Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కొంచెం స్వేచ్ఛ గావాలి, రెక్కలల్లార్చడానికి కొంచెం స్వేచ్ఛగావాలి, మనిషిని మనిషని చెబడానికి, పశువుని పశువని చెబటానికి, రాత్రిని రాత్రని, పగటిని పగలని చెబటానికి - రెక్కలల్లార్చి గాల్లో ఎగరటానికి'' - అంటాడు ప్రసిద్ధ కవి శివారెడ్డి. అవును, స్వేచ్ఛ అంటే మనతోమనం, మనలో మనం ఉండిపోవటం కాదు. మనం మనంలా ఉండగలిగేందుకూ, మనం ఇతరులతో మనంగా వ్యవహరించేందుకు ఉండే స్వేచ్ఛ, పూర్తిగా మనకు సంబంధించినది. అది హరించిపోతే రెక్కలు విప్పని పక్షిలానే మిగిలిపోతాం. అస్తిత్వమే ప్రశ్నార్థకమైపోతుంది. జీవితమంతా ఉక్కపోతకు గురై ఊపిరి సలపదు. స్వేచ్ఛ అంటే మనం మన ఇష్టమైనట్లు వర్తించటం కాదు. ఆధునిక సమాజం, నాగరిక సమాజం మనుషులకిచ్చిన అన్ని రకాల స్వేచ్ఛలను నియమానుసారమే పొందగలగటం. ప్రజాస్వామిక యుగంలో మానవుడి అభివ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోవడం, రద్దు చేయటం అనాగరిక చర్యే అవుతుంది. స్వేచ్ఛా, మానవ హక్కులూ హరించివేస్తే ప్రాణంలేని జీవులైపోతారు. అది ఓరకంగా హత్యలాంటిది.
మనకు స్వాతంత్య్రం వచ్చి డెభ్బైఐదు సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. మన రాజ్యాంగం ఇక్కడి ప్రజలకు, పౌరులకు హక్కులను, బాధ్యతలను నిర్దేశించింది. కానీ అనేక కారణాలతో, అవిద్య, అజ్ఞానంతో ప్రజలంతా హక్కులను పూర్తిగా అనుభలవించలేకపోతున్నారు అనేది ఒక వాస్తవం. హక్కులను వినియోగించుకునే వారి నుండి అవి లాగేసుకోబడటం సహింపరానిది. అలా హక్కుల్ని అణచివేసే సంఘటనలు స్వాతంత్య్రానంతర భారతంలో కొనసాగుతూనే ఉన్నాయి. 1975లో ఎమర్జెన్సీ విధించి పౌరుల, రాజకీయ పక్షాల హక్కులను కాలరాయటం, నిర్బంధించడం, ప్రశ్న తలెత్తితేనే గొంతులు మూయటాన్ని చవిచూశాము. ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ఇలాంటి ఎన్నికల నియంతృత్వంగా మారి ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇస్తు నియంతృత్వ స్వామ్యం తలెత్తుతూ వస్తూన్నది.
ఇటీవల స్వీడన్‌కు చెందిన వి.డెమ్ నివేదిక మనదేశంలో ప్రజాస్వామికస్థానం ఎలావుందీ, ఏరకమైన పరిపాలన కొనసాగుతున్నదీ అనే వివరాలను వెల్లడించింది. ప్రజాస్వామ్య స్వేచ్ఛా సూచికలో మనదేశం 93వ స్థానంలో ఉందని తెలిపింది. ఎన్నికల ప్రజాస్వామ్యంలో 100వస్థానంలో మనమున్నాము. మొత్తం 179 దేశాల ర్యాంకులలో మనస్థామది. నిరంకుశత్వం వైపు వెళ్తున్న మొదటి పది దేశాల్లో భారత్ స్థానం సాధించడం మనల్ని కలవరపెట్టే అంశం. పౌరహక్కులు, వాక్ స్వాతంత్య్రం, మైనారిటీ హక్కుల విషయంలో అత్యంత ప్రమాదకరమైన పోకడలు తలెత్తుతున్నాయని, పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నారని, ప్రతిపక్షాల్ని బలహీనం చేయటానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వివరించారు. జాతీయ అతివాదాన్ని పెంచి పోషిస్తూ నియంతృత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నారని తెలియ జేశారు. ఇవన్నీ అధ్యయనానంతరం తేలిన వాస్తవాలు. కండ్లారా ఇది కనపడుతూనే ఉంది.
ఇక మనదేశంలో మానవ హక్కులను, స్వేచ్ఛను, మాట్లాడే ప్రశ్నించే కనీస హక్కులను కూడా సహించలేని తనం పెరిగిపోయిందనే విషయం ప్రపంచానికి కూడా తెలిసివచ్చింది. ఈ మధ్య మనదేశంలో మానవ హక్కుల కార్యకర్తల పట్ల ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ యురోపియన్ పార్లమెంటు సభ్యులు ప్రధానికి, ఇతర ఉన్నతాధికారులకు లేఖరాశారు. శాంతియుతంగా పనిచేసుకుంటున్న సామాజిక కార్యకర్తలను ఉగ్రవాదులుగా ముద్రవేసి జైలుపాలు చేస్తున్నారని, వాళ్లు విపరీతమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూడు కేసులనూ వారు ఎత్తిచూపారు. ఎల్గార్ పరిషత్ కేసులో 16మంది కార్యకర్తలు, విద్యావేత్తల అరెస్టు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన కార్యకర్తలు, విద్యార్థుల అరెస్టు, కాశ్మీర్ సామాజిక కార్యకర్త అరెస్టులనూ వారు ఎత్తిచూపారు. నిందుతుల్లో కొందరిని లక్ష్యంగా చేసుకోవడానికి పెగాసెస్ స్పైవేర్, నెట్వైర్లను వినియోగించి, నిందుతుల కంప్యూటర్లలో డిజిటల్ సాక్ష్యాలను ఏర్పాటు చేయడం పట్ల యురోపియన్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది ఎంతసిగ్గుచేటయిన విషయం. ప్రపంచంలో మన దేశ గౌరవాన్ని దెబ్బతీస్తున్నది. ప్రజాస్వామిక విలువల పట్ల మనం అనుసరిస్తున్న విధానం ఇంటా బయటా అనేక విమర్శలకు గురవుతున్నది. ఏరకమైన ఆరోపణలనూ రుజువు చేయలేకపోయినప్పటికీ సామాజిక కార్యకర్త స్టాన్ స్వామి జైల్లోనే చంపివేయబడ్డాడు. ఇప్పటికీ ఏ అభియోగాలనూ నిరూపించలేకపోయిన కవి, రచయిత వరవరరావునూ నిర్బంధంలోనే ఉంచారు. గోవింద్ పన్సారే, కల్బుర్గీ, గౌరీలంకేశ్లను ప్రశ్నిస్తున్నారనే నెపంతో పబ్లిక్‌గా చంపేసారు. కానీ లఖింపూర్‌లో పబ్లిక్‌గానే కారు ఎక్కించి రైతులను చంపిన మంత్రి తనయుడు బైయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఇదీ మనదేశ గమనపు దిశ. ప్రజలు, మేధావులు అప్రమత్తమై మెల్కొనకపోతే త్వరలోనే నియంతృత్వ భూతం దేశాన్ని కబలిస్తుంది.