Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాజశేఖర్
నవతెలంగాణ-బేగంపేట్
తెలంగాణలోని ప్రతి మారుమూల గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో 'పీఎంవాణి' (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్)ను అందుబాటులోకి తీసుకువచ్చామని టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాజశేఖర్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని సీటీఓ టవర్స్‌లో పీఎంవాణి బిజినెస్ ప్రమోషన్, ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి అనంతరం ఆన్లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాముఖ్యత పెరిగిందని, దీంతో డాటా వినియోగం కూడా బాగా ఎక్కువైందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 140 గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ఇలాంటి తరుణంలో మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు, ఉద్యోగులకు నెట్వర్క్ ప్రాబ్లం అధికంగా సంభవిస్తుందన్నారు. అలాంటి చోటులో గతంలోని పీసీఓ మాదిరిగా టెఎస్ అండ్ టెర టెక్నో సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సౌజన్యంతో పీడీఓ (పబ్లిక్ డేటా ఆఫీస్)ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గతంలో టెలిఫోన్ బూత్‌ల వద్ద ఎలా ఫోను ఉపయోగించేవారో అలానే పీడీఓలకు వచ్చి ఇంటర్నెట్ను వాడుకోవచ్చన్నారు. ఇందుకు పోస్ట్‌పెయిడ్ రూపంలో డబ్బులు చెల్లించాలన్నారు. అనంతరం టెఎస్ అండ్ టెర టెక్నో సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు సీఈఓ ఎస్వీవీ సంజీవ కుమార్ మాట్లాడుతూ ఇంటర్నెట్ వినియోగంలో గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి మధ్య తేడాను తొలగించాలని ప్రధాన లక్ష్యంతో పీఎంవాణి పేరిట పీడీఓలను ముందుకు తీసుకువచ్చామన్నారు. చిన్న దుకాణదారులు, చిరు వ్యాపారులు, పాన్‌షాప్, రెస్టారెంట్ల వారు ఈ పీడీఓ ల ద్వారా కనీసం రూ.4వేలు నుంచి రూ.10వేల వరకు అదనంగా సంపాదించుకునే అవకాశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.