Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నోటి దురుసు నోరి, నీరసపు టెడారి
పేరులేని మారి, అటుపోతే కాలుజారి
చెడిపోతావ్ నీళ్ళు కారి' అని అప్పుడెప్పుడో శ్రీశ్రీగారు లిమఋక్కులులో హెచ్చరిస్తారు. ఇప్పుడు నోటిదురుసు జీయరు గురించి మాట్లాడు కుంటున్న సమయం. ఒట్టి మాట మాత్రమే దురుసుకాదు, మనసూ ప్రవర్తనా అన్నీ కల్మషం నిండిన సరస్సులే. సమతను ఉచ్ఛరించి, అసమానతలు పెంచి పోషించే అసంబద్ధ ప్రవచన ధీరులు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినోళ్ళు, నోళ్లను నిగ్రహించుకోలేకపోవటం ఎంతో విచారకరమైన విషయం. పరుల పట్ల, పరమతాల పట్ల, ఆచారాల పట్ల, సంప్రదాయాల పట్ల ఎలా వ్యవహరించాలో, ప్రవచించాలో కూడా తెలియని మూర్ఖ శిఖామణులు మన జన బోధకులు. ఇలాంటివారి కాళ్లకు సాష్టాంగపడే నాయక మన్యులు మన పాలకులు. ఇది అన్నిటికంటే విషాదం. జనం నుండి వచ్చే నిరసనలు మాత్రమే వీటిని అరికట్టగలవు.
దేవుళ్లలోనూ స్థాయీ బేధాలున్నాయి. వర్గాలూ ఉన్నాయి. దేవుళ్లను అనుసరించే ఆరాధించే ప్రజలు, ఎన్ని రకాలుగా ఉన్నారో ఆ విధంగానే దేవుళ్లూనూ. ప్రముఖ రచయిత సి.వి.గారు, కత్తిపద్మారావుగారు చెప్పినట్లు రిచ్చెస్ట్ దేవుళ్ళు, మిడిల్ క్లాస్ దేవుళ్లు, పూర్ దేవుళ్లు. ప్రజల వ్యత్యాసాలను, అసమానతలను అనుసరించే దేవుళ్ళు కూడా ఏర్పడటం ఒక్క మన భారతీయ వైదిక మతంలోనే చూడగలం. మన సమాజంలో వివిధ తరగతుల మధ్య ఘర్షణ ఉన్నట్లుగానే దేవుళ్ల మధ్య, వారి మతాల మధ్యా ఘర్షణలు, పోటీలు, పోరాటాలూ చరిత్రలో మనం చూస్తాము. అంటే.. ధనిక, పేద దేవుళ్లుగా విడిపోయి ఉండటం ఒక భౌతిక వాస్తవికత. మతం, దేవుడు, ఆరాధన అనేవి విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఒక చారిత్రక సమాజ పరిణామంలో అవశ్యక విశ్వాసమే దేవుళ్లనీ, మతమనీ చెప్పిన మార్క్స్ మహనీయుని విశ్లేషణను అవగాహన చేసుకోవాలి. అది వేరే విషయం. కానీ ఆర్థిక సామాజిక అసమానతల ప్రతిబింబం, దేవుళ్లలోనూ ప్రతిఫలించడం గమనించాల్సిన విషయం. అందుకనే ఈ చులకన భావాలు, ఎక్కువ తక్కువ భేదాలు, వెటకారాలు, అపహాస్యాలు, అనుచిత వ్యాఖ్యానాలు. మనుషు ల్లోని వైరితనమే దేవుళ్లపై విసురుకుంటోంది.
ఈ నేపథ్యంలోంచే చినజీయరు పలికిన పలుకులను పరిశీలించాల్సి ఉంటుంది. రామానుజుడు ప్రతిష్టించిన తిరుపతి వెంకటేశ్వరస్వామి అత్యంత ధనికమైన దేవుడు. మరే మందిరానికీ అంత ఆదాయమూ, వ్యాపారమూ లేదు. ఆ సంప్రదాయపు కొనసాగింపులో ఉన్నవాడే ఈ జీయరు. ఇంతకీ ఆయనకు కలిగిన అభ్యంతరమేమిటో, ఆయన చెప్పిన దాంట్లో దొరకదు. 'సారక్క, సమ్మక్కలు దేవతలా, వారేమన్నా దేవలోకం నుండి వచ్చారా? చదువుకున్న వాళ్లూ, పెద్ద పెద్ద వ్యాపారస్తులూ, ధనవంతులూ అలా భక్తులై పోతున్నారు. ఇదొక వ్యాపారంగా మారిపోయిందని, ఇది చెడులక్షణమని' ఎప్పటిలానే తన నోటి దురుసుతనాన్ని చూపించారు. ఎవరు దేవతలు, ఎవరు కాదు అని తేల్చటానికి ఈయనెవరు? దేవలోకంలోంచి ఎవరు వచ్చారు? మొన్న 216 అడుగుల రామానుజుడి విగ్రహాన్ని పెట్టి పూజలు చేసి, అతన్ని దేవుణ్ణి చేశారు. ఆయన దేవలోకం నుండి వచ్చారా! చదువుకూ విశ్వాసానికి సంబంధం లేకుండానే మూఢత్వంలో ముంచేస్తున్న బాబాలకు, స్వాములకు మన దేశంలో కొదవేమన్నా ఉందా! డేరా బాబాల చీకటి రాజ్యాలను చూడటం లేదూ! రాందేవ్ బాబా ఆరోగ్య విన్యాసాల వెనక వందల, వేల కోట్ల వ్యాపారాల గురించి వీరు ఒక్కమాటా అనరు. కొన్ని దశాబ్దాలుగా ఆదివాసీల ఆరాధ్య దేవతలుగా కొనసాగుతున్న సమ్మక్క సారక్కలు, ఆనాటి కాకతీయ రాజుల కాలంలో గిరిజనుల పక్షాన పోరాడి ప్రాణాలర్పించినవారు. వీరులను, గణనాయకులను కొలవటం ఆదివాసీల సంస్కృతిలో భాగం. అందులో భాగంగానే ఈ వీరవనితలను కొలుస్తుంటారు. వీళ్లకేమీ అంతంత విగ్రహాలు, మందిరాలు, బంగారు పూతలు ఏమీ ఉండవు. ఆదివాసీల చెంతనే అడవిలోనే, వారి స్మృతిలో జాతర జరుపుతారు. యేటి యేటికీ పెరిగి పెరిగి, ఇప్పుడు లక్షలాది ప్రజలు సందర్శించటం, ప్రభుత్వమూ పూనుకుని నిర్వహించడం స్వాములవారికి ఆవేశం తెప్పించి ఉంటుంది. ''కుంభాల కొద్ది నెయ్యి, టన్నుల కొద్దీ బంగారం మా దగ్గరలేదు స్వామీ, మిమ్మల్ని కొలవడానికి. సామాన్యుడు తాకరాని దేవుడిని కొలవలేక మమ్మల్ని కాపాడినోళ్ళ చరిత్రకే మా మొక్కులు'' అని కవయిత్రి చెప్పినట్టుగా సామాన్యజనుల ఆరాధన అది. సమత కోసం మాట్లాడే జీయరు గారు, పరమతాల పట్ల, ఆచార సంప్రదాయాల పట్ల ఇంత అసహనంగా వ్యవహరించడం అతని కుచ్చిత మనసును తెలుపుతుంది. రియలెస్టేట్ వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న అసలైన వ్యాపార కేంద్రకం ఆయన. తెలంగాణ ప్రాంతీయ సంస్కృతిని అవహేళన చేస్తూ వెక్కిరించడం పట్ల ఇక్కడి ఆదివాసులు, గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పుడే కాదు, ఇంత క్రితం కూడా ఆహారపు అలవాట్ల పట్ల కూడా స్వామి, అజ్ఞానపు, అహంకారపు వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన నోటిదురుసుతనాలు, ఆధ్యాత్మిక, శాంతి వచనాలను ప్రవచించే స్వాములకు తగని పని.