Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ హరగోపాల్
- రాజ్యాంగం గొప్ప బ్లూ ప్రింట్: ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ-ఓయూ
భారత రాజ్యాంగం ఎంతో తాత్వికత కలిగి ఉందని, ప్రస్తుత సందర్భాల్లో రాజ్యాంగం స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరముందని ప్రొఫెసర్లు హరగోపాల్ అన్నారు.
ప్రొఫెసర్ సి. కాశీం అధ్యక్షతన ఆల్ తెలంగాణ యూనివర్సిటీస్ టీచర్స్ ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగం-వివిధ దృక్పథాలు' అనే అంశంపై గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. రాజ్యాంగ రక్షణకు, రాజ్యాంగ బద్ద సమాజ నిర్మాణ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. స్వప్రయోజనాల కోసమే రాజ్యాంగ మార్పునకు ప్రయత్నం చేయడమంటే మూర్ఖత్వమే అన్నారు. కోదండరామ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక గొప్ప బ్లూ ప్రింట్ అని అభివర్ణించారు. తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ సి. కాశీం రాజ్యాంగం మౌలిక భావనలు, రాజ్యాంగ నిర్మాణ కాలం నాటి పరిస్థితులు, నవ భారత నిర్మాణం దిశగా ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలను సభ ముందు ఉంచారు. అనంతరం ప్రముఖ సామాజిక వేత్త డా. అరుణ గోగులమండ మాట్లాడుతూ తరతరాలుగా ఉన్న అంతరాల సమాజాన్ని మార్చాలంటే రాజ్యాంగమే దారి చూపుతుందన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతా గణేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఎటువంటి లోపాలు లేవని, వాటిని మారుతున్న సమాజానికి తగ్గట్టుగా రూపొందించుకునే అవకాశం కూడా భారత రాజ్యాంగం కల్పించిందని, మారాల్సింది పాలకుల బుద్ధి అని అన్నారు. ప్రఖ్యాత పాత్రికేయులు, సంపాదకులు సతీష్ చందర్ మాట్లాడుతూ అణచివేతకు గురైన వారికి మానవహక్కుల్ని అందించిన ఒక గొప్ప గ్రంథం, పేద ప్రజల తరుపున ఉన్న ఏకైక ప్రతిపక్షం రాజ్యాంగమేనని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడుకోడమే అన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగం దేశం పురోగామి దిశలో ప్రయాణం చేసే విధంగా రాయబడిందని, మహిళల హక్కులకు డా.అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ రూపొందించి పోరాటాన్ని సాగించారు. నేడు మహిళలకు కనీస హక్కులు అవకాశాలు దక్కాయంటే అవి డా.అంబేద్కర్ చేసిన పోరాట ఫలితమేనన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, ప్రొఫెసర్ కుమారస్వామి (పీయూ) డా. మధు (ఎంజీయూ), డా. మోహన్ బాబు (టీయూ), డా.లక్ష్మణ్ (అగ్రి యూ), తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.