Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకమైన శాసనసభా బడ్జెట్ సమావేశాల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈనెల ఏడో తేదీతో ప్రారంభమై... ఏడంటే ఏడు రోజులే కొనసాగిన సమావేశాలను ప్రభుత్వ పెద్దలు మొత్తానికి మమ... అనిపించారు. చివరకు తూతూ మంత్రంగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అలా ఆరంభమై... ఇలా ముగిసిందని చెప్పక తప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు నెలన్నర రోజులపాటు ఇవి కొనసాగిన విషయం తెలిసిందే. సరే... అప్పుడు సభ్యుల సంఖ్య 294 కాబట్టి, రాష్ట్రం కూడా పెద్దది కాబట్టి, సమస్యలు, సభ్యులు లేవనెత్తే అంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అన్నేసి రోజులు సభ జరిగిందని ప్రభుత్వం సమర్థించుకున్నా అంత సుదీర్ఘంగా కాకపోయినా కనీసంలో కనీసంగా తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇరవై రోజులైనా జరిగితే వాటికి సార్థకత చేకూరేది. కానీ ఆ ఇరవైలో సగం అంటే... పట్టుమని పది రోజులు కూడా సభను నిర్వహించకపోవటమనేది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే కాదు.. తెలంగాణ చరిత్రలోనూ మొట్టమొదటిది కావటం గమనార్హం.
ఈ సమావేశాలు జరిగిన తీరు తెన్నులను మనం నిశితంగా పరిశీలిస్తే... ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. సమావేశాల ఆరో రోజైన సోమవారం (ఈనెల 14) జీరో అవర్ (శూన్యగంట)లో మొత్తం 45 మంది సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు. వీరిలో అత్యధిక మంది అధికార పార్టీకి చెందిన వారే కావటం గమనార్హం. ఆ మరుసటి రోజైన మంగళవారం కూడా దాదాపు 60 మంది సభ్యులు అదే జీరో అవర్‌లో... 'నియోజకవర్గాల్లోని సమస్యలను పరిష్కరించండి మహాప్రభో...' అంటూ మొరపెట్టుకున్నారు. అదే సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలను, ముఖ్యమంత్రిని అదే పనిగా పొగడ్తలతో ముంచెత్తే శాసనసభ్యులే... జీరో అవర్రో మాత్రం ఆస్పత్రులు కట్టించండి, కాలేజీలు ఏర్పాటు చేయండంటూ గొంతెత్తటం కాస్త విడ్డూరంగా అనిపించినా... క్షేత్రస్థాయిలోని సమస్యల తీవ్రతకు, అక్కడి వాస్తవ పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. గమ్మత్తేమిటంటే 2019 నుంచి ఇప్పటి వరకూ నిర్వహించిన అన్ని శాసనసభా సమావేశాల జీరో అవర్లలోనూ ఇవే సమస్యలను ఎమ్మెల్యేలు పునరావృతం చేయటం గమనార్హం. వీటిలో అత్యధికం గిరిజన ప్రాంతాలు, మారుమూల ఏరియాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటికి సంబంధించినవే ఉన్నాయి. అంటే నిత్యం అభివృద్ధి, అభివృద్ధి అంటూ జపం చేస్తున్న మన పాలకులు... ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా మళ్లీ అదే అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌తోపాటు కొన్ని నగరాలు, పట్టణాలకే పరిమితం చేశారు తప్ప... పల్లెలను, గ్రామ సీమలను, ఎస్సీ, ఎస్టీ జనావాసాలకు దాన్ని వికేంద్రీకరించలేదనే విషయం విదితమవుతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల ఏర్పాటు, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ల లాంటి వాటి గురించి సర్కారు వారు చెప్పుకొస్తున్నా... అతి కీలకమైన విద్య, వైద్య రంగాలకు సంబంధించి ప్రజలు ఆశించిన విధంగా సౌకర్యాలు, సదుపయాలు సమకూరటం లేదన్న విషయాన్ని 'జీరో అవర్...' చెప్పకనే చెబుతున్నది. మరోవైపు జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన సమస్యలకు కచ్చితంగా రాతపూర్వక సమాధానాలివ్వాలంటూ స్పీకర్ మంత్రులను ఆదేశించటాన్ని బట్టి... 'అధ్యక్షా... గౌరవ సభ్యుడు చెప్పిందాన్ని రాసుకున్నాం, సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తాం...' అనేంత వరకే అమాత్యవర్యులు పరిమితమవుతున్నారు తప్పితే... ఆయా ప్రశ్నలకు జవాబులు ఇవ్వటంలోను, ఇప్పించటంలోనూ చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదని తేలింది. ఇది కూడా 2019 నుంచి నడుస్తున్న తంతే. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా సభ్యులు లేవనెత్తుతున్న సమస్యలు, ప్రస్తావిస్తున్న అంశాలను ప్రభుత్వం, మంత్రులు పెద్దగా పట్టించుకోలేదన్నమాట. పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు సమావేశాలను ఎక్కువ రోజులపాటు నడపటం ద్వారా సమస్యలపై సమగ్ర చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పించి ఉంటే... ప్రజలకు కొంతలో కొంత న్యాయం జరిగేది.
చట్టసభల్లో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే.. ప్రజావాణి అంత బలంగా వినబడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుత శాసనసభలో బలమైన ప్రతిపక్షాలు, ముఖ్యంగా వామపక్షాలు లేని లోటు స్పష్టంగా కనబడింది. 2018 ముందస్తు ఎన్నికల తర్వాత నిర్వహించిన ప్రతి శాసనసభా సమావేశాల్లోనూ ఈ దుస్థితి గోచరించినా... ఈసారి అది మరింత ప్రస్ఫుటమైంది. మొదటి రోజే సభ నుంచి గెంటివేయబడ్డ బీజేపీ ఎమ్మెల్యేలు, తాము గట్టిగా మాట్లాడితే, తమను కూడా ఎక్కడ బయటకు పంపుతారోనని బిక్కు బిక్కుమంటూ గడిపిన కాంగ్రెస్ సభ్యులు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటగాకే ఎంఐఎం, సభా నాయకుణ్ని పొగడటంలో గిన్నిస్ రికార్డులను బద్ధలు కొట్టిన అధికార టీఆర్ఎస్ సభ్యులు... వెరసి మన బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరిది. మరోవైపు సభలో ప్రజలను, ప్రజా ఉద్యమాలను అధినాయకుడు గేలి చేయటం, చులకనగా మాట్లాడటం పరిపాటైంది. సభలో ప్రజా సమస్యలపై చర్చ శూన్యం. 'కాంట్రాక్టరు, పేకాట రాయుళ్లు...' అనే అంశాలపై లొల్లి చెలరేగి, సభా సమయం వృధా కావటంలో ప్రభుత్వ పెద్దలతో పాటు కాంగ్రెస్ పక్షం కూడా కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్రజా సమస్యలు పక్కదోవ పట్టడంలో అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం దోషులుగా మారాయి. ఇకనైనా ఈ తీరుమారాలని మేధావులు, సామాజిక వేత్తలు కోరుతున్నారు.. అప్పుడే రాష్ట్రానికి, ప్రజలకూ శాసనసభ ద్వారా న్యాయం జరుగుతుందని వారు సూచిస్తున్నారు.