Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''చిటికెడు సత్యం కలిపిన అబద్దాన్ని తేలిగ్గా నమ్మించవచ్చుగానీ, నిజమెప్పుడూ నిప్పులాంటిదే. దాచేస్తే దహించివేస్తుంది'' అంటాడు సి.వి. సుబ్బారావు. ''ది కశ్మీర్ ఫైల్స్''పై ప్రచార, ప్రసార సాధనాల్లో, సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న వాదోపవాదాలను చూస్తోంటే ఆయన మాటలే గుర్తుకొస్తున్నాయి. స్వయంగా ప్రధానమంత్రే ఇది దేశభక్తికి ప్రతిరూపమని కితాబులిస్తుంటే, ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాపిత చర్చనీయాంశంగా మారింది. హౌంమంత్రితో సహా పాలకనేతలంతా దర్శక నిర్మాతలను ఆకాశానికెత్తుతున్నారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలైతే పోటీపడి ఈ సినిమాకు వినోదపన్నులు రద్దుచేస్తున్నాయి.
జీ స్టూడియోస్ సహకారంతో నిర్మితమైన ఈ సినిమాను ఒక సత్యానికి ఆవిష్కరణగా చెపుతున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహౌత్రి. మూడు దశాబ్దాల క్రితం కాశ్మీరు లోయలో ఉగ్రవాదుల ఊచకోతకు బలై వలస పోయిన అనేక హిందూ కుటుంబాల (కాశ్మీరి పండిట్ల)ను ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఈ సినిమా రూపకల్పనలో ప్రతిభావంతమైన దర్శకుడి సామర్థ్యాలు, ఉన్నతమైన సాంకేతిక నైపుణ్యాలు అభినందనీయమే. కానీ, సినిమాను ఒక సత్యానికి ఆవిష్కరణగా చెప్పుకుంటూ... అర్థసత్యాలనూ, అసత్యాలను వెల్లడించడమే ఆక్షేపణీయం. ఉగ్రవాదం ఎవరిదైనా, అది బలితీసుకునే ప్రాణాలు ఎవరివైనా ఖండించవలసిందే. కానీ దానికి కుల మతాల పట్టింపులేవీ ఉండవన్న వాస్తవాన్ని విస్మరించడమే విడ్డూరం! సినిమాలో చూపిన కాశ్మీరి పండిట్ల విషాధగాథకు హృదయమున్న మనుషులుగా స్పందించడం, సంఘీభావం ప్రకటించడం భారతీయులుగా మన అందరి బాధ్యత. అయితే ఆ విషాదం కేవలం కాశ్మీరి పండితులదే కాదనీ, కాశ్మీరి ముస్లిం ప్రజలది కూడానని గుర్తించకపోవడం మాత్రం సినిమా దర్శక నిర్మాతల బాధ్యతా రాహిత్యమే. ఇటీవల ఒక ''ఆర్టీఐ'' ప్రశ్నకు సమాధానంగా, శ్రీనగర్ పోలీసు ప్రధాన కార్యాలయం వారు ఇచ్చిన వివరాలు చూస్తే మనకు అసలు నిజం బోధపడుతుంది. 1990లో మిలిటెన్సీ ప్రారంభించ బడినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్లో 1,724 మంది చంపబడగా, అందులో 89మంది కాశ్మీరి పండిట్లు ఉంటే, 1,635 మంది ఇతర మతాల ప్రజలున్నారని ఆ పోలీసుశాఖ తెలియజేసింది.
ఆనాటి వేర్పాటువాదుల దారుణ మారణకాండకు అనేక హిందూ కుటుంబాలు స్వదేశంలోనే కాందిశీకులుగా మారిన మాట సత్యం. కానీ ఆ ఉగ్రఘాతుకాలకు హతులైంది కాశ్మీరి పండిట్లు మాత్రమే అంటే అది అర్థసత్యమే అవుతుంది. ఎందుకంటే అంతకు మించిన సంఖ్యలో కాశ్మీరి ముస్లింలను కూడా ఉగ్రవాదులు బలితీసుకున్నారు. అంతటి కల్లోలంలోనూ అనేక ముస్లిం కుటుంబాలు కాశ్మీరి పండిట్లకు రక్షణగా నిలిచాయి. మరి నిజాలు ఇలా ఉంటే... ఈ సినిమా కేవలం కాశ్మీరి పండిట్ల గురించి మాత్రమే మాట్లాడటం ఎలా సమర్థనీయం? ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహౌత్రి బీజేసీ సమర్థకుడు కాగా, ప్రధాన తారాగణమైన అనుపమ్‌ఖేర్, మిధున్ చక్రవర్తిలు స్వయంగా బీజేపీ నాయకులు కావడం ఇక్కడ గమనార్హం. అటువంటప్పుడు వీరు నిస్పక్షపాతంగా, బాలెన్స్డ్గా సినిమా ఎలా తీయగలరు..? అందుకే ఇది గోబెల్స్ తరహా ప్రచారాలకు ఆధునిక సంస్కరణ తప్ప, సత్యానికి ఆవిష్కరణ కానేకాదు.
స్వతంత్ర భారత చరిత్రలోని ఒక దురదృష్టకర మైన, భావోద్వేగపరమైన సందర్భం నుంచి లబ్ది పొందాలన్న రాజకీయ దుగ్ద సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బుద్దిపూర్వకంగా ఒక రాజకీయ పక్షానికి కొమ్ముకాయడమే! లేదంటే ఒక ప్రయివేటు కంపెనీ తీసిన సినిమాను, ప్రధాని స్థాయి వ్యక్తి ప్రమోట్ చేయడంలోని ఆంతర్యమేమిటి? ఉగ్రవాదులు చేసిన ఈ అనాగరిక హత్యాకాండను ఎత్తి చూపుతున్నారు సరే, ''పరమ నాగరికమైన'' గుజరాత్ మారణకాండకు ఎవరు సమాధానమిస్తారూ..? సినిమా రూపకర్తలు బాధితుల్లో ఒక పక్షం విషాదాన్ని మాత్రమే తెరకెత్తుకుని, రెండవ పక్షాన్ని విస్మరించారు. పైగా ఈ విషాదానికి కాంగ్రెస్‌ను, జర్నలిస్టులను, సెక్యులరిస్టులను, వామపక్షవాదులను, ఒక్కమాటలో చెప్పాలంటే బీజేపీ మార్క్ ''హిందూత్వ''ను విమర్శించే వారందరినీ నిందించారు. నిజానికి ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదు. బీజేపీ మద్దతుతోనే ఏర్పడిన వీపీసింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వమున్నది. బీజేపీ కోరితెచ్చుకున్న ఆ పార్టీ నేత జగ్మోహన్ ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. విచిత్రంగా ఈ వాస్తవాల ప్రస్తావనే లేకుండా, బీజేపీ వ్యతిరేక శక్తులనే ఈ సినిమా విమర్శిస్తుంది...!
ప్రత్యేకించి ఈ సందర్భంలో కాశ్మీరి పండిట్ల రక్షణకు సీపీఐ(ఎం) నేత యూసుఫ్ తరిగామి ప్రాణాలకు తెగించి పోరాడాడు. వేర్పాటువాద శక్తులపై ఇప్పటికీ నికరంగా పోరాడుతున్నాడు. ఫలితంగా నేటికీ వారికి ఆయన టార్గెట్‌గానే ఉన్నాడు. ఇందుకు విరుద్ధంగా ఇదే అదునుగా భావించిన బీజేపీ, హిందూ ముస్లిం విభజనకు బీజం వేసి, నాటినుంచి నేటివరకూ కశ్మీరి పండిట్లను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించు కుంటున్నది. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఆర్టికల్ 370ని రద్దు చేయడం, సుందర కాశ్మీరాన్ని ముక్కలు చేయడం తప్ప, కాశ్మీరీ పండిట్ల పునరావాసానికి ఆ పార్టీ చేసిందేముంది? పైగా వేర్పాటువాద మూలకాల మద్దతున్న ''పీడీపీ''తో అంట కాగుతూ కొంతకాలం ఆ రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని నడిపింది. అంతే కాదు, ఆ ప్రభుత్వం అధికారికంగానే కాశ్మీరి పండిట్ల పునరావాసాన్ని తిరస్కరించే వైఖరిని ప్రదర్శించింది. ఇవేమీ పట్టించుకోకుండా సినిమా మొత్తం ఏకపక్షంగా సాగిపోవడం చరిత్రను వక్రీకరించడమే. చివరికి కళాత్మక వ్యక్తీకరణలు కూడా విద్వేషపూరితం కావడం నేటి విషాదం.