యాల్సి వస్తోంది. ఆ పోరాటమేదో కూడు కోసం, గూడు కోసం కష్టాలను తొలగించుకోడం కోసం చెయ్యడం ఉత్తమం కదా! అసలు పోరాటం కన్నా పెద్ద దేవుడు లేడు. ఇప్పుడు పోరాటమే దేవుడు. ఆ పోరాటమే నీ స్వేచ్ఛను కాపాడుతుంది.