Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు డాక్టర్లతోపాటు టీఎస్ఎంసీ అధికారి అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
విదేశాల్లో విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎఫ్ఎంజీఈ పరీక్షలో అర్హత లేకున్నా టీఎస్ మెడికల్ కౌన్సిల్లో నకిలీ రిజిస్ట్రేషన్లతో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఇద్దరు డాక్టర్లతోపాటు సహకరించిన అధికారిని సీసీఎస్ పోలీసులు, నార్త్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గురువారం సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ సీపీ గజారావు భూపాల్, డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి అడిషనల్ సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఇబ్రాహీంపట్నంకు చెందిన కాసరమోని శివానంద్, కర్మన్‌ఘాట్‌కు చెందిన తోట దిలీప్‌కుమార్ స్నేహితులు. చైనాలో 2012లో ఇద్దరూఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2012-2014లో ఇండియాలో 'ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్' (ఎఫ్ఎంజీఈ) పరీక్షను రాశారు. అయితే అందులో ఫెయిలయ్యారు. పరీక్షలో అర్హత సాధిస్తేగానీ విదేశాలల్లో పూర్తి చేసిన ఎంబీబీఎస్ పట్టాకు భారతదేశంలో ఎలాంటి గుర్తింపు ఉండకపోగా, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సైతం కాకపోవడంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. కోఠిలోని టీఎస్ మెడికల్ కౌన్సిల్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కందుకూరి అనితా కుమార్‌తో చేతులు కలిపారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాయకుండానే టీఎస్ మెడికల్ కౌన్సిల్లో తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రముఖ డాక్టర్ పేరుతో ఉన్న ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకుని తప్పుడు పత్రాలతో చలామణి అవుతున్నారు. ఇదిలావుండగా టీఎస్ మెడికల్ కౌన్సిల్లో ఐదేండ్లకోసారి డాక్టర్లు పట్టాను తిరిగి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఒరిజినల్ డాక్టర్ తన రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేసుకునేందు కోఠిÄలోని ప్రధాన కార్యాలయానికి రావడంతో అసలు విషయం వెలుగుచూసింది. తన ఐడీపై ఇతరుల పేర్లు రావడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ సీహెచ్.హనుమంతరావు ఫిర్యాదు మేరకు నార్త్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు సీసీఎస్ పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు కందుకూరి అనితా కుమార్ ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.9లక్షలు వసూలు చేసినట్టు అడిషనల్ సీపీ ఏఆర్.శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు ఇప్పటి వరకు దాదాపు నాలుగు రిజిస్ట్రేషన్లు చేసినట్టు తెలిసిందని, వాటిపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో ఇంకెంతమంది ప్రమేయం ఉందోనని ఆరా తీస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సైబర్‌క్రైమ్ ఏసీపీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుతోపాటు సీఐలు తదితరులు పాల్గొన్నారు.