Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో 60 వేల మంది లబ్దిదారులు
- క్షేత్రస్థాయిలో పరిశీలన ఇప్పటికిప్పుడు కష్టమే
- యాప్ ఆధారంగా మంజూరు చేసే అవకాశం
- ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రుల ప్రకటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
వయసుపైబడి అర్హత కలిగినవారు, ఒంటరి మహిళలు, వికలాంగులు ప్రభుత్వం అందించే పింఛన్కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వివిధ పింఛన్లకోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇంత వరకు విడుదల చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హతగలవారు ఎవరనేది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇవ్వాలనే విషయాన్ని పక్కనబెట్టి వయసు ధ్రువీకరణ, యాప్ ఆధారంగా పింఛన్లు ఇచ్చే విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును సడలించిన ప్రభుత్వం గతేడాది ఆగస్టు నెల 31వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. వయో పరిమితి సడలింపుతో 65 ఏండ్ల నుంచి 57కు కుదించిన నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 58వేలకుపైనే దరఖాస్తులు వచ్చాయి. వీరితో పాటు 2018 నుంచి ఆసరా వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మరో పదివేలకుపైనే ఉంటారు. వీరంతా పింఛన్లు ఎప్పుడు వస్తాయోనని కండ్లలో వృత్తులు వేసుకుని చూస్తున్నారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు మాత్రం తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చేనెల(ఏప్రిల్) నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు ప్రక్రియ చేపడుతామని ప్రకటించడంతో లబ్ధిదారుల్లో మరోసారి ఆశలు చిగురించాయి. కానీ దీనికి సంబంధించి నేటివరకు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు. ఇదే విషయాన్ని అధికారులు కూడా ధృవీకరిస్తూనే.. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అర్హులు, అనర్హులు అని చూడకుండా అందరికీ ఇవ్వవచ్చునని చెబుతున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 1.97లక్షలకుపైగా లబ్ధిదారులు వివిధ రకాల ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్దులు 53,670 వికలాంగులు 27890, వితంతువులు 97105, ఒంటరి మహిళలు 9112, చేనేత కార్మికుల 06, బీడీ కార్మికులు 51, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 9340, బోధకాలు 35 మంది ఉన్నారు. వీరిలో వికలాంగులకు రూ.3016, మిగతావారికి రూ.2016చొప్పున ప్రభుత్వం ప్రతినెల పింఛను అందిస్తోంది. ఇందుకుగాను ప్రతినెలా రూ.43వేల కోట్లు బడ్జెట్ విడుదల చేస్తుంది. ప్రతినెల క్రమం తప్పకుండా ఇస్తుండడంతో ఈ పథకంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టులో చేర్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు వారికి పింఛన్ అందించేందుకుగాను అప్పట్లో ఓటర్ జాబితా ఆధారంగా మండలాల వారీగా లెక్కలు తీయగా 30వేల మంది 57 ఏండ్లు పూర్తిచేసుకున్న వారు ఉంటారని అంచనా వేశారు. ఈ సర్వే చేసి కూడా దాదాపు మూడేండ్లకుపైగా గడిచిపోయింది. ఆ తర్వాత పలు ఉప ఎన్నికల సందర్భంగా ఆసరా పింఛన్లు మంజూరు ప్రకటనలు చేస్తూనే వచ్చింది సర్కారు. కానీ పింఛన్లు మంజూరు కాలేదు. ఆ తర్వాత 2020 ఆగస్టు పదిహేను రోజుల పాటు పింఛన్ మంజూరుకు 57 ఏండ్లు నిండిన వారి నుంచి మరోమారు దరఖాస్తులు స్వీకరించగా.. హైదరాబాద్లోని 16 మండలాల పరిధిలో కొత్తగా 58,546 మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసరా పింఛన్లపై చర్చ సందర్భంగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పాడంతో లబ్ధిదారులు మరోసారి ఆశగా ఎదురుచూస్తున్నారు.
360 డిగ్రీ యాప్ సహాయంతో లబ్దిదారుల ఎంపిక
ప్రభుత్వ పథకాల మంజూరుకు సర్కారు '360 డిగ్రీ' సమాచారాన్ని ప్రభుత్వం ప్రామాణికం చేసుకుంటుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబ సమాచారం సేకరించిన సర్కారు వారి ఆర్థిక, సామాజిక స్థితి ఆధారంగా ఆధునిక సాంకేతికను వినియోగించుకొని చకచకా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల కొత్తగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులకు తమ వద్ద నిక్షిప్తమైన డేటాను వాడిన విషయం తెలిసిందే. అనర్హులకు పథకాలు వెళ్లొద్దనే ఉద్దేశంతో సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసరా పింఛన్ల మంజూరు విషయంలో ఇదే సాంకేతికను వాడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పట్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి లబ్దిదారుల ఎంపిక చేయడం కష్టమేనంటున్నారు. ఆసరా మంజూరుకు ఎలాంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ క్రమంలో సాంకేతిక వైపు మొగ్గుచూపడం లేదా అందరికీ పింఛన్ ఇవ్వడమో చేయవచ్చుని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అందరికీ పింఛన్లు ఇవ్వాలి
ప్రభుత్వం ఇకనైనా ఎలాంటి కాలయాపన చేయకుండా తక్షణమే అందరికీ ఆసరా పింఛన్లు అందించాలి. నాలుగేండ్లుగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైనా ప్రతిఒక్కరికీ ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చేనెల(ఏప్రిల్) ఆసరా పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
- ఆర్.వెంకటేష్, హైదరాబాద్ సిటీ కార్యదర్శి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక