Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. చంద్రశేఖర్
- 12న ఇందిరాపార్క్ వద్ద సన్నాహక సభ
నవతెలంగాణ-కాప్రా
కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. సమ్మె కార్యాచరణ రూపొందించడంలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూ, ఎన్టీయూసీ, ఈసీఐఎల్ కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం కాప్రాలోని ఏఐటీయూసీ ఆఫీస్లో సదస్సు నిర్వహించారు. ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంకర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఇతర ముఖ్యనాయకులు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాల వల్ల ఎయిర్ ఇండియా, రైల్వే, డిఫెన్స్, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, గ్యాస్, బ్యాంకింగ్ రంగాన్ని అంగట్లో వస్తువుల కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం వల్ల యువత పెడదారి పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ బిల్లుతో పాటు కార్మిక వ్యతిరేక చట్ట సవరణలను వెనక్కి తీసుకోవాలని కోరారు. 'కేంద్ర ప్రభుత్వం ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నది. ఇదేనా పరిపాలన. ఇదేనా దేశభక్తి అని కార్మికవర్గం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నది' అని చెప్పారు. ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 12న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న సన్నాహక సభను సక్సెస్ చేయాలని కోరారు. కార్యక్రమం సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గణేష్, ఉన్ని కృష్ణ, శ్రీనివాస్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ప్రవీణ్, శివబాబు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కె. శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శంకర్, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.