Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలీ రాష్ట్రంలో పిడికిళ్ళెత్తడాన్ని నిషేధించారు. ప్రభుత్వం మీదే కాదు, ఏ పెట్టుబడిదారుడి పైనా సమ్మె కట్టడం నిషేధమే! ''ఎర్రజెండా లెత్తరాదు, దొర గుస్స చేస్తడ''ని మంత్రులు, వారి తాబేదార్లు కార్మికుల్లో ప్రచారం. ఇక్కడ ఎర్రగులాబీలు ముట్టరాదు. ఎవరైనా 'గులాబీ' గులాబీలే వర్షించాలి. ఈ రాష్ట్రంలో పాలపాకెట్లు తెచ్చుకోవాలి. ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేసుకోవాలి. ఎర్రజెండా లెత్తారా!? కోటగుమ్మానికి, అవిగో 1600 జీహెచ్ఎంసీ కార్మికుల తలలు 2015 నుండి వేలాడుతున్నాయి! జీవితంలో మళ్ళీ సమ్మెలు చేయనని బాండ్ పేపర్‌పై సంతకాలు చేశారు. ఇవిగివిగో ఫ్రెష్‌గా ఏడున్నర వేలకు పైగా ఫీల్డ్అసిస్టెంట్ల్ల తలలు. 2020 మార్చిలో కదా ఫీల్డ్అసిస్టెంట్లు సమ్మె చేసింది? ''ధిక్కారమున్ సైతునే!'' అంటూ మన ముఖ్యమంత్రికి కోపం వచ్చి ఒక్కవేటుతో ఏడున్నర వేల మందికి పైగా శిరచ్ఛేదం చేశారు. రెండు సంవత్సరాలు పూర్తయింది. కేసీఆర్ గుండె కరిగిందో, ఎన్నికల పండుగ ముందుకొచ్చే శకునమో గాని ఆ మొండాలకు పట్టాభిషేకం చేయబడుతుందనే ''ప్రకటన'' మాత్రం చేశారు.
ఎర్రజెండాలీ దేశంలో యెవరూ పట్టకుండా ఉంటే ఏమయ్యుండేది? ముప్పయేండ్లు ఫాస్ట్ఫార్వడ్ జరిగి 2021-22 అమాంతం పివి కాలంలోనే సాక్షాత్కరించి ఉండేది! కొందరికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది జీవిత సత్యం. ఎర్రజెండాల విలువ పాలకులకేమి తెలుస్తుంది? ఆధునిక భాషలో కంప్యూటర్ మౌస్‌లు జరిపేవారికి, అంటే.. బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఉద్యోగుల వంటివారికి, సుత్తులు చేతబట్టిన కార్మికులకు, కొడవళ్లు పట్టుకున్న రైతన్నలకే కదా ఎర్రజెండాల విలువ తెలిసేది! మోడీ పుణ్యాన భ్రమలు పటాపంచలవుతున్నాయి. యేడాదికి పైగా ఢిల్లీని ఘెరావ్ చేసిన రైతులే దీనికి తార్కాణం. తమ నాయకులు జోకొట్టినా నిద్రపోని కార్మికులు ఎర్రజెండాలకే నోళ్ళయినినదించే ''లేబర్గాళ్లు'' దీన్నే రుజువు చేయటంలేదా? మోడీ పాలన ప్రారంభంతో ప్రభుత్వరంగానికి ముప్పు వాటిల్లుతోందని ఎర్రజెండాలే కదా కార్మికుల్ని 2014 నుండి అప్రమత్తం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వరంగ రక్షణకై నికరంగా నిలబడుతున్నది ఎర్రజెండాలే. మొన్న కేరళ ఎల్.డీ.ఎఫ్. ప్రభుత్వం ఎల్ఐసీ ఐ.పి.ఓ.కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి దేశానికే ఆదర్శంగా నిలవలేదా? గతంలో బెంగాల్ వామపక్ష ప్రభుత్వం ఇస్కో (ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్)ను తనశక్తికి మించి ప్రయత్నించి ప్రయివేటీకరించకుండా ఆపలేదా? ఆ ప్రయివేటీకరణే నేడు మన సింగరేణి మెడకి ఉరితాడవుతోంది. ఆలస్యంగానైనా రంగంలోకి దిగిన టీఆర్ఎస్ స్వల్పకాలిక రాజకీయల కోసం కక్కుర్తి పడకుండా నిజాయితీగా తుదికంటా నిలబడాలని కార్మికులు కోరుతున్నారు. కార్మికులైనా, రైతులైనా, వ్యవసాయకూలీలైనా తమకోసం స్పందించే గుండెల కోసం వెంపర్లాడతారు. ఆర్ద్రంగా ఎదురుచూస్తారు. ఎర్రజెండాల డి.ఎన్.ఎ.లో కష్టజీవులు తప్ప మరొకరుండరు. ఎర్రజెండాలు బతికేది, చివరికి అమరత్వం పొందేది కూడా కష్టజీవుల కోసమే.
ఈ ఎర్రజెండాల సాయంతోనే కరీంనగర్ రైస్‌మిల్లు ఆపరేటర్లు వేతనాల పెంపుదల కోసం నెలరోజులు పోరాడారు. చివరికి జీతాలు పెంచుకునే సమ్మె విరమించారు. నల్లగొండ పవర్‌లూం కార్మికులు 13శాతం జీతాలు పెంచుకోవడానికి మళ్ళీ ఎర్రజెండాలే కావల్సి వచ్చింది. 63రోజులు సమ్మె చేయాల్సి వచ్చింది. ఎర్రజెండాల్ని వ్యతిరేకించడం, తృణీకరించడం సరే, గులాబీ దళాలు, దళపతి 16జిల్లాల్లో 45 నియోజకవర్గాల్లోని బీడీ కార్మికుల సముద్ధరణ కోసం ఏనాడైనా ఆలోచించారా? అంటే ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు వంటివి కాదు. 2012 నుండి బీడీ కార్మికుల కనీసవేతనాల జీవో పునరుద్ధరించబడలేదు. ఆరులక్షల మంది మహిళలకు వేతనాలు పెంచాలనే ఇంగితజ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా? అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరంగంలోనైనా కనీస వేతనాల జీఓలు కొత్తగా ఇచ్చారా? 1.20కోట్ల మందికి సంబంధించిన విషయం కదా! ఎందుకంటే అన్నింటినీ, ఊడగొట్టిన ఉద్యోగాలు మళ్లీ ఇవ్వాలా వద్దా? జీతాలు పెంచాలా వద్దా? అనే అంశాలన్నీ ఓట్లతోనే జోకే రోజులివి! తాజాగా ఒక మీటింగు జరిపి యజమానుల వత్తిడితో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు చెపుతున్నారు.
కేసీఆర్ లాంటివారిని చూస్తే సుబ్బారావు ప్రాణిగ్రహి ''ఎరుపంటే కొందరికి భయం, భయం - పసిపిల్లలు వారికంటే నయం, నయం!'' అన్న విషయం యాదికి రాకమానదు. కేసీఆర్ భయపడుతున్నాడుగానీ ఎరుపు 'పోరు'కు సంకేతం. మన రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్రం కొనాలంటే మన రైతాంగం కోసం 'పోరే' సల్పాలి. సింగరేణిని కాపాడుకోవాలంటే దేశ, విదేశ పెట్టుబడితో 'పోరే' సాగించాలి. కార్పొరేట్లకు కామందు మోడీ. మోడీతో, బీజేపీతో సయ్యాటలాడటానికి ప్రయత్నించకుండా సమరానికే టీఆర్ఎస్ సిద్ధపడితే రాష్ట్రానికి మేలు. సమరచైతన్యానికి స్ఫూర్తి ఎరుపే!