Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికలైపోయినాక ఎలా ఉంటుంది...? ఎవరో మనలను వెక్కిరిస్తున్నట్టనిపిస్తుంది..! మన ఓటే మనలను కాటేసినట్టనిపిస్తుంది..! అసత్య ప్రచారాల, పరస్పర దూషణ పర్వాల ఘోష తగ్గాక, తిరిగి మన దరిద్రం మనకు కనిపిస్తుంది. తెలిసితెలిసీ అయిదేండ్లకోసారి మోసపోతుండటం గుర్తొస్తుంది. ఎప్పుడూ ఇంతే కదా..! ఇప్పుడూ అంతే..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌నే నిజం చేశాయి. కాంగ్రెస్ తన పరాజయాల పరంపరలో తాజాగా పంజాబ్‌ను సైతం ఆప్‌కు కోల్పోగా, ఉత్తరప్రదేశ్‌తో పాటు మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ తిరిగి నిలబెట్టుకుంది. రాజకీయంగానూ, సైద్ధాంతికంగానూ బీజేపికి ప్రత్యామ్నాయం చూపలేని స్థితిని కొనసాగిస్తూ కాంగ్రెస్ మరింత బలహీనపడగా, హిందూత్వ భావోద్వేగాలు, విద్వేష రాజకీయాలే ఆలంబనగా బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీలను కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడుతూ ప్రజలు నిర్ణయాత్మక మార్పుకు తీర్పునిచ్చారు. అయితే ఎన్నికలు జరిగింది అయిదు రాష్ట్రాల్లో అయినా, ఇప్పుడు అందరి ఆసక్తీ యూపీ ఫలితాలపైనే..! దేశంలోనే అత్యధిక శాసనసభ, లోక్‌సభ స్థానాలతో అది ఢిల్లీ పీఠానికి కీలకం కావడమే ఇందుకు కారణం. అంతిమంగా ఈ ఫలితాలన్నీ బీజేపికి సరైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచడంలో ప్రతిపక్షాల వైఫల్యాలనే సూచిస్తున్నాయి.
నిజానికి బీజేపీ పాలనపట్ల ప్రజల్లో అసంతృప్తే నెలకొనివుంది. ప్రత్యేకించి యూపీలో అది మరింత తీవ్రంగా ఉంది. ఎందుకంటే గత అయిదేండ్ల యోగి పాలన ఆ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచిందేమీ లేకపోగా దిగజార్చింది. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. అసాంఘిక శక్తుల అరాచకం ప్రబలింది. అవినీతి అధికమయ్యింది. నేరాలు వ్యవస్థీకృతమయ్యాయి. ముఖ్యంగా మహిళలపై లైంగికదాడులు పెచ్చరిల్లగా, యోగి సర్కారు బాధితులకన్నా నిందితుల పక్షాన నిలిచిన సందర్భాలే ఎక్కువ. పోలీసు యంత్రాంగం తీరు ఇష్టారాజ్యంగా మారింది. ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. విద్య, ఆరోగ్య రంగాలు దాదాపు నిర్వీర్యమయ్యాయి. కరోనా కాలంలో ప్రజల ప్రాణాలు నిర్లక్ష్యానికి గురై గంగానదిలో శవాలు ప్రవహించాయి. మోడీ తెచ్చిన వ్యవసాయ చట్టాలు, తదనంతర రైతు ఉద్యమ అణచివేతలూ ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి. అందువల్ల, బీజేపీకి ఎటుచూసినా ప్రతికూలతలే తప్ప సానుకూలతలకు అవకాశమేలేదు.
అయినా బీజేపీ ఎలా గెలిచిందీ? అంటే... ప్రజాసమస్యలూ, పాలకుల విధానాలూ, ప్రభుత్వాల పనితీరే ప్రాతిపదికగా తీర్పునిచ్చే అవకాశం ప్రజలకు లేకుండా చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న అంతులేని ధనప్రవాహాలూ, ప్రలోభాలకు తోడు, ఇప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టే ధోరణులను ఉధృతం చేసింది. అందుకే, బీజేపీ ఎలా గెలిచిందీ అనే ప్రశ్నకు.. భావోద్వేగాల మాటున మతపరమైన సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా కుల సమీకరణలు, అపార ధనవినియోగం, అధికార దుర్వినియోగాలకు తోడు విపక్షాల అనైక్యతలే ప్రధాన సమాధానాలుగా కనిపిస్తాయి. ప్రచార పర్వం ప్రారంభంలోనే ''ఇది 80శాతానికీ 20శాతానికీ మధ్య జరుగుతున్న యుద్ధం'' అంటూ యోగీ బహిరంగంగానే విభజన రాజకీయాలకు తెగబడ్డారు. దానికి కొనసాగింపుగా ప్రధాని, హౌం మంత్రి స్థాయి నేతలు ''సమాజ్‌వాదీ పార్టీకి ఓటేస్తే జిన్నాకు, ఔరంగజేబుకు ఓటేసినట్టే'' అంటూ మరింత రెచ్చగొట్టారు. ఆ ఊపులో యూపీ కాషాయ నేతల ప్రచారమంతా ఈ విభజన విద్వేష వాఖ్యలతోనే సాగింది. దీనికి ముందే మోడీ, యోగీ ద్వయం అయోధ్యలో రామాలయ నిర్మాణం, కాశీ కారిడార్ విస్తరణల రూపంలో తమ హిందూత్వవాదాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్ళింది.
ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకుగా ఉన్న ప్రజలను కులాలవారిగా చీల్చడం, తమ ఓటు బ్యాంకును చెదరకుండా చూసుకోవడమనే సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను బీజేపీ అమలు పరిచింది. ముఖ్యంగా బీఎస్పీ నుండి జాతవేతర దళితులనూ, ఎస్పీ నుండి యాదవేతర బీసీలను తన వైపునకు తిప్పుకోగలిగింది. ఇక బీజేపీని నియంత్రించడానికి విపక్షాల ఐక్యతకు చొరవచేయకపోవడం ఒక జాతీయపార్టీగా కాంగ్రెస్ దృష్టిలోపానికి నిదర్శనం. ఎంఐఎం గెలిచిందేమీ లేకపోగా బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ 'బీ' టీమ్‌గా విమర్శకుల మాటను నిజం చేసింది. ఈ ఫలితాల సాధనలో ఘనమైన మీడియా వర్గాల పాత్ర కూడా విస్మరించలేనిది. వాస్తవిక పరిస్థితుల నుంచీ, బీజేపీ పాలనా వైఫల్యాల నుంచీ ప్రజల దృష్టిని మళ్లించడంలో, మోడీ యోగీలకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడంలో అవి శక్తివంచన లేకుండా పనిచేసాయి. మొత్తానికి అంతా కలసి.. బీజేపీ గెలుపుకు తోడ్పడ్డారు. ఈ గెలుపు మితవాద రాజకీయాల ప్రమాదాన్ని సూచిస్తున్నది. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతనూ, అప్రమత్తతనూ డిమాండు చేస్తున్నది. విధానపరమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నది.