Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివరికి పాలకపార్టీల 'పుణ్యాన' అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థాయి కూడా దిగజారిపోతోంది. బుద్ధుణ్ణి కూడా దశావతారాల్లో అంతర్భాగం చేసినాయన్న విషయం తెల్సిన వారికి ఇందులో పెద్ద వింత కనపడదు. తాజా 'మన్ కీ బాత్'లో ప్రధాని మోడీ 'భగవాన్' బిర్సాముండా అని దాదాపు డజనుసార్లు సంబోధించడం విన్నవారికి పిన్నవయసులోనే బ్రిటిష్ సామ్రాజ్య తుపాకీ గుళ్ళకు బలైన ఆదివాసీ సింహం 'భగవంతుళ్ల' లెక్కలోకి చేరనుందనే విషయం అర్థమవుతుంది. తన జీవిత ఆసాంతం కాంగ్రెస్ విధానాలపై పోరాడిన యోధుడు బి.ఆర్. అంబేద్కర్. ఆయన మరణానంతరం గ్రామ గ్రామాన విగ్రహాలు నిర్మించి తమలో కలిపేసుకోలేదా ఆ కాంగ్రెస్ పార్టీ. ఈ అన్ని అంశాలపై అవగాహనున్న వారికి మహిళా దినోత్సవం, అసలు శ్రామిక మహిళా దినోత్సవమని అర్థం అవుతుంది. 1857లో న్యూయార్క్ నగరంలోని టెక్స్టైల్ మిల్ మహిళా కార్మికులు తమ అమానవీయ పని పరిస్థితులపైనా, అతి తక్కువ వేతనాల పైనా, సుదీర్ఘ పని గంటలను భరించలేక సమ్మె చేసిన రోజే నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రేరణన్న విషయం అర్థమైతే నేడు పాలకులు దీన్ని 'కబ్జా' ఎందుకు చేశారో తేలిగ్గా అర్థం అవుతుంది. రష్యన్ విప్లవానికి నాంది మార్చి 8 కావటం కాకతాళీయం కాదు. విప్లవానంతరం లెనిన్ న్యూయార్క్ మహిళలు పెట్టుబడిపై గళమెత్తిన ఆ మార్చి 8నే అధికారయుతంగా మహిళా హక్కుల పరిరక్షణ దినంగా ప్రకటించారు. ఇవన్నీ అర్థమైన తర్వాత నేటి ''పట్టు చీరల'' వాళ్ళు జిగేల్ మనిపించే దృశ్యాలను తేలిగ్గానే అర్థం చేసుకోగలం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యత పెట్టుబడి దోపిడీపై మహిళలు పిడికిళ్ళెత్తిన రోజు. ఈ విషయాలన్నీ అణువంతైనా కనపడకుండా కప్పగలిగినంత మబ్బుతెర కప్పే ప్రయత్నంలో పాలకులున్నారు. ఆధునిక సినిమాలాగే ఇది ఒక ట్రెండింగ్. మార్కెట్ 'యుగం'లో ఉండి మహిళా దినోత్సవం కూడా 'సరుకై' పోయిందని వాపోయే వారి గురించి జాలిపడనక్కర్లేదు. మార్క్స్ ఉబుసుపోక తన 'క్యాపిటల్' గ్రంథాన్ని సరుకుతోనే ప్రారంభించాడా? పైగా పెట్టుబడిదారీ విధానం మనుషులకవసరమైన సరుకులే కాదు, సరుకులకవసరమైన మనుషుల్ని కూడా సృష్టిస్తుందని చెప్పింది ఎంత సత్యమో నేడు అవగతమవుతోంది కదా!
దేశంలో నేడు మహిళల పరిస్థితులు క్రమంగా దిగజారుతున్నాయన్న విషయం చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పాలకపార్టీలు 'కబ్జా' చేయడానికి గల కారణాలు మరింత తేలిగ్గా అవగతమవుతాయి. విద్యలోనూ, ఆరోగ్యంలోనూ మహిళల పరిస్థితి దిగజారుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం 6-59 నెలల మధ్యనున్న బాలికల్లో రక్తహీనత పెద్ద ఎత్తున పెరుగుతోంది. 15-49 సంవత్సరాల మధ్య వయసున్న గర్ణిణీ స్త్రీల్లో 52.2శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. కోవిడ్ సమయంలో ఆన్లైన్ విద్యవల్ల దేశంలో సుమారు కోటిమంది పిల్లలు మాధ్యమిక పాఠశాల విద్యనుండి వైతొలిగారని ఒక సంస్థ అధ్యయనం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల్లో అత్యధికం హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ప్యాకింగ్, టైక్స్‌టైల్ లాంటి పరిశ్రమల్లో కుప్పలు తెప్పలుగా మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు ఏ పరిశ్రమలో (సిఐటియు యూనియన్లు ఉన్న చోట మినహా) కనీస వేతనాలకే దిక్కులేదు. కొన్ని పారిశ్రామిక వాడల్లో ఒకేపని చేసే మహిళా కార్మికులకు ఆరు నుండి ఏడు వేలు నెలవారీ జీతముంటే, పురుషులకు 12-15వేల జీతముంది. మోడీ చట్టంలో మార్పులు చేయకముందే దాదాపు అత్యధిక ఫ్యాక్టరీల్లో 12గంటల పనిదినం అమలు చేస్తున్నారు. నగరంలోని అనేక బస్తీల్లో పొద్దున్నే బస్తాల చొప్పున పూలు ఇచ్చి, మధ్యాహ్నానికి అల్లిన దండలు తీసుకుని రూ.150 చేతిలో పెట్టే స్థితి ఉంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు అతి తక్కువ వేతనాలున్నాయి. కంటింజెన్ట్ సిబ్బంది అందరూ మహిళలే. వారికిచ్చే వేతనాలు ఏపాటి? పక్కరాష్ట్రంలో ఇచ్చినట్లు తమకీ ఫిక్స్డ్ వేతనం నెలకి పదివేలివ్వాలని ఆశా వర్కర్లు మొత్తుకుంటున్నా పట్టని ప్రభుత్వం మహిళా ఉద్ధారకుడిగా కేసీఆర్ ఫొటోలకు ఎన్ని లీటర్ల పాలతో అభిషేకాలు చేయించుకుంటే ఏం ఉపయోగం? కనీసం విడిగా వాష్‌రూమ్ సౌకర్యం కూడా కల్పించని యాజమాన్యాలు రాష్ట్ర రాజధాని చుట్టూనే ఎన్నో ఉన్నాయి. దాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ మత్తులో జోగుతోంది. కార్మిక మంత్రి, ఆయన మంత్రిత్వశాఖ సన్మానాలు చేయించుకుంటూ ఊరేగుతున్నారు. పెట్టుబడిదారీ విధానం ముదిరి పాకానపడుతోంది. ఆటవిక దోపిడీ పద్ధతులు అమల్లోకొచ్చాయి. వ్యవస్థను కాపాడుకోవాలంటే అణిచివేత చర్యలే చాలవు, ఎక్కడికక్కడ మరిపించి, మురిపించే ఎత్తుగడలు చేపడుతున్నారు. దానిలో భాగమే మహిళా'శక్తి'కి కళ్ళెం వేసేప్రయత్నం! స్త్రీ చైతన్యం పొందితే భర్తని, పిల్లల్ని, కుటుంబాలనే పోరాట పథంలో నిలుపుతుంది. అందుకే అత్యధిక మందిని చింకిపాతల్లో ఉంచుతూ కొద్దిమందిని పట్టుచీరల్లో ముంచే పనిలో పాలకులున్నారు.