Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణ భాషలో నీళ్లొదలడం! దేనికి? రాజ్యాంగ విలువలకు! మన రాజ్యాంగం పేరే 'యూనియన్ ఆఫ్ స్టేట్స్!' అంటే రాష్ట్రాల సమాఖ్య. భిన్న భాషలు, భిన్న సంస్కృతుల సమ్మేళనం మన దేశం. ''మేము, మా భాష, మా సంస్కృతి'' అనే ఆలోచనల్లోంచి, అంటే చైతన్యం లోంచి ''మనము, మన దేశం'' అనే చైతన్యం పెల్లుబికింది. ప్రాథమికంగా ఈ సమాఖ్య చైతన్యం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోనే పుట్టింది. సంఫ్‌ుపరివార్ నిఘంటువులో లేనిదీ విషయం. ఇన్ని భాషలు, మతాలు, కులాలు, సంస్కృతులూ ఉండే దేశం స్వాతంత్య్రం సంపాదించుకున్నా అనతికాలంలోనే విచ్ఛిన్నమైపోతుందని సామ్రాజ్యవాద 'నక్కలు' 1947 నుండి 'గోతికాడే' వేచి ఉన్నాయి. 'కాగల కార్యం మనుషులే తీర్చే రోజు వస్తుందా?! మోడీ అండ్ కంపెనీ చేతుల మీదుగా ఇది పరిపూర్తి అవుతుందా?! దానికి భారతీయులు అనుమతిస్తారా?! మన దేశ ప్రజాతంత్ర ఉద్యమమే దీనికి సమాధానం చెపుతుంది.
రాష్ట్రాల వనరులను మోసపూరిత మాటలతో, వాగ్దానాలతో చివరికి బుజ్జగింపులతో జీ.ఎస్.టీ. పేరుతో కొల్లగొట్టింది కేంద్ర ప్రభుత్వం. పన్నులు వేసుకునేందుకు రాష్ట్రాలకున్న ఏకైక మార్గం (అమ్మకం పన్ను) నేడు హరించవేయబడింది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకొచ్చే లోటును తాను భర్తీ చేస్తానని నమ్మబలికింది. 2020-21కి రూ.37,134కోట్లు ఇస్తానన్న పరిహారం బకాయి ఉన్నట్లు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రానికి రూ.210కోట్లు ఐ.జీ.ఎస్.టి బకాయుంది. ఇదిగాక మొన్న ఫిబ్రవరి 19న కేంద్రానికి రాసిన లేఖలో హరీష్‌రావు వివిధ పద్దుల కింద రూ.2435.81కోట్లు బకాయిలున్నాయని పేర్కొన్నారు.
కార్పొరేట్లకు మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ''సేవ''లో భాగస్వాములవ్వాలన్న దృష్టే ఉన్నట్టుంది. ఈ బరితెగింపు ఫెడరల్ వ్యవస్థకు నష్టదాయకంగా పరిణమిస్తుంది. ఉదాహరణకు విద్యుత్ చట్టాన్ని ప్రజల, రైతుల, విద్యుత్ ఉద్యోగుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గి పి.ఎఫ్.సి (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్), ఆర్.ఇ.సి. (రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్)ల అప్పు కావాలంటే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని, 'ఆదిత్య' స్కీమ్‌లో చేరాలని రాష్ట్రాలను వత్తిడి చేస్తోంది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమంటే ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలతో ప్రజాభిమానం చూరగొంటున్నది కేరళ ఎల్.డి.ఎఫ్. ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను మోడీ సర్కార్ ప్రయివేటీకరిస్తూండగా పినరాయి విజయన్ ప్రభుత్వం వాటిని తామే కొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపెట్టుకునేందుకు ముందుకొస్తే కనీసం బిడ్డింగులో పాల్గొనకుండా మోకాలడ్డుతోంది. ఆ రాష్ట్ర కార్మికవర్గమే కాదు, దేశంలోని యావన్మందీ మోడీ కార్పొరేట్ 'సేవ'పై ప్రతిఘటనకు సన్నద్ధమవుతున్నారు.
1947 ముందు హిందూ రాజుపాలనలో ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రం జమ్ము, కాశ్మీర్. ఆ ప్రజలకున్న అనుమానాలు నివృత్తిచేసి ఆ రాష్ట్రాన్ని మనదేశంలో అంతర్భాగం చేసుకునేందుకుపయోగపడ్డవే ఆర్టికల్ 370, 35ఎ లు. నేడు ఒక పథకం ప్రకారం ముందు అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభలో చర్చించకుండానే కేవలం గవర్నర్‌ని ''సంప్రదించి'' ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. ఆ విధంగా ఆర్టికల్ 370 పుట్టినరోజు నుండి దాని రద్దుకు ఆరెస్సెస్ చేస్తున్న డిమాండ్‌ను మోడీ సర్కార్ అమలు చేసినట్లైంది. రేపు మరో రాష్ట్రంలో గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకుని రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చరనే గ్యారంటీ ఏమీలేదు. ఇది మన రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి గొడ్డలి పెట్టు. రాష్ట్రాల వనరులనే గాక నిర్ణయాధికారాన్ని కూడా భస్మీపటలం చేస్తోంది బీజేపీ.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర పరిధి, రాష్ట్రాల పరిధి, ఉమ్మడి జాబితా రాయబడి ఉన్నాయి. ఉమ్మడి జాబితాలోని విద్యను నేడు కేంద్రం తన చేతుల్లోకి తీసు కుంది. అన్ని రాష్ట్రాలూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలట! రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయాన్ని కూడ నేడు రైతులు రోసిన మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఉద్యమానికి తలొగ్గి ఒకడుగు వెనక్కి తగ్గినట్లున్నా మళ్ళీ దొడ్డిదారి వెతుకుతోంది మోడీ సర్కార్. ఆ విధంగా రాజ్యాం గాన్ని డొల్లచేస్తోంది. గుల్ల చేస్తోంది. ''హిందూత్వ శక్తులకు ఏకీకృత రాజ్యం(యూనిటరీ) అవసరం. కార్పొరేట్లకూ యూనిటరీ రాజ్యమే అవసరం'' అంటారు ప్రభాత్ పట్నాయక్. హిందీని దేశమంతారుద్దే ప్రయత్నమైనా 'నీట్' పేరు మీద మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తన అధీనంలోకి తీసుకుని ఎమ్ సెట్ల నోట్లో మట్టికొట్టినా ఈ ఏకీకృత విధానంలో అంత ర్భాగమే. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకునేందుకు కనీసం ప్రతిపక్షపాలిత రాష్ట్రాలైనా గొంతెత్తాలి. కేసీఆర్ ప్రభుత్వం గాలివాటంగా ఉండటం గాక బీజేపీ ప్రభుత్వ విధానాలపై నికరంగా నిలిచి పోరాడాలి.