Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యావంతులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాల భర్తీపై రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఆహ్వానించాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న నిరుద్యోగులకు ఇది తీపి కబురే. అందుకనుగుణంగా సంబంధిత నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి సత్వరమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.
ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగినంత వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఈ వ్యవధి నిర్థిష్టంగా ఉండాలి. ఈ కారణాలతో జాప్యం జరగకుండా చూడాలి. భర్తీ ప్రక్రియలో న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్లు సమగ్రంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే టిఆర్టీ-2017 లాగా నియామకాలు మూడు, నాలుగేండ్లు ఆలస్యం అయ్యే ప్రమాదం లేకపోలేదు. కొలువుల కోసం ఎదురుచూసి చూసి తమకు ఏజ్ బార్ అవుతున్నదని ఆవేదన చెందుతున్న నిరుద్యోగులకు కూడా ఈ ప్రకటనతో ఊరట కలిగించారు. ఉద్యోగ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పెంచుతున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటి వరకూ ఉన్న అవరోధాలు, రాష్ట్రపతి ఉత్తర్వుల విడుదలలో జాప్యం, వాటిని తొలగించుకున్న తీరు తదితరాంశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరిస్తూ.. 95శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించామనిగుర్తుచేశారు. ఫలితంగా ఇప్పుడు అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం కొలువులు స్థానికులకే దక్కుతాయని తెలిపారు.
గత ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలోని యువత కండ్లుకాయలు కాసేట్లు ఎదురుచూస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొలువుల జాతర జరుగుతుందని ఎంతో ఉత్సాహంతో గత కొన్నేండ్లుగా కోచింగ్సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు సమర్పించుకున్నా నోటిఫికేషన్లు పడనందున కొంతమంది నిరాశతో ఆత్మహత్యలూ చేసుకున్నారు. తమ భవిత ఏమీకానుందోనని అనేక మంది నిరుద్యోగ యువత ఎంతో ఆందోళనతో నిరాశలోకి పోయారు. రాష్ట్రం ఏర్పడగానే ఇంటికో ఉద్యోగం అని ఆశలు పెంచి, అది ప్రవేటులో, ఔట్సోర్సింగ్ ఉపాధిని కూడా ఉద్యోగంగానే భావించాలని ఉద్బోధించారు. తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండవని ప్రగల్భాలు పలికిన నాయకుడు, అధికారంలోకి వచ్చాక ఖాళీ అయిన పోస్టులన్నింటినీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్లతో నింపారు. ఇక కనీసవేతనాలు కూడా పొందడంలేనివారిని గూర్చి కార్మిక సంఘాలు, సంస్థలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఇప్పటికయినా ఈ నిర్ణయం తీసుకుని ఉద్యోగాలు నింపటానికి పూనుకోవటం వెనకాల, ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత కారణమని తలచవచ్చు. అయినా ఇలా ముందుకురావటం మంచిదే.
కానీ రాష్ట్రంలో టి.ఎస్.పి.ఎస్.సి.పోర్టల్ ద్వారా 29 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. మరి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 91,142 ఉద్యోగాలు అందులో ఏ మూలకు వస్తాయి. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి వారికి ఊరట కల్గించాలి. పి.ఆర్.సి. కమిటి చెప్పినట్టు లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీలు ఒకేసారి భర్తీ చేయాలి. ప్రతి జిల్లాలో స్థానిక పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించే దశగా ప్రభుత్వం ఆలోచించాలి. 2020 డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ ''రాష్ట్రంలో 50వేల ఖాళీలు ఉన్నట్టు సమాచారం. వేల సంఖ్యలో టీచర్, పోలీస్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. వెంటనే ఖాళీలన్నీ గుర్తించండి. ఆ వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి'' అని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత దాని మీద హడావుడి చేయడం, ఏ ఎన్నికలు వచ్చినా ''త్వరలో జాబ్ నోటిఫికేషన్లు వస్తరు'' అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప భర్తీ చేసిన దాఖలాలు లేవు. అంతకు ముందు 80 వేల ఉద్యోగాలంటూ హడావిడి చేశారు. ఇలా ప్రభుత్వం కేవలం ప్రకటనలతో సరిపుచ్చుతుందే కాని కొలువులు కల్పించడం లేదనే నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలి. నిజానికి ప్రభుత్వ ప్రకటనలతో కోచింగ్ సెంటర్లకు గిరాకీ పెంచుకుంటున్నాయే తప్ప నిరుద్యోగులకు ఒరిగిందేమి లేదు. తాజా ప్రకటనైనా ఎన్నికల స్టంట్లా కాకుండా నిరుద్యోగుల ఆశలు తీర్చేదిగా ఉండాలి. అందుకు అనుగుణంగా అన్ని ఉద్యోగాలకు ఒకే సారి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.