Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రబ్బర్ స్టాంప్స్, నకిలీ ఐడీ పేపర్స్ స్వాధీనం
- వివరాలు వెల్లడించిన డీసీపీ చక్రవర్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
గెజిటెడ్ ఆఫీసర్‌గా చలామణి అవుతూ డాక్యుమెంట్లు, ఆధార్ ఎన్రోల్మెంట్లు జారీ చేస్తున్న నకిలీ గెజిటెడ్ ఆఫీసర్ (మాజీ అధికారి)తోపాటు అతనికి సహకరిస్తున్న మరో ముగ్గురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రబ్బర్ స్టాంప్స్, నకిలీ ఎంప్లాయిమెంట్ ఐడీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డీసీపీ జి.చక్రవర్తి వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌కు చెందిన పోగుల రవికుమార్ ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఉప్పుగూడకు చెందిన తాగారామ్ శాస్త్రీ ఛత్రినాకాలో టీజేఆర్ ఆన్లైన్ సర్వీసెస్‌ను కొనసాగిస్తున్నాడు. బంజారాహిల్స్‌కు చెందిన సయ్యద్ అజీజ్ అలీ టైపిస్టుగా కొనసాగుతున్నాడు. కూకట్‌పల్లికి చెందిన మణికంఠ పంజాగుట్టలో టీఎంకే ఎంటర్ ప్రైజెస్‌ను నిర్వహిస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని నలుగురూ కలిసి ఒక ముఠాగా ఏర్పాడ్డారు. ఇరిగేషన్ శాఖలో పనిచేసిన రవి కుమార్ 2000 సంవత్సరంలోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని 'డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టీఎస్ఐడీసీ వైఎస్ఆర్ భవన్, బంజారాహిల్స్ అడ్రస్'తో నకిలీ ఐడీని తయారు చేశారు. గెజిటెడ్ అధికారిగా చలామణి అవుతున్నాడు. ఇందుకు ముగ్గురు సహకరిస్తున్నారు. ఆధార్ ఎన్రోల్మెంట్, ఇతర డాక్యుమెంట్ల కోసం గెజిటెడ్ సంతకాలు చేస్తున్నారు. ముఖ్యంగా అడ్రస్, పేరు, పుట్టిన తేదీ మార్పుతోపాటు తదితర డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తూ నకిలీ రబ్బర్ స్టాంప్స్ వేస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.50 నుంచి 100 వరకు వసూల్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నిందితులను అరెస్టు చేశారు.