Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత...' సూపర్ స్టార్ రజనీకాంత్ బాషా సినిమాలో చెప్పిన పవర్ఫుల్ సంభాషణ ఇది. మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లెక్కలేసేటప్పుడు ఆ సినిమాను చూసినట్టున్నారు. అందుకే కాబోలు గోరంత ఆదాయముంటే... దాన్ని కొండంతలుగా చూపించి, ఆ మేరకు వివిధ రంగాలకు భారీ కేటాయింపులేశారు. తద్వారా తమ అనుయాయులతో అధినేత ఫొటోలకు పాలాభిషేకాలు చేయించుకున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులెక్కడి నుంచి వస్తాయనే దానికి 'వస్తాయనేది మా అంచనా...' అంటూ జవాబు దాటేయటం వారికి పరిపాటిగా మారింది. అలాంటప్పుడు 'ఆదాయం రాకపోతే...' అనే ప్రశ్న మనం వేసినా అది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోక తప్పదు. వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్లైన్లతో తెలంగాణ మలిదశ ఉద్యమం కొనసాగింది. ఇప్పుడు మనం వార్షిక బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం గనుక మిగతా రెండింటిని పక్కనబెట్టి... నిధుల గురించే ప్రస్తావించుకుంటే అనేక వాస్తవాలు ఇక్కడ తేటతెల్లమవుతాయి. ఏ ప్రభుత్వానికైనా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే... అందరూ ఠక్కున చెప్పే జవాబు పన్నుల నుంచి అని. ఇది కాకుండా పన్నేతర ఆదాయ మార్గాల ద్వారా కూడా కొంత ఆదాయం ఖజానాకు చేరుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, ఆర్థిక సాయాలు వీటికి అదనం. వీటన్నింటి ఆధారంగానే ప్రభుత్వం రూపాయి రాక, రూపాయి పోకపై మదింపు చేసి... పద్దును రూపొందిస్తుంది. కానీ ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ మదింపును, అందులోంచి వచ్చే వాస్తవాలను పక్కనబెట్టి... గప్పాలు, గొప్పలకు పోతున్నదనటంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడేండ్ల లెక్కలను పరిశీలిస్తే ఇదే విషయం సుస్పష్టమవుతున్నది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి విత్త మంత్రి తన్నీరు హరీశ్‌రావు రూ.2,56,958 కోట్లతో భారీ పద్దును ప్రవేశపెట్టారు. ఇందులో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.93 వేల కోట్ల నుంచి రూ.1.08 లక్షల కోట్లకు పెంచి చూపించారు. అంటే జనంపై భారాలు వేస్తామంటూ చెప్పకనే చెప్పారన్నమాట. ఇదే సమయంలో రాష్ట్రాల హక్కుల్ని హరించి వేస్తున్న మోడీ సర్కారు... వాటికి నిధులివ్వకుండా నీరుగారుస్తుందనే చేదు నిజం తెలిసినప్పటికీ కేంద్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇంత పెద్ద పద్దులో ప్రత్యేక ప్యాకేజీ కింద తెలంగాణకు రూ.25 వేల కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.18 వేల కోట్లు, కేంద్ర అమ్మకపు పన్నుల్లో వచ్చిన తేడాను భర్తీ చేసేందుకు అక్కడి నుంచి మనకు సుమారు రూ.3 వేల కోట్లు వస్తాయంటూ అంచనా వేసుకున్నారు. ఆ మేరకు లెక్కలు పెంచి చూపించారు. తద్వారా జనానికి లేనిపోని ఆశలు పెంచారు. మరి ఈ నిధులన్నీ వస్తాయా..? రాకపోతే ఆ మేరకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎలా అమలు చేస్తారనేది వేచి చూడాలి.
మరోవైపు తెలంగాణ వచ్చిన కొత్తలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్ రూం ఇండ్లు తదితరాంశాల ఊసే బడ్జెట్లో లేకపోవటం గమనార్హం. భూ పంపిణీ ఒక నిరంతర ప్రక్రియ, అందువల్ల అది కొనసా... గుతూనే ఉంటుందంటూ గతంలో చెప్పిన ప్రభుత్వ పెద్దలు, అందుకనుగుణంగానే పద్దులో దానిపై శీతకన్నేశారు. దీంతోపాటు 'జాగా ఉన్నోడు ఇల్లు కట్టుకుంటే మూడు లక్షలిస్తాం...' అంటూ చెప్పటం ద్వారా 'డబుల్ బెడ్ రూం' ప్రాధాన్యతను తగ్గిస్తున్నామంటూ చెప్పకనే చెప్పారు. గతంలో రైతులందరికీ కావాల్సిన ఎరువులన్నింటినీ ఉచితంగా ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ... బడ్జెట్లో సంబంధిత పదాలే లేకపోవటం విస్మయపరిచే అంశం.
ఇక వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే పథకాలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు తదితరాంశాలను ప్రభుత్వం తన పద్దులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీటితోపాటు రైతు బంధు, రైతు బీమా, నేతన్నలకు చేయూతకు కూడా పెద్ద పీట వేసింది. ఇదే సమయంలో వ్యవస్థీకృత అంశాలను మాత్రం విస్మరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ప్రతీ ఊరికి బస్సు సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, పాఠశాలల పటిష్టత మొదలైన వాటిని పట్టించుకున్న దాఖలాల్లేవు. వీటిలో విద్యా రంగానికి సంబంధించి ఇటీవల ప్రముఖంగా చెప్పుకుంటున్న 'మన ఊరు-మన బడి' కార్యక్రమం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. దీంతోపాటు కనీస వేతనాల్లేక అల్లాడుతున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ గురించి పద్దులో నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రిం చేందుకు ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పనేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సర్కారు వారు వేసుకున్న లెక్కల్లో బొక్కలనేకం. ఏ రకంగా చూసినా విత్త మంత్రి ప్రతిపాదించిన పద్దు.. ఒకవైపు జనాన్ని మభ్యపెడుతూ, మరోవైపు వారిపై భారాలు వేసేందుకు రెడీగా ఉందనే విషయం విదితమవుతున్నది. అమాత్యవర్యులు తన ప్రసంగంలో తెలంగాణ కాళ్లల్లో కేంద్రం కట్టెలు పెడుతున్నదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నిజమే.. కానీ అదే సందర్భంలో భ్రమలు, భారాల ద్వారా అదే అమాత్యుడు, రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టారని చెప్పక తప్పదు. బడ్జెట్లో ప్రభుత్వ పెద్దలు పేర్కొన్న జీడీపీ, జీఎస్డీపీ, ద్రవ్యలోటు, రెవెన్యూ ఆదాయం, కేటాయింపులు తదితర సాంకేతిక అంశాలను, సంబంధిత పదాలను పక్కనబెట్టి... సామాన్యుడి కోణం లో ఆలోచిస్తే హరీశ్‌రావు గారి బడ్జెట్‌ను చూసిన వారెవరైనా... 'గొప్పలకు పోతున్నారు.. మున్ముందు తిప్పలు పడతారు...' అని హెచ్చరించక మానరు.